జలాశయాలన్నీ ఖాళీ! | Reservoirs are empty all over the state | Sakshi
Sakshi News home page

జలాశయాలన్నీ ఖాళీ!

Published Thu, Apr 18 2019 4:14 AM | Last Updated on Thu, Apr 18 2019 4:14 AM

Reservoirs are empty all over the state - Sakshi

అడుగంటిన చిత్తూరు జిల్లాలోని ఎన్‌టీఆర్‌ జలాశయం

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నీళ్లు లేక నోరెళ్లబెట్టాయి. సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటి కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం జలాశయాల్లో అందుబాటులో ఉన్న అరకొర జలాలు మే నెలాఖరు నాటికి మరింత తగ్గిపోనున్నాయి. ఆగస్టు వరకూ జలాశయాల్లోకి వరద నీరు చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి సమస్య విషమించడం ఖాయమని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో అధిక శాతం మంది ప్రజలు సాగునీరు, తాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదీ జలాలపై ఆధారపడతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్‌) 885 అడుగులు. నీటి నిల్వ 215.87 టీఎంసీలు. కనీస స్థాయి నీటి మట్టం(ఎంఎండీఎల్‌) 854 అడుగులు. ప్రస్తుతం గేట్ల కంటే దిగువ స్థాయికి అంటే.. 808.3 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. శ్రీశైలం రిజర్వాయిర్‌లో ప్రస్తుతం 33.34 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి.
డెడ్‌ స్టోరేజీకి శ్రీశైలం జలాశయం 
నీటి నిల్వలు అడుగంటిపోయినా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు గత రెండు రోజులుగా 2.24 టీఎంసీలను విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు. కనీస స్థాయి నీటి మట్టం 510 అడుగులు. ప్రస్తుతం సాగర్‌లో 514.5 అడుగుల్లో 139.44 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌ నుంచి తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువలకు 7,912 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. తుంగభద్ర, కండలేరు, సోమశిల రిజర్వాయర్లలోనూ నిల్వలు కనీ స నీటిమట్టం కంటే దిగువకు చేరాయి. చిత్రావతి బ్యా లెన్సింగ్‌ రిజర్వాయర్‌(సీబీఆర్‌), పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోనూ అదే పరిస్థితి. 

తాగునీటి ఎద్దడి మరింత తీవ్రం 
ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ నుంచి విడుదల చేస్తున్న జలాలతో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు నింపినా.. ఆ నిల్వలు ఏప్రిల్, మే నెలలకే సరిపోతాయని అంచనా వేస్తున్నారు. కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో ఉన్న జలాలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. ఏలేరులో ఉన్న జలాలను విశాఖపట్నం తాగునీటి అవసరాలు, ఉక్కు కర్మాగారం అవసరాలకు విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. రాయలసీమలో అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చే పీఏబీఆర్, సీబీఆర్‌లలో ఉన్న జలాలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయి.

నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండి.. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద జలాలు చేరాలంటే ఆగస్టు వరకూ వేచిచూడాల్సిందే. తుంగభద్ర జలాశయానికి జూలై నాటికి వరద జలాలు చేరే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద జలాలు వచ్చే వరకూ అంటే మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మున్నేరు, వైరా ఉపనదులతోపాటు కృష్ణానదిలో నీటిచుక్క కనిపించడం లేదు.  ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement