5 గేట్ల ద్వారా విడుదల అవుతున్న జలాలు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల) : శ్రీశైలం జలాశయ నీటిమట్టం వర్షాకాల సీజన్ పూర్తవుతున్న సమయంలో అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది మూడోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారు. గురువారం తెల్లవారు జామున డ్యామ్ రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సాయంత్రానికి 5 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు 1,39,915 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 58,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,42,373 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం నుంచి గురువారం వరకూ కుడిగట్టు కేంద్రంలో 13.381 మిలియన్ యునిట్లు, ఎడమ గట్టు కేంద్రంలో 16.200 మిలియన్¯ యునిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జలాశయంలో 214.3637 టీఎంసీల నీరుంది. డ్యామ్ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది.
నేడు సాగర్ గేట్లు ఎత్తే అవకాశం
శ్రీశైలం జలాశయం క్రస్ట్‌గేట్లు ఎత్తడంతో నాగర్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులతో గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు తెలిపారు. జలాశయం నీటిమట్టం గురువారం రాత్రి 7 గంటలకు 588.20 అడుగులకు చేరగా ఇది 306.6922 టీఎంసీలకు సమానం.
Comments
Please login to add a commentAdd a comment