Sarangapur
-
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి
సాక్షి, నిర్మల్: సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయంతో పాటు అదే ప్రాంగణంలోని కస్తూరిబా విద్యాలయంలో శనివారం ఓ అగంతకుడు చొరబడి విద్యార్థులు నిద్రిస్తున్న గదుల్లో సంచరించాడు. గత గురువారం సైతం ఇదే విధంగా రావడంతో గమనించిన సిబ్బంది, విద్యార్థులు కేకలు వేశారు. వెంబడించడంతో పరారయ్యాడు. శనివారం రాత్రి సేమ్ సీన్ రిపీట్ కావడంతో విద్యార్థులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి అక్కడికి చేరుకుని వి ద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. అగంతకుడు కేజీబీవీ వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాగ లతను వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తి రెండు సార్లు వచ్చిన విషయం వాస్తవమేనని, త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కేజీబీవీ ఎస్వో అన్నపూర్ణను వివరణ కోరగా.. వెనుకవైపు ప్రహరీని మూపివేయకపోవడంతో అగంతకుడు లోనికి వ చ్చాడని, ఈమేరకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. -
నెలల గర్భిణికి ఫిట్స్.. అరగంట ముందొస్తే బతికేది...
సారంగపూర్ (నిర్మల్): ఆమె ఏడు నెలల గర్భిణి. అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కంకర పరిచి వదిలేసిన రోడ్డు.. మరోచోట కోతకు గురైన రహదారి.. దీంతో సకాలంలో ఆ గర్భిణి ఆస్పత్రికి చేరలేకపోయింది. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. గురువారం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం హనుమాన్‌తండాలో జరిగిన ఈ ఘటన విషాదం మిగిల్చింది. పవార్ సురేందర్ భార్య కార్తీక ఏడు నెలల గర్భిణి. గురువారం ఆమెకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నిర్మల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. హనుమాన్‌తండా నుంచి సేవానగర్, దుర్గానగర్ మీదుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఆర్అండ్బీ రోడ్డు ఉంది. తండా నుంచి దుర్గానగర్ వరకు నాలుగు కిలోమీటర్ల దారిలో కాంట్రాక్టర్ రెండు నెలలుగా కంకర పరిచి వదిలేశాడు. పని పూర్తి చేయించడంలో అధికారులూ అలసత్వం ప్రదర్శించారు. నరకప్రాయంలాంటి ఈ రోడ్డుపై 108 వాహనం హనుమాన్‌తండా వరకు వెళ్లలేని పరిస్థితి. దీనికితోడు మధ్యలో హైలెవల్ కాలువ వద్ద, దుర్గానగర్ వద్ద రోడ్డు కోతకు గురైంది. కార్తీకను అతికష్టం మీద కంకర పరిచిన రోడ్డుపై ఆటోలో కొంతదూరం తరలించి, అనంతరం కారులో నిర్మల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కంకర పరిచిన రోడ్డు ప్రయాణంలో విపరీతమైన కుదుపులతో కార్తీక తీవ్ర అవస్థలు పడింది. ఎట్టకేలకు నిర్మల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. అరగంట ముందుగా ఆసుపత్రికి తీసుకొస్తే ఉంటే గర్భిణి సురక్షితంగా ఉండేదని వైద్యులు తెలిపారు. రోడ్డు మార్గం సరిగ్గా ఉంటే తన భార్య బతికేదని, ఆమె మృతికి అధికారులు, కాంట్రాక్టరే బాధ్యులని ఆమె భర్త సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
షూటింగ్ స్పాట్..! సారంగాపూర్
సారంగపూర్(నిర్మల్): సినిమా షూటింగ్‌లు, షార్ట్‌ఫిల్మ్స్ చిత్రీకరణకు నిర్మల్ జిల్లా సారంగాపూర్ ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడి ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులవుతున్న సినీ నిర్మాతలు.. చిన్నచిన్న షార్ట్ ఫిల్మ్స్ దర్శకులు ఇక్కడే చిత్రీకరణ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మండలంలోని లక్ష్మీపూర్ చెరువుకట్టతోపాటు మహబూబాఘాట్స్, చించోలి(బి) గ్రామ సమీపంలోని గండిరామన్న హరితవనం, తదితర లోకేషన్లు ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. ఇక్కడి అందాలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారు. అడెల్లి మహాపోచమ్మ ఆలయ పరిసరాలు, పక్కనే ఉన్న హరితవనం సైతం ప్రకృతి అందాలతో అందరినీ అలరిస్తోంది. ఇటీవల బోరిగాం, లక్ష్మీపూర్ చెరువుకట్ట, గండిరామన్న హరితవనంలో యువ దర్శకుడు రవి, నిర్మాత కిరణ్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. యువకులు పెద్ద సంఖ్యలో ఆయా ప్రదేశాలకు చేరుకుని షార్ట్‌ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఒంపుసొంపుల మహబూబాఘాట్స్.. నిర్మల్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన గుట్టలను చీల్చుకుంటూ ఉన్న మహబూబాఘాట్స్ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ ఘాట్స్మీదుగా వెళ్లే ప్రతిఒక్కరూ ఆగి అందాలను వీక్షిస్తుంటారు. మూలమలుపుల వద్ద ఆగి.. అవసరమైతే భోజనాలు చేసి మరీ వెళ్తుంటారు. సారంగాపూర్ మండల కేంద్రం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వతశ్రేణిని ఆనుకుని ఉన్న అడెల్లి మహాపోచమ్మ ఆలయం, పక్కనే ఉన్న అడెల్లి మహాపోచమ్మ నందనవనం సైతం అందాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇంతటి ప్రకృతి అందాలకు ప్రభుత్వం గుర్తింపునివ్వడంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే పర్యాటక ప్రదేశాలుగా విరాజిల్లే అవకాశముందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. కోనసీమకు తీసిపోని అందాలు మండలకేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్లు, జిల్లా కేంద్రం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపూర్ చెరువు కట్ట కోనసీమ అందాలను తలపిస్తోంది. వెంగ్వాపేట్ సమీపంలోని ఈ చెరువు పక్కనే ఉన్న గుట్టమీద లక్ష్మీపూర్ ఉంది. పక్కనే చెరువు, చుట్టూ తాటిచెట్లు, పచ్చని పంటపొలాలు ఇవన్నీ కోనసీమ అందాలను మైమరిపిస్తున్నాయి. కాలుష్యం లేకుండా నిత్యం గ్రామం ఆహ్లాదభరితంగా ఉంటుంది. వెంగ్వాపేట్ నుంచి చించోలి(బి) గ్రామానికి వెళ్లేందుకు చెరువు కట్టమీదుగా బీటీరోడ్డు వేయడంతో గ్రామానికి మరింత సోయగం పెరిగింది. అందాల హరితవనం నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే చించోలి(బి) సమీపంలో నిర్మించిన గండి రామన్న హరితవనం ప్రకృతి అందాలు పరుచుకుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో పార్కులో సకలసౌకర్యాలు కల్పించారు. ఆహ్లాదం కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. పిల్లలు, పెద్దలు సేద తీరడానికి అనువుగా అనేక వస్తువులు అందుబాటులో ఉంచారు. సహజసిద్ధంగా ఉన్న బండరాళ్లు, ఎత్తైన చెట్లు ఉండటంతో సినిమా షూటింగ్‌లకు సైతం అనువైన ప్రదేశంగా మారింది. 2019 నవంబర్‌లో హీరో సాయికుమార్, హీరోయిన్ ఆమని, హీరో నితిన్‌చంద్ర, యువ హీరో సాయి నేతృత్వంలో బోరిగాంలో సినిమా షూటింగ్ చిత్రీకరించారు. ఇదే సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవల చించోలి(బి) సమీ పంలోని గండిరామన్న హరితవనంలో చిత్రీకరించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ కిరణ్మారుతి ఇటీవల లక్ష్మీపూర్ చెరువుకట్టపై ఫోక్ సాంగ్స్ రూపొందించారు. -
నిందితులంతా నేర చరితులే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 3 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులంతా నిజామాబాద్ శివారు లోని సారంగాపూర్ గ్రామానికి చెందిన వారని తేలింది. శుక్రవారం సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పా ల్పడి..సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిం చిన విషయం విదితమే. ప్రధాన నిందితుడు మక్కల సురేశ్‌తోపాటు నాగరాజు, శంకర్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల నేర చరిత్ర అఘాయిత్యానికి పాల్పడిన నిందితులకు నేర చరిత్ర ఉంది. నిందితుల్లో ఒకరైన నాగరాజు ఆటో నడుపుకుంటూ జులాయిగా తిరుగుతుంటాడు. గతంలో ఇదే గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి ఓ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. మిగిలిన నిందితులపై కూడా 6వ టౌన్ పోలీస్‌స్టేషన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందుకు వివరాలు వెల్లడించడం కుదరదని కేసు దర్యాప్తు అధికారి రఘునాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిందితులను వెంటనే పట్టుకోండి: డీజీపీ సారంగాపూర్ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆరా తీశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సీపీ కార్తికేయను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు అధికారి రఘునాథ్, ఏసీపీ శ్రీనివాస్‌లతో కేసు పురోగతిపై సమీక్షించారు. పోలీసులకు చిక్కారిలా.. ప్రధాన నిందితుడు మక్కల సురేష్ యువతిని ద్విచక్ర వాహనంపై సారంగాపూర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చారు. రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. ఆటోలో వచ్చి ఆరుగురు ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీన్ని మరో ఇద్దరు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఓ కేసు విచారణ నిమిత్తం అటువైపు వెళ్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్లకు రోడ్డు పక్కన కొంత దూరంలో ఆటో కనిపించింది. నిర్మానుష్య ప్రాంతంలో ఆటో ఉండటాన్ని అనుమానించిన పోలీసులు అటువైపు వెళ్లి చూడగా.. ఆటోలో కూర్చుని సెల్ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు యువకులు కనిపించారు. వారిని ప్రశ్నించగా.. ఏడుగురు స్నేహితులం బహిర్భూమికి వచ్చామంటూ దాటుకునే ప్రయత్నం చేశారు. గద్దించి అడుగగా.. వారికి ఫోన్ చేయించి స్పీకర్ ఆన్ చేయించడంతో యువతి అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా అని తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని నిజామాబాద్ మండలం సారంగాపూర్ శివారులో దారుణం చోటుచేసుకొంది. సినిమా అని చెప్పి ఓ యువతిని బయటకు తీసుకెళ్ళి ఆరుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేస్తుండగా మరో యువకుడు వీడియో చిత్రీకరించాడు. శనివారం బాధితురాలు నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనకు వ్యతిరేకంగా జిల్లాలోని మహిళా సంఘాలు, ఐద్వా నాయకురాలు సబ్బని లత ఆసుపత్రికి వచ్చి సంఘీభావం తెలిపారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ప్రియుడు సురేష్, తన కూతురిని సినిమా అని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వాపోయారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు అధికారులు తెలిపారు. -
న్యూజిలాండ్ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : న్యూజిలాండ్ పంపిస్తానని ఓ యువకుడిని మోసగించిన ఇద్దరిపై సారంగాపూర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. మండలంలోని పోచంపేట గ్రామానికి చెందిన శీలం రాజేశం కుమారుడు ప్రవీణ్‌కుమార్ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన అత్తినేని రాజిరెడ్డి, రాజేశంను కలిసి మీ కుమారుడిని న్యూజిలాండ్‌కు పంపించడానికి ఆంధ్రపదేశ్‌లోని గుంటూర్ జిల్లాకు చెందిన గుంటుక శ్రీకాంత్‌రెడ్డి ఉన్నాడని తెలిపాడు. రాజేశం, ఆయన కుమారుడు ప్రవీణ్‌లు రాజిరెడ్డి చెప్పిన మాటలు నమ్మారు. శ్రీకాంత్‌రెడ్డి, రాజిరెడ్డి ఇద్దరు కలిసి రాజేశం, ప్రవీణ్ వద్దకు వచ్చి న్యూజిలాండ్ వెళ్లడానికి రూ. 2.50 లక్షలు ఖర్చు అవుతుందని, అక్కడ మంచి కంపెనీలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నకలీ పత్రాలను వారికి చూపించారు. వీరి మాటలు నమ్మిన బాధితులు నెల క్రితం రూ.2.50 లక్షలు శ్రీకాంత్‌రెడ్డి చేతిలో పెట్టారు. న్యూజిలాండ్‌కు రేపుమాపు వెళ్లడం అంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన రాజేశం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘రాజన్నా.. ఇదేం లెక్క!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన దుబ్బరాజన్న ఆలయానికి ఈ ఏడాది భారీగా ఆదాయం సమకూరింది. అయితే అదేస్థాయిలో ఖర్చులూ పెరిగిపోయాయి. ఈ వ్యవహారం ఆలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆదాయం భారీగానే వచ్చినా.. ఎప్పుడూ చిల్లిగవ్వ మిగలేదికాదని, ఏయేడు ఖర్చును బాగా తగ్గించి స్వామివారి పేరున రూ.8 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేశామని ఆలయ అధికారులు చెబుతున్నా.. ఆలయ ఆదాయ, వ్యయాలపై వారం క్రితం జరిగిన సమావేశంలో విడుదల చేసిన కాపీలను భక్తులు జిరాక్స్తీసి.. ప్రజలకు పంచుతూ.. ఖర్చులు ఇలా ఉంటే.. ఆలయం ఎలా అభివృద్ధి సాధిస్తుందంటూ ప్రచారం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇదీ ఆలయ చరిత్ర జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో.. సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్ గ్రామ సరిహద్దుల్లో ఉంటుందీ ఆలయం. 1982లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి చేరింది. ఇసుకదిబ్బపై స్వయంభూగా వెలిసిన ఆలయం కావడంతో అనతికాలంలో ప్రసిద్ధి చెందింది. రూ.40 వేల ఆదాయంతో ప్రారంభమైన ఆలయ ప్రస్థానం.. ఇప్పుడు రూ.కోటికి చేరింది. 2017–18 ఆదాయ, వ్యయాలు స్వామివారికి భక్తుల ద్వారా మొత్తం ఆదాయం రూ. 84,87,887గా వచ్చింది. ఇందులో నికర ఆదాయం రూ.74,75,191. ప్రారంభ బ్యాంక్ నిలువ రూ.10,12,696. స్వామివారి హుండీ ద్వారా రూ.27,48,953, కోడెమొక్కు ద్వారా రూ. 11,47,650, అభిషేకం ద్వారా రూ.3,34,000, అన్నపూజ ద్వారా 84వేలు, కుంపటి 46,620, గజశూలం 13,860, గదుల కిరాయిద్వారా రూ.20,500 వచ్చింది. ప్రత్యేకాభిషేకం 80,800, కేశఖండనం ద్వారా రూ.35,010, పెద్ద వాహనపూజ రూ.17,800, ద్విచక్రవాహన పూజ రూ.27,100, వివాహాల ద్వారా రూ.8,848, ఆంజనేయ, నవగ్రహపూజల ద్వారా రూ.3 వేలు, గండదీపంతో రూ.98,740, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,40,350, శావతో రూ.10వేలు, లడ్డూప్రసాదంతో రూ.6,58,805, పులిహోరతో రూ.4,54,560, నిజకోడే మొక్కు రూ.2,232, స్వామివారి కల్యాణం రూ.1,37,500, కొబ్బరికాయలు, పూజసామగ్రి వేలం ద్వారా రూ.5.50లక్షలు, తలనీలాలు రూ.2,05,555, కొబ్బరిముక్క ల వేలం రూ.1.75లక్షలు, కోడెల వేలం రూ. 1,31,378, కల్యాణకట్నాలు రూ.33, 940, బ్యాం క్ వడ్డీలు రూ.55,637, విదేశీ కరెనీ రూ.12,150, ఇతర ఆదాయం రూ.41,203గా సమకూరింది. ఖర్చులు ఇలా.. స్వామివారి ఆదాయం నుంచి మొత్తం రూ. 84,87,887 ఖర్చు చేశారు. ఇందులో వ్యయం రూ.76,29,139, ముగింపు నగదు నిలువ రూ. 1,57,650, ముగింపు బ్యాంక్ నిలువ రూ. 7,01, 103గా పేర్కొన్నారు. పద్దుల వారీగా పరిశీలిస్తే .. అర్చక, సిబ్బంది వేతనాలు రూ.14,28,633, నివేదనకు రూ.98,870, ప్రింటింగ్, స్టేషనరీ, పోస్టేజీ రూ.79,727, కరెంటు బిల్లు, సామగ్రి, మరమ్మతు రూ.1,75,069, మహాశివరాత్రి జాతరకు రూ.9,46,198, ఇతరాలు రూ.11,09,868, కంట్రిబూషన్ కింద రూ.11,08,414, ఆరోగ్యం, పారిశుధ్యం రూ.87,385, మైనర్ రిపేర్స్ రూ. 1,80,542, ఫర్నిచర్ రూ.26,400, నాయీబ్రాహ్మణ వారి ప్రతిఫలం రూ.4,500, ప్రసాదం తయారీ రూ.6,90,180, రుద్రాభిషేకం రూ.12,055, ఏడా ది పండగల ఖర్చు రూ.2,24, 023, అధికారుల టీఏ, డిఏ రూ.12,410, రంగులకు రూ. 1,21,337, అన్నదానం రూ. 2,92,146, ప్రచార ఖర్చు రూ.1,66,679, వీఐపీలు రూ.29,710, ఎఫ్డీఆర్ రూ.8లక్షలు, కోర్టు ఖర్చులు రూ.10వేలు, కోనేరురిపేర్, నిర్వహణకు రూ.38,450, ధర్మకర్తల అలవెన్స్ రూ.1.10లక్షలు, లాకర్కిరాయి రూ.8,576, చౌల్ట్రీ రిపేర్స్ రూ.40వేలు, చలవ పందిళ్లు, టెంట్లు రూ.1,98,020, పూజ సామగ్రి రూ.79,738, కొడెల నిర్వహణ రూ.39,940, బ్యాంక్ చార్జీలు రూ.3,169, లేబర్ చార్జీలు రూ.56,230, ధార్మిక కార్యక్రమాలు రూ.29,275, గ్రాట్యూటీ రూ.2 లక్షలు ఖర్చు చేశారు. -
ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే...
