జల శోకం
అడుగంటిన భూగర్భ జలాలు
పని చేయని బోరు బావులు
గ్రేటర్, శివార్లలో నీటి కష్టాలు
మహా నగరాన్ని ఓ వైపు ఎండలు వణికిస్తున్నాయి. మరోవైపు నీరు కన్నీరు తెప్పిస్తోంది. భూగర్భ జలమట్టాలు అడుగంటడంతో తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. బిందెడు నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పిల్లా పాపలతో కలసి నీటి కోసం జనం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది.
సిటీబ్యూరో: భానుడి భగభగలతో భూగర్భ జలమట్టాలు దారుణం గా పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలోని బోరు బావులు చుక్క నీరు లేక బావురుమంటున్నాయి. గ త ఏడాది మార్చి చివరికి సగటున 10.72 మీటర్ల లోతున నీటి చుక్క జాడ లభించగా.. 2016 మార్చి నాటికి 17.86 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఫలితంగా శివారు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ఫిల్టర్ నీటి ప్లాంట్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
మండలాల్లో దుర్భరం
తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మండుటెండలకు తోడు నీటిని ఒడిసి పట్టేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో వివిధ మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. ప్రధాన నగరంలోని ఆసిఫ్‌నగర్‌లో 3.92 మీటర్లు, బండ్లగూడలో 0.70, ఖైరతాబాద్‌లో 2.35, బహదూర్‌పురాలో 1.25 మీటర్ల మేర నీటి మట్టాలు పడిపోయాయి. శివార్లలోని హయత్‌నగర్‌లో 1.79 మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 0.60, మహేశ్వరంలో 4.50, మేడ్చల్‌లో 4.61, శామీర్‌పేట్‌లో 0.55, ఉప్పల్‌లో 2.50, బాలానగర్‌లో 0.50, రాజేంద్రనగర్‌లో 1.15, శంషాబాద్‌లో 1.65 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోయినట్లు భూగర్భ జల శాఖ తాజా నివేదిక వెల్లడించింది.
ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ
బోరు బావులు వట్టిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల నీటి దందా జోరందుకుంది. నిజాంపేట్, మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బోడుప్పల్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో ..ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు డిమాండ్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న వారికి ఇంటి అద్దెతో సమానంగా నెలకు నీటికి ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీని అదుపు చేయడంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాలు విఫలమవుతుండడం గమనార్హం. వేసవిలోనే ఇంకుడు గుంతల నిర్మాణాలతో సత్ఫలితాలు
ఇంకుడు గుంత ఇలా ఉండాలి
మధ్య తరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇళ్లు ఉన్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున గుంత తీసి... అందులో 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజు రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు గుంతలో కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జి సులువవుతుందని, బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణుడు సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఇల్లు, కార్యాలయం విస్తీర్ణాన్ని బట్టి దీని సైజు పెరుగుతుందని తెలిపారు.