నిందితులంతా నేర చరితులే | Investigation By Police Officers For Sarangapur Gang Rape police | Sakshi
Sakshi News home page

నిందితులంతా నేర చరితులే

Published Sun, Sep 22 2019 1:45 AM | Last Updated on Sun, Sep 22 2019 1:45 AM

Investigation By Police Officers For Sarangapur Gang Rape police - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 3 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులంతా నిజామాబాద్‌ శివారు లోని సారంగాపూర్‌ గ్రామానికి చెందిన వారని తేలింది. శుక్రవారం సారంగపూర్‌ అటవీ ప్రాంతంలో ఓ యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పా ల్పడి..సెల్‌ఫోన్లో వీడియో చిత్రీకరిం చిన విషయం విదితమే. ప్రధాన నిందితుడు మక్కల సురేశ్‌తోపాటు నాగరాజు, శంకర్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.  

నిందితుల నేర చరిత్ర
అఘాయిత్యానికి పాల్పడిన నిందితులకు నేర చరిత్ర ఉంది. నిందితుల్లో ఒకరైన నాగరాజు ఆటో నడుపుకుంటూ జులాయిగా తిరుగుతుంటాడు. గతంలో ఇదే గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి ఓ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. మిగిలిన నిందితులపై కూడా 6వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందుకు వివరాలు వెల్లడించడం కుదరదని కేసు దర్యాప్తు అధికారి రఘునాథ్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. 

నిందితులను వెంటనే పట్టుకోండి: డీజీపీ  
సారంగాపూర్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై పోలీసుశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆరా తీశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సీపీ కార్తికేయను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు అధికారి రఘునాథ్, ఏసీపీ శ్రీనివాస్‌లతో కేసు పురోగతిపై సమీక్షించారు.

పోలీసులకు చిక్కారిలా.. 
ప్రధాన నిందితుడు మక్కల సురేష్‌ యువతిని ద్విచక్ర వాహనంపై సారంగాపూర్‌ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చారు. రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన తర్వాత తన స్నేహితులకు ఫోన్‌ చేసి పిలిపించాడు. ఆటోలో వచ్చి ఆరుగురు ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీన్ని మరో ఇద్దరు సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. ఓ కేసు విచారణ నిమిత్తం అటువైపు వెళ్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌లకు రోడ్డు పక్కన కొంత దూరంలో ఆటో కనిపించింది. నిర్మానుష్య ప్రాంతంలో ఆటో ఉండటాన్ని అనుమానించిన పోలీసులు అటువైపు వెళ్లి చూడగా.. ఆటోలో కూర్చుని సెల్‌ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు యువకులు కనిపించారు. వారిని ప్రశ్నించగా.. ఏడుగురు స్నేహితులం బహిర్భూమికి వచ్చామంటూ దాటుకునే ప్రయత్నం చేశారు. గద్దించి అడుగగా.. వారికి ఫోన్‌ చేయించి స్పీకర్‌ ఆన్‌ చేయించడంతో యువతి అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement