సారంగాపూర్, న్యూస్‌లైన్ : మండలంలో శుక్రవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. జోరుగా గాలి వీయడంతో పొట్ట, కోత దశలో ఉన్న వరి పంటలు నేలకొరిగాయి. విక్రయించడానికి సిద్ధంగా ఉన్న పసుపు, మొక్కజొన్న పంటల దిగుబడి తడిసిపోయింది. మామిడికాయలు నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మండలంలో 200 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గాలివాన ప్రభావంతో పలు గ్రామాల్లో రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి.
చాలా గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో జామ్, ధని, అడెల్లి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రి 7.30గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం కారణంగా తాగునీరు దొరక్క ఇబ్బందుల పాలయ్యామని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. మండలంలోని గోపాల్‌పేట్ గ్రామంలో పిడుగుపాటుకు మాజీ సర్పంచు సోమ భూమన్నకు చెందిన రెండు ఎడ్లు చనిపోయాయి. ఎడ్లను పశువుల పాకలో కట్టి ఉంచగా.. గాలివానకు పైకప్పు ఎగిరిపోయింది. ఆ తర్వాత పిడుగుపాటుకు ఎడ్లు మృతిచెందాయి. స్థానిక పశు వైద్యాధికారి ముక్త్యార్ పంచనామా నిర్వహించారు.
గాలివాన బీభత్సం : ఎడ్లు మృతి
Published Sun, May 4 2014 12:52 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement