రోల్లవాగు టెండర్ లోగుట్టేమి?
-
రూ.55 కోట్లతో ఆధునికీకరణ పనులు
-
16 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు
-
గడువు ముగిసి పది రోజులైనా టెండర్లు తెరవని వైనం
-
వరదలేనా... ప్రజాప్రతినిధి ఒత్తిడే కారణమా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సారంగాపూర్ మండలంలోని రోల్లవాగు టెండర్లలో జాప్యం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. సెప్టెంబర్ 22న తెరవాల్సిన టెండర్లు నేటికీ తెరవకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా? లేక రాజకీయ నేతల ఒత్తిళ్లా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు తన అనుకూలమైన వ్యక్తికి టెండర్ కట్టబెట్టేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు మాత్రం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగానే టెండర్లు తెరవడంలో జాప్యం జరిగిందని సెలవిస్తున్నారు.
టెండర్ పిలిచిందిలా....
రూ.55 కోట్ల వ్యయంతో రోల్లవాగు ఆధునికీకరణ పనులకు ఆగస్టు 31న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో బండ్ నిర్మాణానికి రూ.41 కోట్లు, మత్తడి నిర్మాణానికి రూ.14 కోట్లు ఖర్చు చేయనున్నారు. సెప్టెంబర్ 14 టెండర్ దాఖలకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. అదే నెల 22న టెండర్‌ను తెరవాలని షెడ్యూల్ ఖరారు చేశారు. మరోవైపు టెండర్‌ను దక్కించుకునేందుకు దాదాపు 16 మంది కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా గడువు ముగిసి నేటికి పది రోజులవుతున్నా టెండర్‌ను తెరిచిన దాఖలాల్లేవు. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా టెండర్ తెరవాల్సినప్పటికీ అధికారులు ఆ పని ఎందుకు చేయలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే టెండర్లు తెరవడం లేదనే విమర్శలొస్తున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు టెండర్లు తెరవీనయకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఎంపీకి అనుకూలమైన వ్యక్తికి ఇప్పించేందుకే టెండర్ తెరవనీయడం లేదనే ప్రచారం కాంట్రాక్టర్లలో జరుగుతోంది.
ఇదీ లక్ష్యం...
సారంగాపూర్ మండలంలో ఉన్న రోల్లవాగు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.25 టీఎంసీ నీరు నిల్వ ఉంది. రోల్లవాగు ప్రాజెక్టును ఆధునికీకరించడం ద్వారా 19 అడుగుల నీటి సామర్థ్యంతో ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయవచ్చని అధికారులు ప్రతిపాదించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే డి–53,12 ఎల్ ద్వారా 250 నుంచి 300 క్యూసెక్కల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. తద్వారా సారంగాపూర్ మండలంలోని 11 గ్రామాలు, ధర్మపురి మండలంలోని పలు గ్రామాల్లోని దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. దీంతోపాటు సారంగాపూర్ మండలం బీర్‌పూర్, నర్సింహులపల్లె, తుంగూర్, ఇందిరానగర్‌లతోపాటు ధర్మపురి మండలంలోని ఐదు గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని ఫిల్టర్‌బెడ్‌ల ద్వారా సరఫరా చేయనున్నారు. దీంతోపాటు రోల్లవాగు, నర్సింహులపల్లె, చెర్లపల్లి గ్రామాలను ఆనుకొని ఉన్న బుగ్గచెరువు రెండింటిని కలిపి, ప్రస్తుతం ఉన్న కట్టను 550 మీటర్ల దిగువకు జరిపి కొత్తగా కట్ట నిర్మించనున్నారు. మరోవైపు రోల్లవాగు ఆధునికీకరణవల్ల 642 ఎకరాలు ముంపుకు గురికానున్నాయి. ఇందులో 119 ఎకరాలు ప్రభుత్వ భూమి, 222 ఎకరాలు అటవీశాఖ భూములు కాగా... మిగతావి పట్టా భూములు. అటవీశాఖ కోల్పోతున్న భూమికి భారీ నీటిపారుదల శాఖ ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం వద్ద ఉన్న 222 ఎకరాల భూమిని అడవుల అభివృద్ధి చేసేందుకుSఅటవీశాఖకు అప్పగించనుంది. ఐదేళ్లపాటు అడవుల అభివృద్ధి మెయింటెనెన్స్ కింద రూ.52 లక్షలు కేటాయించారు. పట్టా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడానికి రూ. కోటి కేటాయించారు.
వరదల వల్ల జాప్యమైంది
– ఎస్సారెస్పీ ఎస్‌ఈ, సతీష్‌కుమార్
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 22న టెండర్ తెరవాల్సి ఉంది. కానీ ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల ఎస్సారెస్పీ కాలువల నీటి విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉండి టెండర్‌పై శ్రద్ధ పెట్టలేకపోయాం. ప్రస్తుతం ఈ టెండర్‌కు సంబంధించి ఎవాల్యుయేషన్ జరుగుతోంది. సోమవారం టెండర్ తెరిచి ఆన్‌లైన్‌లో పెడతాం.