శ్రీశైలం డ్యాం నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరిగ్గా దశాబ్దం తర్వాత కృష్ణా, గోదావరి, వంశధార నదులు పోటాపోటీగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆగస్టు 11వ తేదీ నాటికే నదీ పరీవాహక ప్రాంతంలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా, వంశధార నదుల్లో సెప్టెంబరు వరకూ.. గోదావరి నదిలో అక్టోబర్ వరకూ వరద ప్రవాహం ఉంటుంది. రుతుపవనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురిస్తే పెన్నా నది కూడా పొంగుతుంది. వర్షాలు ఇలాగే కొనసాగితే మధ్య తరహా ప్రాజెక్టులు సైతం నిండుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2009 తర్వాత జీవనదులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకోవడంతో సింహభాగం ప్రాజెక్టుల కింద ఆయకట్టులో ఖరీఫ్, రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఇప్పటికే గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాలో 13.09 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. వంశధార నది పోటెత్తుతుండటంతో గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 25.53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఉత్తరాంధ్రలో నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో తోటపల్లి జలాశయం నిండిపోయింది. తోటపల్లి జలాశయం కింద ఉన్న ఆయకట్టు 1.18 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 10.38 లక్షల ఎకరాలకు ఆదివారం ఆంధ్రపదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఆగస్టు రెండో వారంలోగా నీటిని విడుదల చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆనందోత్సాహాలు
కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడం, ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తుండడంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితో శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్‌ఆర్‌బీసీ) కింద 1.54 లక్షల ఎకరాల్లో పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. తెలుగుగంగ ప్రాజెక్టు కింద కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో 4.36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో పంటల సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలను నింపనున్నారు. దీనివల్ల పెన్నా డెల్టా పరిధిలోని 2.47 లక్షల ఎకరాలు, సోమశిల ప్రాజెక్టు కింద 1.56 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించారు. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతుండడంతో ఇప్పటికే తుంగభద్ర జలాశయం నిండిపోయింది. ఈ ఏడాది తుంగభద్రలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర నదిపై ఆధారపడిన కర్నూలు–కడప(కేసీ) కెనాల్‌కు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. ