సారంగాపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని అడెల్లి గ్రామం వద్ద చేపడుతున్న ప్రాణహిత చేవేళ్ల వరదకాలువ పనులను మంగళవారం డీసీఎంఎస్ అధ్యక్షుడు అయిర నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చే వరదనీరు వృథాగా పోకుండా వరదకాలువ ద్వారా మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌కు తరలించాల్సి ఉందని నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిండాక మిగులు వరదనీటిని నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్ చెరువులోకి హైలెవెల్ కాలువ ద్వారా తరలించేందుకు ప్రాణహిత చేవేళ్ల కాలువ పనులు చేపడుతున్నారని తెలిపారు.
ఈ పనులను తొలుత ఎస్సారెస్పీ నుంచి స్వర్ణ ప్రాజెక్టు వరకు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా స్వర్ణ ప్రాజెక్టు నుంచి బంగల్‌పేట్ చెరువు వరకు ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి నాయుడును ప్రశ్నించారు. ఈ చర్యతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ఇబ్బందిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాణహిత చేవేళ్ల పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ గంగాధర్‌కు వినతిపత్రం అందించారు. స్వర్ణ ప్రాజెక్టు చైర్మన్ ఓలాత్రి నారాయణరెడ్డి, మార్కెట్ చైర్మన్ దశరథ రాజేశ్వర్, అడెల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు గుమ్మల రవి, నాయకులు రాజేశ్వర్‌రావు, ఉట్ల రాజేశ్వర్, కరిపె పోతన్న, రవి ఉన్నారు.
ప్రాణహిత-చేవేళ్ల పనులు అడ్డుకున్న రైతులు
Published Wed, Dec 25 2013 1:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement