![Countdown on Health 2050: Health impacts of climate change are surging worldwide - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/11/18/LALLALA.jpg.webp?itok=QcbEcDe8)
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్న ఎండల తీవ్రతతో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. భానుడి ప్రతాపం ఇదే మాదిరి పెరుగుతూ ఉంటే వచ్చే 27 ఏళ్లలో అంటే 2050 నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. తాజాగా, లాన్సెట్ ‘కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్‌లైమేట్ ఛేంజ్’పై 8వ వార్షిక నివేదిక విడుదల చేసింది. గాలి, నీరు పరివర్తనం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రధానంగా ఈ నివేదిక దృష్టి సారించింది.
ఆయిల్, గ్యాస్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టవద్దని ప్రభుత్వాలు, కంపెనీలకు సూచించింది. 2022లో దాదాపు 86 రోజుల పాటు తీవ్రమైన వేడిమిని ఎదుర్కోవలసి వచి్చందని పేర్కొంది. ఇందులో 60 శాతానికిపైగా ఘటనలకు మానవ కార్యకలాపాలే బాధ్యత అని తెలిపింది. జీవ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టే వివిధ కంపెనీల తీరును కూడా లాన్సెట్ నివేదికలో ఎండగట్టింది.
జల, వాయు సంబంధిత దుష్పరిణామాలను నిలువరించేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవని లాన్సెట్ కౌంట్ డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మరీనా రొమానెలో హెచ్చరించారు. ఎండ తీవ్రత వల్ల వ్యవస్థకు కలుతున్న నష్టంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణం దెబ్బతినడం వల్ల నీరు, వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ప్రతికూల ప్రభావం పడి, ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేశారు. కేవలం ఎండ తీవ్రత కారణంగా 2041–60మధ్య కాలంలో 52.49కోట్ల మంది ఆహార భద్రత ముప్పు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. 2050 వరకు ప్రాణాంతక వ్యాధుల సంఖ్య పెరగొచ్చని కూడా లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment