కోటి ఆశలతో ఖరీఫ్‌కు సిద్ధమైన రైతాంగం ఆశలు అడియాసలవుతున్నాయి. బలమైన కార్తెల కాలం వెళ్లిపోతున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు యాగాలు చేస్తున్నారు.
నిజాంసాగర్/బాల్కొండ: కోటి ఆశలతో ఖరీఫ్‌కు సిద్ధమైన రైతాంగం ఆశలు అడియాసలవుతున్నాయి. బలమైన కార్తెల కాలం వెళ్లిపోతున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు యాగాలు చేస్తున్నారు. నారుమళ్లు వేసుకొని నెలలు గడుస్తున్నా వానల జాడ కానరాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ప్రధాన జలాశయాలు నిజాం సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు పోచారం, కళ్యాణి, సింగితం, కౌలాస్ ప్రాజెక్టులలో నీటిమట్టాలు నిరాశాజనకంగా ఉన్నాయి.
వర్షాకాలం ఆరంభం నుంచి బలమైన వానలు కురవకపోవడంతో ఖరీఫ్ పంటల సాగు భవితవ్యం ప్రశ్నార్థకంగా మా రింది. ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలను నమ్ముకొని పంటల సాగు కోసం రైతులు ముందుగా సమాయత్తమయ్యారు. నారుమడులను సిద్ధం చేసుకున్నారు. చినుకు లు రాలకపోవడంతో చింతపడుతున్నారు. సుమారు నెల న్నర కిందట అలికిన నారుమళ్లు నాట్ల సమయాన్ని మించి పోతున్నాయి.
తగ్గుతున్న నీటిమట్టాలు
జిల్లాకు వరప్రదాయినిగా పేరున్న నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు పలు ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలు బోసిపో యి ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజె క్టు కింద ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 2.10 లక్షల ఎకరాలలో పంటలను సాగు చేయాలి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ర్ట, పొరుగు జిల్లాలలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. దీనికి అనుసంధానంగా ఉన్న సింగితం రిజర్వాయర్, కళ్యాణి ప్రాజెక్టులలోనూ నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడా అంతే
శ్రీరాంసాగర్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రాక పోవడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిరాశాజనకంగా ఉంది. ఏటా జూలై 20 నుంచి వరద నీరు ప్రాజెక్ట్‌లోకి ప్రారంభమయ్యేది. కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా బిన్నంగా ఉంది. నీటి మట్టం పెరగవలసిన సమయంలో క్రమంగా తగ్గుతోంది. దీంతో రైతులు కలవర పడుతున్నారు. 18 లక్షల ఎకరాల పరిస్థితి దయనీయంగా మారింది.
ఎగువ ప్రాంతాల నుంచి రావల్సిన వరదలకు బాబ్లీ ప్రాజెక్ట్‌ను, అనేక చెక్‌డ్యాములను అడ్డుగా కట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం పెరగడం లేదు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 1067.40 అడుగులు నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్ లో 1,076 అడుగుల నీరు నిల్వ ఉంది.