రాజధానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటిస్థాయులు గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సమృద్ధిగా కనిపిస్తున్నాయి.
సాక్షి, ముంబై: రాజధానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటిస్థాయులు గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సమృద్ధిగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు (బీఎంసీ) నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటిమట్టం 79 శాతం వరకు ఉందని అధికారి ఒకరు వెల్లడించారు. గత ఏడాది ఇవన్నీ 75 శాతం వరకు మాత్రమే నిండాయి. ముంబైకి నీటి సరఫరా చేస్తున్న రాష్ట్ర జలాశయాల్లోనూ భారీగా నీటినిల్వలు ఉన్నాయి. నీటిపారుదలశాఖ గణాంకాల ప్రకారం.. ముంబైకి నీరు అందించే వాటిలో ఒకటైన తుల్సీ డ్యామ్‌లో గత ఏడాది 88 శాతం నీళ్లు ఉండగా ప్రస్తుతం ఇది పూర్తిగా నిండింది. విహార్ సరస్సులో జలమట్టం 93 శాతానికి చేరుకుంది. గతంలో ఇది 82 శాతం వరకు మాత్రమే నిండింది.
కొన్నింట్లో తగ్గుముఖం
తాన్సా డ్యామ్‌లో నీటిమట్టం 92 శాతం మాత్రమే ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. 2012లో ఇది దాదాపు 97 శాతం నిండింది. అంతేగాక మోదక్‌సాగర్ డ్యామ్‌లో ఇప్పుడు 88 శాతం వరకు నీటి మట్టం ఉంది. గత ఏడాదిలో ఇందులో నీటిమట్టం 95 శాతం ఉండేది. 2012తో పోల్చితే ఇది కూడా చాలా తక్కువని బీఎంసీ తెలిపింది. మధ్య వైతర్ణ డ్యామ్‌లో ఇప్పడు 60 శాతం వరకు నీటిమట్టం ఉండగా, గత ఏడాది ఇది 45 శాతం మాత్రమే. భత్సా, వైతర్ణ డ్యామ్‌లలో గత ఏడాదితో పోల్చితే ఈసారి జలమట్టాలు నాలుగు శాతం నుంచి తొమ్మిది శాతం దాకా పెరిగాయి. బీఎంసీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ విభాగం అధికారి ఒకరు మాట్లాడుతూ.. నీటిని కొత్తగా ప్రారంభమైన మధ్య వైతర్ణడ్యామ్‌తోపాటు వివిధ రిజర్వాయర్ల నుంచి ముంబైకి రోజుకు 3,700 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. డ్యాముల్లో నీటిమట్టం భారీగా పెరగడంతో ఇక సరఫరాలో కోతలు ఉండే ప్రసక్తే లేదని స్పష్టీకరించారు. అమరావతి డ్యాముల్లో జలమట్టాలు 99 శాతం ఉండగా, పుణేలో 93 శాతం, కొంకణ్‌లో 90 శాతం, నాగ్‌పూర్‌లో 89 శాతం, నాసిక్‌లో 84 శాతం మరాఠ్వాడా జలాశయాల్లో 60 శాతం వరకు నీటినిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 84 భారీ జలాశయాల్లో 86 శాతం వరకు నీటినిల్వలు ఉన్నాయి. 2012లో 60 శాతం, 2011లో 83 శాతం వరకు నిల్వలు ఉండేవని, ఈ ఏడాది అవి భారీగా పెరిగాయని అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల డ్యాములతో పోల్చితే అమరావతిలోని అతిపెద్ద డ్యామ్‌లోనూ నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉంది. పుణే జలాశయాల్లో 98 శాతం, కొంకణ్‌లో 96 శాతం, నాగపూర్‌లో 91 శాతం, నాసిక్‌లో 83 శాతం మరాఠ్వాడా డ్యాముల్లో 59 శాతం జలమట్టాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేగాక 221 మధ్య తరహా జలాశయాల్లో 81 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది 63 శాతం, 2011లో 75 శాతం నిల్వలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా డ్యాములతో పోలిస్తే కరువుపీడిత మరాఠ్వాడాలో జలమట్టాల పరిమాణం 64 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. ఇదిలా వుండగా చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఈసారి 76 శాతం నీటిమట్టం ఉంది. గత ఏడాది 48 శాతం ఉండగా 2011లో 60 శాతం ఉంది. అమరావతి డ్యాముల్లో 95 శాతం వరకు నీటి మట్టం ఉంది. కొంకణ్ ప్రాంత డ్యాముల్లో 85 శాతం, నాసిక్‌లో 81 శాతం, పుణేలో 64 శాతం మరాఠ్వాడాలో అతి తక్కువగా 62 శాతం మాత్రమే జలాశయాలు నిండాయి.