తాండవ రిజర్వాయర్
జిల్లాలో తాండవ మొదలుకుని గోస్తని వరకు ఏ ప్రాజెక్టులోనూ గేట్లు ఎత్తి నీరు వదిలే స్థాయిలో నీటి నిల్వలు లేని పరిస్థితి నెలకొంది. నవంబర్‌లోనే ఇలా ప్రమాద ఘంటికలు మోగిస్తుంటే..ఇక ఏప్రిల్‌కు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు కూడా అప్పుడే 25 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయాయి.
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు నాలుగు. తూర్పు విశాఖ జిల్లాల్లో 51,465 ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన తాండవ ప్రాజెక్టుతో పాటు జిల్లా పరిధిలో 15,344 ఎకరాల ఆయకట్టు కలిగిన రైవాడ, 12,638 ఎకరాల ఆయకట్టు కలిగిన కోనాం, 19,969 ఎకరాల ఆయకట్టు కలిగిన పెద్దేరు జలాశయాలున్నాయి. అలాగే వరాహ జలాశయం కింద మరో 4485 ఎకరాలు, గంభీరం గెడ్డ కింద 640 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి ఏటా 2 లక్షల హెక్టార్లలో ఖరీఫ్, 48వేల హెక్టార్లలో రబీ సాగవ్వాల్సి ఉంది. అంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు చరిత్రలో ముందెన్నడూ లేనంత అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన మూడు నెలలుగా క్యాచ్‌మెంట్ ఏరియాల్లో చుక్కనీరు లేకపోవడంతో ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాధారంపై ఆధారపడి సాగయ్యే పంటలు ఎలాగూ ఎండిపోతుండడంతో కనీసం ప్రాజెక్టుల కింద పంటలనైనా కాపాడాలన్న ఆలోచనతో ఖరీఫ్‌లో ఇప్పటి వరకు ఉన్నంతలోనే సాగునీరు వదులుతూ వచ్చారు. ఇక ఏ ఒక్క ప్రాజెక్టులోనూ క్యూసెక్ నీరు కూడా విడుదల చేసే పరిస్థితి కన్పించడం లేదు.
దుర్భర పరిస్థితుల ‘తాండవ’ం
జిల్లాలో ఏకైక మేజరు ప్రాజెక్టయిన తాండవ రిజర్వాయరులో నీటి మట్టం కనీవిని ఎరుగని స్థాయిలో పడిపోయింది. ప్రాజెక్టు నిర్మించి 44 ఏళ్లు కా>వస్తోంది. ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితిని చూడలేదని ఈ ప్రాంత రైతులంటున్నారు. రిజర్వాయర్ ప్రమాద స్థాయి నీటిమట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్) 380 అడుగులు కాగా కనిష్ట నీటిమట్టం 345 అడుగులు. గతేడాది ఇదే సమయానికి 367.80 అడుగులుండగా, ఈ ఏడాది 347 అడుగులకు చేరుకుంది. తాండవ తర్వాత అత్యధిక ఆయకట్టు కల్గిన కోనాం రిజర్వాయర్‌లో ఎఫ్‌ఆర్‌ఎల్ 101.25 మీటర్లు కాగా, కనిష్ట నీటి మట్టం(డెడ్‌స్టోరేజ్) 84 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 99.35 మీటర్లుకాగా, ప్రస్తుతం 88.60 మీటర్లకు చేరుకుంది. ఆ తర్వాత 15వేల ఎకరాలు పైగా ఆయకట్టు కలిగిన రైవాడ ప్రాజెక్టు ఎప్‌ఆర్‌ఎల్ 114 మీటర్లుకాగా, కనిష్ట నీటిమట్టం 99 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 113.08 మీటర్ల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 102.40 మీటర్లకు పడిపోయింది. పెద్దేరు జలాశయంలో ఎఫ్‌ఆర్‌ఎల్ 137 మీటర్లు కాగా, కనిష్టం 128 మీటర్లు. గతేడాది ఇదేసమయానికి 134.08 మీటర్ల మేర నీరుండగా, ప్రస్తుతం 129.90 మీటర్లకు పడిపోయింది. వరాహ జలాశయం ఎఫ్‌ఆర్‌ఎల్ 460 అడుగులు కాగా, కనిష్ట నీటిమట్టం 420 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 453 మీటర్లుండగా, ఈసారి 423 మీటర్లకు చేరుకుంది.
తాగు నీటికి కష్టకాలమే..
విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చే ఏలేరు, తాటిపూడి, మేహాద్రిగెడ్డ, గోస్తని, ముడసర్లోవ, గోస్తని, గంభీరం ప్రాజెక్టుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఏలేరులో కనిష్ట నీటిమట్టం 71.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 84 మీటర్లకు చేరుకుంది. తాటిపూడి కనిష్టం 251 అడుగులు కాగా, ప్రస్తుతం 261 మీటర్లకు చేరుకుంది.మేహాద్రి గెడ్డ కనిష్టం 44 అడుగులు కాగా, ప్రస్తుతం 48 అడుగులకు చేరుకుంది. గోస్తని కనిష్ట నీటిమట్టం 21.06 అడుగులు కాగా, ప్రస్తుతం 26 అడుగులకు పడిపోయింది. ముడసర్లోవ కనిష్ట నీటి మట్టం 152 అడుగులు కాగా ప్రస్తుతం 155 అడుగులకు చేరుకుంది. గంభీరం గెడ్డ రిజర్వాయర్‌లో కనిష్ట నీటిమట్టం 107 మీటర్లు ప్రస్తుతం 107కు చేరుకోవడంతో పూర్తిగా ఎండిపోయింది. చుక్కనీరు లేక కళ్యాణపులోవ రిజర్వాయర్ కూడా పూర్తిగా ఎండిపోయింది. దీంతో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు కూడా ఈసారి జలగండం తప్పేటట్టు కన్పించడం లేదు. లోటు వర్షపాతంకారణంగా భూగర్భ జలాలు కూడా అప్పుడే 25 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయాయి. వేసవిలో 50 నుంచి వంద మీటర్ల లోతుకు వెళ్తే కానీ చుక్కనీరు పడే పరిస్థితి కన్పించదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రబీ సాగు డౌటే..
రబీ సాగు పూర్తిగా బోర్లు, ప్రాజెక్టుల కింద సాగు చేస్తారు.రబీ సాధారణ విస్తీర్ణం జిల్లాలో 48వేల హెక్టార్లు. 2014–15లో 42,961హెక్టార్లలో,2015–16లో 40,814హెక్టార్లలో, 2016–17లో 33,517 హెక్టార్లలో రబీ సాగవగా, 2017–18లో కేవలం 30 వేల హెక్టార్లలోనే రబీ సాగయ్యింది.కానీ ఈసారి ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటి పోవడం, మరో వైపు జలాశయాలు ఎండిపోవడంతో ఈసారి ర బీ సాగుకు అవకాశం లేదంటున్నారు. జిల్లాలో డ్రగ్, బోర్‌వెల్స్ కలిపి 38,637ఉన్నాయి.వీటి పరిధిలో రబీ కింద 36వేల హెక్టార్ల విస్తీర్ణం ఉంది. ఈఏడాది ఏకంగా నవంబర్‌లోనే మైనస్ 25 శాతం లోటు వర్షపాతం ఉంది. రానున్న నాలుగు నెలల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ సీజన్‌లో ఎలాంటి అల్పపీడన ద్రోణులు, తుఫాన్‌లు వచ్చే అవకాశం ఉండదు. మళ్లీ ఏప్రిల్–మేలలో మళ్లీ తుఫాన్‌లు వచ్చే ఆనవాయితీ ఉంది. పొరుగు జిల్లాల్లో సెప్టెంబర్ నాటికి ఖరీఫ్ సీజన్ పూర్తవుతుంది. అక్టోబర్–నవంబర్‌లలో రబీ సాగు ఆరంభమవుతుంది. కానీ మన జిల్లాలో ఖరీఫ్ సాగే ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రబీ సాగు జనవరిలో కానీ మొదలు కాని పరిస్థితి. ఈసారి లోటు వర్ష పాతం, భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతులు రబీ సాగుకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారనిపిస్తోంది.
డెడ్ స్టోరేజ్‌లో నీటి నిల్వలు
వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చాలా వరకు డెడ్ స్టోరీజికి సమీపంలో ఉన్నాయి. ఎలేరు తప్ప మిగిలినవన్ని వేసవికి నాలుగైదు నెలలముందే అడుగంటిపోయే ప్రమాదాలున్నాయి. ఈలోగా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు పడితే కానీ ఈసారి వేసవి గట్టెక్కడం కష్టమే.– ఎస్.పళ్లంరాజు, ఎస్‌ఈ, జీవీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment