జలమిలా... మనకెలా?
అడుగంటుతున్న జలాశయాలు
గ్రేటర్ వాసుల్లో ఆందోళన
నెలాఖరులో గండిపేట్ వద్ద పంపింగ్ షురూ
సిటీబ్యూరో: ఎండల తీవ్రతతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లతో పాటు సింగూరు, మంజీర జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలోని నీటి నిల్వలు జూన్ వరకు నగర తాగునీటి అవసరాలకు సరిపోతాయని జలమండలి భరోసా ఇస్తున్నా.. ఈ వేసవిలో కటకట తప్పేలా లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
నీటి మట్టాలు బాగా తగ్గడంతో ఈనెలాఖరున గండిపేట్ జలాశయం వద్ద నాలుగు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. రోజువారీగా జంట జలాశయాల నుంచి 40 మిలియన్ గ్యాలన్లు, సింగూరు, మంజీర జలాశయాల నుంచి 120, కృష్ణా మొదటి, రెండోదశల ద్వారా 180.. మొత్తంగా 340 మిలియన్ గ్యాలన్ల నీటిని నగర నలుమూలలకు సరఫరా చేస్తున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ నెలాఖరుకు కృష్ణా మూడోదశ ద్వారా నగరానికి మరో 45 మిలియన్ గ్యాలన్లు తరలిస్తామని పేర్కొన్నాయి.