సారంగాపూర్ : ‘నా ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా’ నని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న అన్నారు. ఆదివారం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దుబ్బరాజన్న ఆలయంలో మహంకాళి రాజన్నను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతోనే గ్రామాల్లో క్రియాశీల రాజకీయాలను ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల అధ్యక్షులు అనంతుల గంగారెడ్డి, పొరండ్ల గంగారెడ్డి, ప్రధానకార్యదర్శులు బొమ్మ ప్రమోద్, రామానుజం, ఉపసర్పంచ్ స్వామి పాల్గొన్నారు. -
భూమి పట్టా చేయడంలేదని ఆత్మహత్యాయత్నం
సారంగాపూర్: కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చిట్యాల గంగయ్య అనే వ్యక్తి 2001లో సర్వే నంబర్ 210లో ఎకరం భూమిని జితేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. అతను చనిపోవడంవతో ఆ భూమి తమదేనని అతని కుటుంబ సభ్యులు అంటున్నారని, భూమి పట్టా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అతను ఆత్మహత్యకు యత్నించాడు. ఇతనిని ఆస్పత్రికి తరలించారు. -
రోల్లవాగు టెండర్ లోగుట్టేమి?
రూ.55 కోట్లతో ఆధునికీకరణ పనులు 16 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు గడువు ముగిసి పది రోజులైనా టెండర్లు తెరవని వైనం వరదలేనా... ప్రజాప్రతినిధి ఒత్తిడే కారణమా? సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సారంగాపూర్ మండలంలోని రోల్లవాగు టెండర్లలో జాప్యం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. సెప్టెంబర్ 22న తెరవాల్సిన టెండర్లు నేటికీ తెరవకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా? లేక రాజకీయ నేతల ఒత్తిళ్లా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు తన అనుకూలమైన వ్యక్తికి టెండర్ కట్టబెట్టేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు మాత్రం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగానే టెండర్లు తెరవడంలో జాప్యం జరిగిందని సెలవిస్తున్నారు. టెండర్ పిలిచిందిలా.... రూ.55 కోట్ల వ్యయంతో రోల్లవాగు ఆధునికీకరణ పనులకు ఆగస్టు 31న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో బండ్ నిర్మాణానికి రూ.41 కోట్లు, మత్తడి నిర్మాణానికి రూ.14 కోట్లు ఖర్చు చేయనున్నారు. సెప్టెంబర్ 14 టెండర్ దాఖలకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. అదే నెల 22న టెండర్‌ను తెరవాలని షెడ్యూల్ ఖరారు చేశారు. మరోవైపు టెండర్‌ను దక్కించుకునేందుకు దాదాపు 16 మంది కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా గడువు ముగిసి నేటికి పది రోజులవుతున్నా టెండర్‌ను తెరిచిన దాఖలాల్లేవు. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా టెండర్ తెరవాల్సినప్పటికీ అధికారులు ఆ పని ఎందుకు చేయలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే టెండర్లు తెరవడం లేదనే విమర్శలొస్తున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు టెండర్లు తెరవీనయకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఎంపీకి అనుకూలమైన వ్యక్తికి ఇప్పించేందుకే టెండర్ తెరవనీయడం లేదనే ప్రచారం కాంట్రాక్టర్లలో జరుగుతోంది. ఇదీ లక్ష్యం... సారంగాపూర్ మండలంలో ఉన్న రోల్లవాగు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.25 టీఎంసీ నీరు నిల్వ ఉంది. రోల్లవాగు ప్రాజెక్టును ఆధునికీకరించడం ద్వారా 19 అడుగుల నీటి సామర్థ్యంతో ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయవచ్చని అధికారులు ప్రతిపాదించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే డి–53,12 ఎల్ ద్వారా 250 నుంచి 300 క్యూసెక్కల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. తద్వారా సారంగాపూర్ మండలంలోని 11 గ్రామాలు, ధర్మపురి మండలంలోని పలు గ్రామాల్లోని దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. దీంతోపాటు సారంగాపూర్ మండలం బీర్పూర్, నర్సింహులపల్లె, తుంగూర్, ఇందిరానగర్‌లతోపాటు ధర్మపురి మండలంలోని ఐదు గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని ఫిల్టర్బెడ్ల ద్వారా సరఫరా చేయనున్నారు. దీంతోపాటు రోల్లవాగు, నర్సింహులపల్లె, చెర్లపల్లి గ్రామాలను ఆనుకొని ఉన్న బుగ్గచెరువు రెండింటిని కలిపి, ప్రస్తుతం ఉన్న కట్టను 550 మీటర్ల దిగువకు జరిపి కొత్తగా కట్ట నిర్మించనున్నారు. మరోవైపు రోల్లవాగు ఆధునికీకరణవల్ల 642 ఎకరాలు ముంపుకు గురికానున్నాయి. ఇందులో 119 ఎకరాలు ప్రభుత్వ భూమి, 222 ఎకరాలు అటవీశాఖ భూములు కాగా... మిగతావి పట్టా భూములు. అటవీశాఖ కోల్పోతున్న భూమికి భారీ నీటిపారుదల శాఖ ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం వద్ద ఉన్న 222 ఎకరాల భూమిని అడవుల అభివృద్ధి చేసేందుకుSఅటవీశాఖకు అప్పగించనుంది. ఐదేళ్లపాటు అడవుల అభివృద్ధి మెయింటెనెన్స్ కింద రూ.52 లక్షలు కేటాయించారు. పట్టా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడానికి రూ. కోటి కేటాయించారు. వరదల వల్ల జాప్యమైంది – ఎస్సారెస్పీ ఎస్ఈ, సతీష్‌కుమార్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 22న టెండర్ తెరవాల్సి ఉంది. కానీ ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల ఎస్సారెస్పీ కాలువల నీటి విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉండి టెండర్‌పై శ్రద్ధ పెట్టలేకపోయాం. ప్రస్తుతం ఈ టెండర్‌కు సంబంధించి ఎవాల్యుయేషన్ జరుగుతోంది. సోమవారం టెండర్ తెరిచి ఆన్లైన్లో పెడతాం. -
ఉరకలేస్తున్న గోదావరి
సారంగాపూర్ : మండలంలోని పలుగ్రామాల తీరం వెంబడి ప్రవహిస్తున్న గోదావరి ఉరకలేస్తోంది. దీంతో కమ్మునూర్, చిన్నకొల్వాయి, చిత్రవేణిగూడెం, మంగేళ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కమ్మునూర్లోని పుష్కరఘాట్లపై నుంచి ఆంజనేయస్వామి ఆలయం సమీపం వరకు నీరు చేరింది. చిన్నకొల్వాయిలో ఎత్తిపోతల పథకంకోసం ఏర్పాటు చేసిన రక్షణ గోడ మునిగింది. మంగేళ గ్రామం ఎత్తిపోతల పథకాలను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది. చిత్రవేణిగూడెంలోనూ గోదావరి ప్రవాహం ఆందోళన కలిగించే స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీటి ఉధృతి పెరిగింది. -
సారంగాపూర్‌లో దారుణం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. భర్తపై భార్య, అత్త కిరోసిన్ పోసి నిప్పటించారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి సమీపంలోని వారు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... భార్యను ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లితో గొడవపడి విద్యార్థిని ఆత్మహత్య
సారంగాపూర్ (కరీంనగర్) : తల్లితో గొడవ పడి ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎం.అఖిల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంట్లో ఏ పనీ చేయవని, తిని కూర్చుంటావని శుక్రవారం సాయంత్రం అఖిలను తల్లి మందలించింది. శనివారం ఉదయం కూడా పని విషయమై తల్లీ కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు బయట ఉన్న సమయంలో అఖిల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
సారంగపూర్ (కరీంనగర్) : ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో.. ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం కోనాపూర్ శివారులో శనివారం చోటుచేసుకుంది. కోనాపూర్‌కు చెందిన గాంధారి మహేష్(40) అనే వ్యక్తి బైక్ పై సారంగపూర్ వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోకి చేరుకొగానే బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఢిల్లీలో కరీంనగర్ జిల్లా విద్యార్థి ఆత్మహత్య
సారంగాపూర్: కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం నర్సింహులపల్లె గ్రామానికి చెందిన విద్యార్థి చెర్పూరి దినేష్‌యూదవ్(22) ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సింహులపల్లెకు చెందిన రవికుమార్, మాధవిల రెండో కుమారుడైన దినేష్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో బీఆర్క్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడి హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఆదివారం సాయంత్రం హాస్టల్‌కు వచ్చిన దినేష్ ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే దినేష్ తల్లితండ్రులతో పాటు ఇతర కుటుంబసభ్యులు సోమవారం ఢిల్లీ వెళ్లారు. దినేష్ మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి అని బంధువులు తెలిపారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే డె్రహుడూన్లో ఆర్ఐఎంసీ పోటీ పరీక్షలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికే అవకాశం ఉండగా, దీనిని దినేష్ సాధించినట్లు బంధువులు తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన పరీక్షల్లో రెండుసార్లు మూడో టాపర్‌గా నిలిచాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో కొంత వెనకబడిపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
విద్యుత్ కోసం రైతుల రాస్తారోకో
సారంగాపూర్: నెల్లూరు జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ సబ్‌స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు మంగళవారం స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత వారంరోజులుగా తమకు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పొట్ట దశలో ఉన్న వరిపంట, పత్తి, పసుపు పంటలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ సరఫరాలో వారంరోజలుగా అంతరాయం ఏర్పడిందని ఆరోపించారు. లైన్లో సమస్యలున్నా వాటిని గుర్తించక వారం రోజుల పాటు తాత్సారం చేశారని దాని ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ట్రాన్స్‌కో ఏఈ దేవరావు సబ్‌స్టేషన్‌కు చేరుకుని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అంతకు ముందు రైతులు ట్రాన్స్‌కో ఏడీకి సమస్యను ఫోన్‌ద్వారా వివరించారు. అయితే ఆయన స్పందించి వెంటనే సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సారంగాపూర్ లో అర్ధరాత్రి చోరీ
కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం అర్పపల్లిలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి మూడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలో ఈశ్వర్, ప్రకాశ్ కుటుంబ సభ్యులు ఇళ్ల ముందు ఆరు బయట నిద్రించగా... కిషన్ కుటుంబ సభ్యులతో కలసి వేరే ఊరు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు మూడు ఇళ్లల్లోకి చొరబడి బీరువా తలుపులు బద్దలు కొట్టి.. సుమారు పది తులాల బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. సోమవారం చోరీ విషయాన్ని గమనించి.. విషయం గ్రామ సర్పంచ్ కి తెలిపారు. గ్రామ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్..
పొలమే ఇల్లయితంది.. నా పేరు రాయిడి చిన్నయ్య. మాది సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామం. నాకు మూడెకరాల వ్యవసాయం ఉంది. ఇందులో ఒక బోరుబావి ఉంది. ఈ ఏడాది పత్తి, మిర్చి పంటలు సాగుచేశాను. పొద్దున పంటపొలానికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికి వస్తున్నం. భోజనం చేసిన వెంటనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి కరెంటు ఇవ్వడంతో పొలానికి వెళ్లిపోతున్నం. రాత్రింబవళ్లు పంటపొలంలోనే గడపాల్సి వస్తంది. రాత్రిపూట పొలంగట్ల వెంబడి నడుస్తుంటే పాములు, తేళ్లు సంచరిస్తున్నాయి. అయినా ప్రాణాలు లెక్కచేయకుండా పంటలకు నీరందిద్దామంటే ఇచ్చే కరెంటులో తరచూ కోతలు విధిస్తున్నరు. సాగుకు దిగింది మొదలు.. దిగుబడి వచ్చి.. పంట అమ్ముకునే వరకూ రైతన్న పరిస్థితి దయనీయం. ఆరు గాలం.. రాత్రి, పగలు తేడా లేకుండా కష్టించాల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కరెంటు కోతలు విధి స్తుండడం.. రాత్రిల్లో సరఫరా చేస్తుం డడంతో రైతుల పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. సాగు సమరంలో రైతుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్.. బోర్ల వద్దే జాగారం కుంటాల : వరుస కష్టాలతో అన్నదాత ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలకు తోడు కరెంట్ కష్టాలు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం సాగవుతున్న పంటలకు తగినంత వర్షం లేక.. విద్యుత్ మోటార్ల ద్వారా పంటలను కాపాడుకునేందుకు కరెంట్ కోసం రైతులు కారు చీకట్లో నిద్రాహారాలు మాని చేళల్లోనే జగారాం చేస్తున్నారు. కాలం కలిసిరాక కరెంట్ కష్టాలు తోడై ప్రభుత్వ సహాయం అందక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారులు ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ఎక్కడ అమలు కావడంలేదు. సోమవారం కుంటాల సబ్స్టేషన్నుంచి అధికారికంగా మూడు గంటలు కరెంట్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీచేశారు. కాగా వెంకూర్ ఫీడర్‌కు గంట, ఓలా ఫీడర్‌కు రెండు గంటలు, అంబకంటి ఫీడర్‌కు రెండున్నర గంటలు, దౌనెల్లి ఫీడర్‌కు రెండు గంటల పది నిమిషాలు మాత్రమే సరఫరా చేశారు. కరెంట్ వస్తుందనుకున్న వెంకూర్, ఓలా, విఠాపూర్, కుంటాల, అంబకంటి, దౌనెల్లి గ్రామాల రైతులు సోమవారం రాత్రి సెల్ఫోన్లు, టార్చి లైట్లు పట్టుకుని పంట పొలాల వద్దకు వెళ్లి నిద్రించారు. అయినా గంట కూడా కరెంట్ సరఫరా కాకపోవడంతో బోరు బావుల వద్దే నిద్రించారు. వెంకూర్ గ్రామానికి చెందిన రైతులు అదే రాత్రి కోతలపై కుంటాల సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కరెంట్ సరఫరా చేయకపోవడంతో చేతికొచ్చిన పత్తి, సోయా, వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో కరెంటు తిప్పలు చెన్నూర్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కరెంటు కోసం రాత్రి అనక పగలనక కంటి మీద కునుకు లేకుండా రైతులు పొలాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు నానాకష్టాలు పడుతున్నారు. జైపూర్ మండలంలోని దుబ్బపల్లికి చెందిన కామెర లింగయ్య అనే రైతు రూ.60 వేలు ఖర్చు చేసి రెండు ఎకరాల వరి పొలాన్ని సాగు చేశాడు. వర్షాలు లేకపోవడంతో పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. పగలంతా కరెంటు సరఫరా లేకపోవడంతో రాత్రి ఏ సమయానికైన కరెంటు వస్తే పొలానికి నీరు పెట్టుకునేందుకు టార్చిలెట్ పట్టుకొని పొలం కూర్చున్నారు. కరెంటు కోసం కంటి మీద కునుకు లేకుండా నెల రోజులుగా రాత్రిళ్లు పొల ం వద్దే ఉంటున్నానని లింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది లింగయ్య ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు. నియోజకవర్గంలోని రైతులందరిది. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రతి రోజు కనీసం సక్రమంగా 5 గంటలైనా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. భయపడుతూనే పొలాలకు... సారంగాపూర్ : నాపేరు లక్ష్మారెడ్డి నాకు సారంగాపూర్ గ్రామ సమీపంలో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోర్లు వేయించాను. ఈసారి పత్తి, సోయా పంటలు పండిస్తున్నాను. అయితే వ్యవసాయానికి రెండు వారాలకోసారి రాత్రిపూట కరెంటు ఇస్తున్నరు. రాత్రి రెండు గంటలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వస్తుందని తెలిస్తే దానికి గంట ముందే పంట పొలాలకు వెళ్తున్నం. తెల్లవార్లు పంటలకు నీరందిస్తుండగా దాదాపు రెండుమూడు సార్లు కరెంటు సరఫరాలో కోతలు విధిస్తున్నరు. దీంతో అటు నీరందక, ఇటు నిద్ర పాడుచేసుకుంటున్నం. దీంతో పాటు రాత్రి పంటలకు నీళ్లందించడానికి పొలం గట్ల వెంబడి నడుస్తున్నపుడు పురుగు పుట్ర చూసి భయపడుతున్నం. వ్యవసాయానికి రాత్రిపూట కరెంటుకు బదులు పగటిపూట ఇస్తే బావుంటది. - లక్ష్మారెడ్డి, రైతు, సారంగాపూర్ అడవిపందుల బెడద ఉంది సారంగాపూర్ : మాది సారంగాపూర్ మండలం జామ్ గ్రామం. నాకు గారమ శివారంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఈ ఏడాది కూరగాయలు, పత్తి పంటలు పండిస్తున్నాను. అయితే ప్రతి రెండు వారాలకోసారి వ్యవసాయానికి రాత్రివేళ కరెంటు సరఫరా చే స్తున్నరు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 7 వ రకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తుండటంతో భ యంతో వణికిపోతున్నం. రాత్రివేళ కరెంటు ఇవ్వడంతో అర్ధరాత్రి లేచి పొలాలకు వెళ్తుండగా దారిపొడవునా అడవిపందులు సంచరిస్తున్నా యి. దీంతో రాత్రివేళ పంటలకు నీరందించడానికి వెళ్లాలంటేనే భయం గా ఉంటుంది. ఒకసారి నాద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడవిపందు లు రోడ్డుకు అడ్డుగా రావడంతో కింద పడ్డాం. మోటారు వద్ద ఏదైనా సమస్య వస్తే కరెంటు తీగలు సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురవాల్సి వస్తోంది. - కరిపె ప్రభాకర్, రైతు, జామ్, సారంగాపూర్ -
గాలివాన బీభత్సం : ఎడ్లు మృతి
సారంగాపూర్, న్యూస్‌లైన్ : మండలంలో శుక్రవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. జోరుగా గాలి వీయడంతో పొట్ట, కోత దశలో ఉన్న వరి పంటలు నేలకొరిగాయి. విక్రయించడానికి సిద్ధంగా ఉన్న పసుపు, మొక్కజొన్న పంటల దిగుబడి తడిసిపోయింది. మామిడికాయలు నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మండలంలో 200 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గాలివాన ప్రభావంతో పలు గ్రామాల్లో రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో జామ్, ధని, అడెల్లి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రి 7.30గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం కారణంగా తాగునీరు దొరక్క ఇబ్బందుల పాలయ్యామని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో పిడుగుపాటుకు మాజీ సర్పంచు సోమ భూమన్నకు చెందిన రెండు ఎడ్లు చనిపోయాయి. ఎడ్లను పశువుల పాకలో కట్టి ఉంచగా.. గాలివానకు పైకప్పు ఎగిరిపోయింది. ఆ తర్వాత పిడుగుపాటుకు ఎడ్లు మృతిచెందాయి. స్థానిక పశు వైద్యాధికారి ముక్త్యార్ పంచనామా నిర్వహించారు. -
రమణకే సైకిల్ సారథ్యం
జగిత్యాల, న్యూస్‌లైన్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్యం జగిత్యాల ఎమ్మెల్యే ఎల్.రమణకే దక్కింది. టీటీడీపీ అధ్యక్షుడిగా ఆయన సోమవారం నియమితులయ్యారు. యువకుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రమణ మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. బీసీ నాయకుడైన రమణకు టీటీడీపీ పగ్గాలు అప్పగించడం ద్వారా బీసీ కార్డు ఎన్నికల్లో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే.. ఒకమారు ఎంపీ 1994లో తొలిసారి టీడీపీ తరఫున జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రమణ పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి పదవిని చేపట్టారు. 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి జీవన్‌రెడ్డిని ఓడించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ొనసాగుతున్నారు. మొన్నటిదాకా టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. యువకుడిగా రాజకీయ అరంగేట్రం యువకుడిగా ఉన్నప్పుడే పలు కార్యక్రమాల్లో రమణ పాల్గొనేవారు. జగిత్యాల డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా ఉన్న ఆయన ప్రతిభను గుర్తించి టీడీపీ టికెట్టు ఇచ్చారు. 1994లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి జిల్లాలో ఉన్న తన సామాజికవర్గంతోపాటు బీసీ వర్గాల్లో పట్టు సాధించా రు. పార్టీ జిల్లా బాధ్యతలు నిర్వహించారు. భవితవ్యం ఏమిటో..? రాయికల్ : రమణకు టీటీడీపీ పగ్గాలు దక్కినప్పటికీ.. నియోజకవర్గంలో క్రమంగా పట్టు జారిపోతోంది. తెలంగాణలోని టీడీపీ సీనియర్ నాయకులంతా ఇతర పార్టీలకు వలస వెళ్తున్నా రు. జిల్లాలో టీడీపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రమ ణ కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో నిరాశ చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వైపు వెళ్లారు. రాయికల్, సారంగాపూర్, జగిత్యాల మండలాల్లో టీడీపీపీకి ఎంపీటీసీ అభ్యర్థులు దొరకలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రమణ నెగ్గుకురావడం అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
ప్రేమపుస్తకం..నెత్తుటి సంతకం
వారిద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కడదాకా కలిసే సాగాలని బాస చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మూడుముళ్లు.. ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్తలో అనుమానపు చిచ్చు రగిలి చివరకు భార్య ప్రాణాలను బలిగొన్నది. ఇద్దరు పసివాళ్లను అనాథలను చేసింది. తాను దగ్గర లేకపోవడంతోపాటు చెప్పుడు మాటలు నెత్తికెక్కి భార్యను దారుణంగా కొట్టిచంపాడు ఆ కిరాతకుడు. సారంగాపూర్, న్యూస్‌లైన్: సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామానికి చెందిన ఎండబెట్ల విజయ్(28), గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన బ్లెస్సీ(26) జగిత్యాలలో పక్కపక్కనే ఉన్న దుకాణాల్లో టైల రింగ్ నేర్చుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొంతకాలం పాటు దంపతులిద్దరు ఎంతో అన్యోన్యంగా మెలిగారు. పెళ్లయిన తర్వాత రెండేళ్లకు విజయ్ ఉపాధి నిమిత్తం