కార్తీక(ఫైల్)
సారంగపూర్ (నిర్మల్): ఆమె ఏడు నెలల గర్భిణి. అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కంకర పరిచి వదిలేసిన రోడ్డు.. మరోచోట కోతకు గురైన రహదారి.. దీంతో సకాలంలో ఆ గర్భిణి ఆస్పత్రికి చేరలేకపోయింది. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. గురువారం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం హనుమాన్‌తండాలో జరిగిన ఈ ఘటన విషాదం మిగిల్చింది. పవార్ సురేందర్ భార్య కార్తీక ఏడు నెలల గర్భిణి. గురువారం ఆమెకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నిర్మల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు.
హనుమాన్‌తండా నుంచి సేవానగర్, దుర్గానగర్ మీదుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు ఉంది. తండా నుంచి దుర్గానగర్ వరకు నాలుగు కిలోమీటర్ల దారిలో కాంట్రాక్టర్ రెండు నెలలుగా కంకర పరిచి వదిలేశాడు. పని పూర్తి చేయించడంలో అధికారులూ అలసత్వం ప్రదర్శించారు. నరకప్రాయంలాంటి ఈ రోడ్డుపై 108 వాహనం హనుమాన్‌తండా వరకు వెళ్లలేని పరిస్థితి.
దీనికితోడు మధ్యలో హైలెవల్ కాలువ వద్ద, దుర్గానగర్ వద్ద రోడ్డు కోతకు గురైంది. కార్తీకను అతికష్టం మీద కంకర పరిచిన రోడ్డుపై ఆటోలో కొంతదూరం తరలించి, అనంతరం కారులో నిర్మల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కంకర పరిచిన రోడ్డు ప్రయాణంలో విపరీతమైన కుదుపులతో కార్తీక తీవ్ర అవస్థలు పడింది. ఎట్టకేలకు నిర్మల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. అరగంట ముందుగా ఆసుపత్రికి తీసుకొస్తే ఉంటే గర్భిణి సురక్షితంగా ఉండేదని వైద్యులు తెలిపారు. రోడ్డు మార్గం సరిగ్గా ఉంటే తన భార్య బతికేదని, ఆమె మృతికి అధికారులు, కాంట్రాక్టరే బాధ్యులని ఆమె భర్త సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment