దుర్గమ్మకు చేరువగా కృష్ణమ్మ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
దుర్గమ్మకు కృష్ణమ్మ మరింత చేరువైంది. నిన్నటి వరకు నీటి జాడలేని దుర్గాఘాట్‌లో గురువారం సాయంత్రానికి మూడు అడుగుల మేర నీరు చేరింది. దుర్గాఘాట్‌లో నీటిమట్టం పెరగడంతో అమ్మవారి భక్తులతోపాటు సందర్శకుల తాకిడి పెరిగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు దుర్గాఘాట్‌లోనే పుణ్యస్నానాలు ఆచరించారు.
యాత్రకుల రద్దీ ప్రారంభం
శుక్రవారం ఉదయం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచే యాత్రకుల రద్దీ ప్రారంభమైంది. బస్సు, రైళ్ల ద్వారా నగరానికి చేరుకున్న భక్తులు స్నానఘాట్లకు వస్తున్నారు. పుష్కర యాత్రికులతోపాటు నగరానికి చెందినవారు ఘాట్లలో ఏర్పాట్లను తిలకించేందుకు వస్తుండడంతో సదండి వాతావరణం నెలకొంది.