ఏడాదిన్నర పాటు ఇరాక్ వెళ్లాడు. ఇంటి దగ్గర ఉన్న తల్లి, భార్యతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లితోపాటు మరికొందరు బ్లెస్సీపై లేనిపోని విషయాలు అతనికి ఫోన్లో చెప్పేవారు. మనస్తాపానికి గురైన విజయ్ మానసిక స్థితిలో మార్పు రావడంతో కంపెనీ అతడిని ఇంటికి పంపింది. కొంతకాలం పాటు ఇంటివద్దే ఉన్న విజయ్ తిరిగి ఇరాక్ వెళ్లి మళ్లీ అదే కంపెనీలో చేరాడు. అప్పటికీ అతడి మానసకస్థితిలో మార్పు రాకపోవడంతో కంపెనీ తిరిగి ఇంటికి పంపించింది. అప్పటినుంచి బ్లెస్సీని విజయ్ ఏదో రకంగా హింసిస్తుండేవాడు. ప్రతిరోజు తీవ్రంగా కొట్టేవాడు. గాయాలైన ఆమెకు స్థానిక ఆర్ఎంపీల వద్ద మందులు ఇప్పించేవాడు. వారం రోజుల క్రితం విజయ్ కొట్టిన దెబ్బలకు బ్లెస్సీ శరీరమంతా గాయాలు కావడంతో సమీప బంధువులు జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి వచ్చిన ఆమెను ఇంట్లో నిర్భందించినంత పనిచేసి కర్రలతో చితకబాదుతున్నాడు. బ్లెస్సీతో దిగిన ఫొటోలను, ఆమెకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటిముందు కుప్పగా పోసి దహనం చేసినట్లు చుట్టుపక్కలవారు తెలిపారు. బ్లెస్సీని కొడుతున్న సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారితో సంబంధం అంటగట్టి విచిత్రంగా ప్రవర్తించేవాడు. మహిళలు అడ్డుగా వస్తే వారిని దుర్భాషలాడి అవమానపరిచేవాడు. దీంతో బ్లెస్సీని విజయ్ కొడుతుంటే అడ్డుకునేందుకు స్థానికులు జంకేవారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బ్లెస్సీతో విజయ్ గొడవపడి చితకబాదాడు. తర్వాత కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి కుప్పకూలిపోయింది. బ్లెస్సీ చనిపోయేంత వరకు కొట్టి, ప్రాణంపోయిందని నిర్ధారించుకున్న తరువాత జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. కర్ర చేతిలో పట్టుకొని శవం పక్కన కూర్చుండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విజయ్ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, బ్లెస్సీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామని ఎస్సై వినయ్ తెలిపారు. విజయ్ మూడు రోజులుగా సైకోగా ప్రవర్తిస్తూ బ్లెస్సీని తీవ్రంగా హింసించి చంపినట్టు గ్రామస్తులు వివరించారు. పాపం.. పసివాళ్లు.. విజయ్-బ్లెస్సీలకు ఇద్దరు కుమార్తెలు అభీషా(5), వర్షిణి(3) ఉన్నారు. తమ కళ్లముందే తల్లిని తండ్రి చావగొడుతుంటే చూస్తుండడం తప్ప ఏమీ చేయలేని పసితనం వారిది. ఇద్దరూ సంఘటన జరిగిన తరువాత నుంచి తల్లి మృతదేహం చుట్టు తిరుగుతూ.. అమ్మకు ఏమైందంటూ అడుగడం అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది. అభం శుభం తెలియని చిన్నారులు తండ్రిని చూస్తే మాత్రం హడలిపోయారు. ప్రతిరోజు నాన్న తీరును చూసిన భయంతో వణికిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. తండ్రిని పోలీసులు పట్టుకెళ్లడంతో చిన్నారులు దిక్కులేనివారయ్యారు. విజయ్ తండ్రి గతంలో గ్రామంలో హత్యకు గురికాగా, తల్లి ఉంది. కుమారుడికి లేనిపోని విషయాలు చెప్పి కోడలు మృతికి ఆమె కూడా కారకురాలైంది. భర్త, అత్త కొట్టిచంపారు.. బ్లెస్సీని భర్త విజయ్, అత్త అమృతమ్మ అదనపు కట్నం కోసం కొట్టి చంపారని మృతురాలి తండ్రి బొల్లం నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహ సమయంలో రూ.90వేలు కట్నంగా ఇచ్చామని, ఆ తరువాత మరో రూ.30వేలు ముట్టజెప్పామని తెలిపారు. ఇంకా రూ.30వేలు కావాలంటూ బ్లెస్సీని వేధింపులకు గురిచేసి చంపారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. -
ప్రాణహిత-చేవేళ్ల పనులు అడ్డుకున్న రైతులు
సారంగాపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని అడెల్లి గ్రామం వద్ద చేపడుతున్న ప్రాణహిత చేవేళ్ల వరదకాలువ పనులను మంగళవారం డీసీఎంఎస్ అధ్యక్షుడు అయిర నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చే వరదనీరు వృథాగా పోకుండా వరదకాలువ ద్వారా మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌కు తరలించాల్సి ఉందని నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిండాక మిగులు వరదనీటిని నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ చెరువులోకి హైలెవెల్ కాలువ ద్వారా తరలించేందుకు ప్రాణహిత చేవేళ్ల కాలువ పనులు చేపడుతున్నారని తెలిపారు. ఈ పనులను తొలుత ఎస్సారెస్పీ నుంచి స్వర్ణ ప్రాజెక్టు వరకు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా స్వర్ణ ప్రాజెక్టు నుంచి బంగల్పేట్ చెరువు వరకు ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి నాయుడును ప్రశ్నించారు. ఈ చర్యతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ఇబ్బందిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాణహిత చేవేళ్ల పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ గంగాధర్‌కు వినతిపత్రం అందించారు. స్వర్ణ ప్రాజెక్టు చైర్మన్ ఓలాత్రి నారాయణరెడ్డి, మార్కెట్ చైర్మన్ దశరథ రాజేశ్వర్, అడెల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు గుమ్మల రవి, నాయకులు రాజేశ్వర్‌రావు, ఉట్ల రాజేశ్వర్, కరిపె పోతన్న, రవి ఉన్నారు.