ఒబెరాయ్ హోటల్
విశాఖ విరాజిల్లేలా సరికొత్త ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సంస్కృతి పరిరక్షణకు చిరునామాగా, పర్యాటక రంగానికి ప్రధాన కేంద్రంగా.. సాంకేతిక రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించేలా భారీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటి రాకతో 30 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా విశాఖ అభివృద్ధిపైనే ప్రభుత్వం దృష్టిసారించినట్లుగా భారీ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మాత్రమే కాకుండా.. పర్యాటక రాజధానిగానూ, ఐటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పానికి అనుగుణంగా భారీ ప్రాజెక్టులు విశాఖకు రానున్నాయి.
సంస్కృతి, వేద పాఠశాలలకు..
ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా మారిన విశాఖ జిల్లాని సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాలను విశాఖ శారదా పీఠానికి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ.1.5 కోట్లు చొప్పున భూమిని కేటాయించింది. ఈ ప్రాంతంలో సంస్కృత పాఠశాలతో పాటు వేద విద్య పాఠశాలను శారదా పీఠం నిర్మించనుంది. అదేవిధంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయంగా కొత్తవలసని మార్చాలని శారదా పీఠం ప్రణాళికలు సిద్ధం చేసింది.
అదానీ సంస్థ కోసం నిర్మితమవుతున్న రహదారి
అదానీ.. సాంకేతిక మణిహారం
రూ.14,634 కోట్లతో పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విశాఖలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్‌కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మధురవాడలో 130 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లని ఏర్పాటు చేయనుంది. విశాఖ ఐటీ చరిత్ర తిరగరాసే విధంగా ఏకంగా పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకొచ్చిన అదానీ సంస్థల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సర్వే నెంబర్ 409లో ఎకరానికి రూ.కోటి చొప్పున 130 ఎకరాలను కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కు ఏర్పాటు చేయనుంది. మొత్తం 24,900 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు వస్తే అన్ని విభాగాల్లోనూ విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందనుంది.
చదవండి: (Andhra Pradesh: అగ్రవర్ణ పేదలకు దన్ను)
రిసార్టులతో విదేశీ పర్యాటకాయ నమః
టూరిజం డెస్టినీగా పిలిచే విశాఖపట్నం అంటే ప్రపంచ పర్యాటకులకూ ఎంతో ఇష్టం. భారత్‌కు వచ్చే ప్రతి 10 మంది విదేశీయుల్లో ఏడుగురు కచ్చితంగా విశాఖలో పర్యటిస్తారు. అంతర్జాతీయ పర్యాటకులతో నిత్యం కిటకిటలాడే విశ్వనగరిలో తమ శాఖల్ని విస్తరింపజేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులతో పాటు దేశీయ సందర్శకుల కోసం సరికొత్త మౌలిక వసతులతో ముందుకొస్తున్నాయి. ప్రముఖ ఒబెరాయ్ సంస్థ భీమిలి మండలం అన్నవరంలో 7 స్టార్ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. రూ.350 కోట్లతో ఏర్పాటు చేయనున్న రిసార్ట్ ద్వారా 5,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. అదేవిధంగా.. పీఎంపాలెం శిల్పారామంలో ప్రముఖ హయత్ గ్రూప్స్ స్టార్ హోటల్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు వస్తే.. మరో 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టులకు టూరిజం పాలసీలో భాగంగా రాయితీలిచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment