- రిజర్వాయర్ల ఆధునికీకరణకు రూ.కోట్లు అవసరం
- బడ్జెట్‌లో రూ.30 లక్షలే కేటాయింపు
- రైతుల్లో తీవ్ర ఆగ్రహం
- చివరి ఆయకట్టుకూ నీరివ్వాలని డిమాండ్
- వైఎస్ హయాంలో రూ.42 కోట్ల విడుదల
వ్యవసాయానిక పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు నిధుల మంజూరులో మాత్రం వివక్ష చూపింది. అసలే వర్షాలు లేక సాగు కష్టంగా మారిన తరుణంలో, కనీసం రిజర్వాయర్ల ఆధునికీకరణ జరిగితే పంటల సాగుకు ఢోకా ఉండదనుకుంటే రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.
చోడవరం : జిల్లాలోని రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్ల ఆధునికీకరణ కోసం కొన్నేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పనులు పూర్తయితే అదనంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వారి ఆశ. అయితే ఈ ఏడాది (2014-15) తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.లక్షకోట్ల బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేవలం మొక్కుబడిగా రూ.30లక్షలు మాత్రమే కేటాయించడంతో ఈ పనులు ప్రశ్నార్థకంగా మారాయి.
వైఎస్ హయాంలో...
2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాలో రిజర్వాయర్ల ఆధునికీకరణకు ఒకే సారి రూ.42 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో చాలా మేరకు పనులు జరగడం, పెద్దేరు లాం టి పెద్ద రిజర్వాయరు పనులు పూర్తి జరిగి 15వేల ఎకరాలకు సా గునీరందివచ్చింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో నిధులు సరిపోక పెద్దేరు, కోనాం, కల్యాణపులోవల కాలువలు పూర్తిగా ఆధునికీకరణకు నోచలేదు. రైవాడ జలాశయం ఆధునికీకరణ పనుల్లో జాప్యం వల్ల తర్వాత నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ఫలితంగా ఈ రిజర్వాయరు పరిధి కాలువల ఆధునికీకరణ పనులు నేటికీ పూర్తికాలేదు.
ఈ పనులు చేపట్టాల్సి ఉంది: అలమండ, మేడిచర్ల, వారాడ, వేచలం, లక్కవరం , ఐదు డైవర్షన్ గేట్లు మరమ్మతులు చేయాల్సి ఉంది. కొత్తపెంట వరకు చివరి ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ఎడమ కాలువ 15 కిలో మీటర్ల మేర లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ఈ పనులకు రూ.45 కోట్ల ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కోనాం రిజర్వాయరు పరిధిలో 75 చిన్నకాలువలు, అనుబంధంగా ఉన్న 250 సాగునీటి చెరువులకు గతంలో మంజూరైన రూ.3 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, అదనంగా మరో రూ.5 కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంది. కల్యాణపులోవ కాలువ మరమ్మతులకు రూ.10 లక్షల ప్రాతిపాదన పెట్టారు. పెద్దేరు రిజర్వాయరు ఆధునికీకరణకు రూ.21 కోట్లు వరకు ఖర్చవుతుంది.
ఈ నాలుగు రిజర్వాయర్ల పనులు పూర్తయ్యి చివరి ఆయకట్టుకు నీరందాలంటే సుమారు రూ. 80 కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంది. అయితే తాజా బడ్జెట్‌లో రైవాడకు రూ.15 లక్షలు, కోనాంకు రూ.10 లక్షలు, పెద్దేరు రిజర్వాయరుకు రూ.5 లక్షలు మాత్రమే కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిధులు ఎందుకు పనికొస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కోట్లు అవసరమైతే లక్షలు కేటాయిస్తారా?
ఖరీఫ్ వర్షాలు లేక సాగుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరై చివరి ఆయకట్టు వరకూ నీరందుతుందని ఆశపడ్డాం. తీరా బడ్జెట్‌లో చాలా ఘోరమైన కేటాయింపు చేశారు. రైతులకు మేలు చేస్తామన్న ప్రభుత్వం ప్రాజెక్టుల కేటాయింపులకు ఇంత తక్కువగా చేస్తే ఎలా?. కావలసిన నిధులు పూర్తిగా విడుదల చేస్తే సాగునీటి సమస్య కొంతైనా తీరుతుంది.
-బొడ్డు వెంకటరమణ, రైవాడ జలాశయం ప్రాజెక్టు చెర్మన్