- మొదట్లో నీరందక ఎండాయి
- ప్రస్తుతం అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు
- తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు
- పంట నష్టం అంచనాలో అధికారుల నిర్లక్ష్యం
- పూర్తిగా నష్టపోయినా జాబితాలో కనిపించని పేర్లు
- వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయని వైనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రకృతి వైపరీత్యాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లాలోని రిజర్వాయర్ల కింద సాగు నీరందక సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అందులో కనుపూరు, బ్రాహ్మణకాక, బండిపల్లి, వెంకటాచలం, మనుబోలు, గూడూరు తదితర ప్రాంతాల్లో వరి చేలు ఎండిపోయాయి. అయితే మంత్రులు దేవినేని ఉమ, నారాయణలు మాత్రం ఒక్క ఎకరా కూడా పంట ఎండిపోలేదని ప్రకటనలు చేసి చేతులు దులుపుకొన్నారు. అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా వెంకటగిరి, ఉదయగిరి ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద సాగవుతున్న పంటలు ఎండిపోయాయి.
ఇందులో ఉద్యానపంటలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలూ దెబ్బతింటున్నాయి. ఇది అన్నదాతలకు శరఘాతంలా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో పంటలు నష్టపోయినా.. ప్రభుత్వం ఇచ్చే పరిహారానికీ అనర్హులుగా మిగిలిపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉన్నా అటువైపు కన్నెత్తై చూడటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో నాలుగు పర్యాయాలు అకాల వర్షాలు పడ్డాయి. కురిసిన ప్రతిసారి చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. గత నెల 12 నుంచి 17వరకు జిల్లాలో ఉన్నట్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.
ఆ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 17 మండలాల పరిధిలో సుమారు 12 వేల హెక్టార్లలో వరి, వేరుశనగ పంట దెబ్బతింది. అందులో సోమశిల, గూడూరు, ఆత్మకూరు, వెంకటాచలం, విడవలూరు తదితర మండలాల పరిధిలో పంట నష్టం అధికంగా ఉందని అంచనా. అయితే అధికారులు మాత్రం 11 మండలాల్లో 2,184 హెక్టార్లలో మాత్రం పంటలు దెబ్బతిన్నాయని తేల్చారు. మిగిలిన ఆరు మండలాల సంగతి పట్టించుకోకపోవటం గమనార్హం. తాజాగా శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఫలితంగా ఆత్మకూరు, కలువాయి, చేజర్ల, అనంతసాగరం, పొదలకూరు, సైదాపురం, వరికుంటపాడు, ముత్తుకూరు తదితర మండలాల పరిధిలో వరి పంటతో పాటు ఉద్యాన పంటలైన మామిడి, నిమ్మ, బొప్పాయి, అరటి పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.
రైతులను కలవని అధికారులు
ఇటీవల వరుసగా అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. అందుకు ప్రభుత్వం 14 బృందాలను నియమించింది. వీరు బృందాలుగా విడిపోయి గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది. అయితే కొందరు అధికారులు పంటలు దెబ్బతిన్న గ్రామాల్లో పర్యటించనే లేదని రైతులు చెబుతున్నారు. అందుకు నిదర్శనం గూడూరు మండలమే. చెన్నూరు గ్రామానికి చెందిన పెద్దరమణయ్య 13 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశారు.
ఎకరాకు రూ.25వేల వరకు వెచ్చించి అతికష్టంపై పంటను గట్టెక్కించారు. ఒకటి రెండురోజుల్లో పంటను కోసి ధాన్యాన్ని విక్రయించాలని భావించారు. అయితే అకాల వర్షంతో పంటంతా నీట మునిగింది. ధాన్యం మొలకలు వచ్చాయి. నీటమునిగిన పంటను కోసి తడిసిన ధాన్యాన్ని నివాసానికి తెచ్చారు. అదే గ్రామానికి చెందిన నెల్లూరు వీర రాగయ్యకు చేతికొచ్చే 14 ఎకరాల్లోని వరి పంట అకాల వర్షంతో నీటమునిగింది. ధాన్యం మొలకులు వచ్చాయి. తీవ్రంగా నష్టపోయిన ఈ ఇద్దరు రైతులను అధికారులు వచ్చి పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్న పాపాన పోలేదు.
మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనైనా విక్రయించాలని భావించారు. అయితే కొనుగోలు కేంద్రాలకు వెళితే పట్టించుకునే నాధుడే కరువయ్యారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా సూళ్లూరుపేట, పెళ్లకూరు, గూడూరు, ఏఎస్‌పేట మండలాల పరిధిలో అనేక మంది రైతులు అకాల వర్షంతో పంటలు పోగొట్టుకున్న రైతులు ఉన్నారు. వారిని గుర్తించి పంట నష్ట పరిహారం జాబితాలో చేర్చాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.
కలిసిరాని కాలం
Published Tue, May 5 2015 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement