హీరో సాయికుమార్, హీరోయిన్ ఆమనికి సూచనలు ఇస్తున్న డైరెక్టర్ రవి, ప్రొడ్యూసర్ కిరణ్
సారంగపూర్(నిర్మల్): సినిమా షూటింగ్‌లు, షార్ట్‌ఫిల్మ్స్ చిత్రీకరణకు నిర్మల్ జిల్లా సారంగాపూర్ ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడి ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులవుతున్న సినీ నిర్మాతలు.. చిన్నచిన్న షార్ట్ ఫిల్మ్స్ దర్శకులు ఇక్కడే చిత్రీకరణ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మండలంలోని లక్ష్మీపూర్ చెరువుకట్టతోపాటు మహబూబాఘాట్స్, చించోలి(బి) గ్రామ సమీపంలోని గండిరామన్న హరితవనం, తదితర లోకేషన్‌లు ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. ఇక్కడి అందాలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారు. అడెల్లి మహాపోచమ్మ ఆలయ పరిసరాలు, పక్కనే ఉన్న హరితవనం సైతం ప్రకృతి అందాలతో అందరినీ అలరిస్తోంది. ఇటీవల బోరిగాం, లక్ష్మీపూర్ చెరువుకట్ట, గండిరామన్న హరితవనంలో యువ దర్శకుడు రవి, నిర్మాత కిరణ్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. యువకులు పెద్ద సంఖ్యలో ఆయా ప్రదేశాలకు చేరుకుని షార్ట్‌ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు.
ఒంపుసొంపుల మహబూబాఘాట్స్..
నిర్మల్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన గుట్టలను చీల్చుకుంటూ ఉన్న మహబూబాఘాట్స్ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ ఘాట్స్‌మీదుగా వెళ్లే ప్రతిఒక్కరూ ఆగి అందాలను వీక్షిస్తుంటారు. మూలమలుపుల వద్ద ఆగి.. అవసరమైతే భోజనాలు చేసి మరీ వెళ్తుంటారు. సారంగాపూర్ మండల కేంద్రం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వతశ్రేణిని ఆనుకుని ఉన్న అడెల్లి మహాపోచమ్మ ఆలయం, పక్కనే ఉన్న అడెల్లి మహాపోచమ్మ నందనవనం సైతం అందాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇంతటి ప్రకృతి అందాలకు ప్రభుత్వం గుర్తింపునివ్వడంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే పర్యాటక ప్రదేశాలుగా విరాజిల్లే అవకాశముందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
కోనసీమకు తీసిపోని అందాలు
మండలకేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్లు, జిల్లా కేంద్రం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపూర్ చెరువు కట్ట కోనసీమ అందాలను తలపిస్తోంది. వెంగ్వాపేట్ సమీపంలోని ఈ చెరువు పక్కనే ఉన్న గుట్టమీద లక్ష్మీపూర్ ఉంది. పక్కనే చెరువు, చుట్టూ తాటిచెట్లు, పచ్చని పంటపొలాలు ఇవన్నీ కోనసీమ అందాలను మైమరిపిస్తున్నాయి. కాలుష్యం లేకుండా నిత్యం గ్రామం ఆహ్లాదభరితంగా ఉంటుంది. వెంగ్వాపేట్ నుంచి చించోలి(బి) గ్రామానికి వెళ్లేందుకు చెరువు కట్టమీదుగా బీటీరోడ్డు వేయడంతో గ్రామానికి మరింత సోయగం పెరిగింది.
అందాల హరితవనం
నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే చించోలి(బి) సమీపంలో నిర్మించిన గండి రామన్న హరితవనం ప్రకృతి అందాలు పరుచుకుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో పార్కులో సకలసౌకర్యాలు కల్పించారు. ఆహ్లాదం కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. పిల్లలు, పెద్దలు సేద తీరడానికి అనువుగా అనేక వస్తువులు అందుబాటులో ఉంచారు. సహజసిద్ధంగా ఉన్న బండరాళ్లు, ఎత్తైన చెట్లు ఉండటంతో సినిమా షూటింగ్‌లకు సైతం అనువైన ప్రదేశంగా మారింది.
- 2019 నవంబర్‌లో హీరో సాయికుమార్, హీరోయిన్ ఆమని, హీరో నితిన్‌చంద్ర, యువ హీరో సాయి నేతృత్వంలో బోరిగాంలో సినిమా షూటింగ్ చిత్రీకరించారు. ఇదే సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవల చించోలి(బి) సమీ పంలోని గండిరామన్న హరితవనంలో చిత్రీకరించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ కిరణ్‌మారుతి ఇటీవల లక్ష్మీపూర్ చెరువుకట్టపై ఫోక్ సాంగ్స్ రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment