భూగర్భ శోకం!
గ్రేటర్‌లో గణనీయంగా పడిపోయిన భూగర్భ జలాలు
గత ఏడాదితో పోలిస్తే
సగటున 2.80 మీటర్లు తగ్గుదల
సిటీబ్యూరో: మండు టెండలు గ్రేటర్‌ను మాడ్చేస్తున్నాయి. భూగర్భ జలాలు ఆవిరవుతున్నాయి. మహా నగరంలో వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేకపోవడం... పెరుగుతున్న బోరుబావుల తవ్వకం, విచక్షణా రహితంగా నీటి వినియోగంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం గ్రేటర్‌లో సగటున 2.80 మీటర్ల లోతున నీటిమట్టాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత ఏడాది సగటున 7.92 మీటర్ల లోతున ఉన్న పాతాళగంగ ఈ ఏడాది 10.72 మీటర్ల లోతునకు పడిపోయింది. దీంతో శివారు ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోయి జనం విలవిల్లాడుతున్నారు.
ఇదీ పరిస్థితి
గత ఏడాదితో పోలిస్తే ఆసిఫ్‌నగర్ మండలంలో 11.11 మీటర్లు, నాంపల్లిలో 8.52, హయత్‌నగర్‌లో 10.65, సరూర్‌నగర్‌లో 4.55 మీటర్లు పడిపోయాయి. ఉప్పల్‌లో 4.30 మీటర్లు, బాలానగర్‌లో 3.40, మారేడ్‌పల్లిలో 3.20 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోయాయి. ఇతర మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
ఇవీ కారణాలు...
మహానగర పరిధిలో అపార్ట్‌మెంట్లు, భవనాల సంఖ్య సుమారు 22 లక్షలు. వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకే ందుకుఅందుబాటులో ఉన్న ఇంకుడు గుంతలు పట్టుమని పాతిక వేలు కూడా లేవు. ఈ కారణంగా భూమిపై పడిన వర్షపు నీటిలో 60 శాతం వృథా అవుతోంది.
గ్రేటర్ లో భూగర్భ జలమట్టాలు (వాటర్ టేబుల్) పెంచేందుకు గత ఏడాది జీహెచ్‌ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతలు తవ్వేందుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్లు రాబట్టాయి. కానీ ఐదు వేల ఇంకుడు గుంతలతో సరిపెట్టడం ఆ శాఖల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
మహా నగరంలోని అధిక శాతం ఇళ్లు, కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతలు లేకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అథఃపాతాళానికి చేరుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇంకుడు గుంత ఇలా ఉండాలి..
మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున గుంత తీయాలి. అందులో 50 శాతం మేర 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు దీనిపై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భ జలాల రీచార్జీ సులువవుతుంది. బోరుబావి పది కాలాల పాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణాన్ని బట్టి గుంత సైజు పెరుగుతుందని చెబుతున్నారు.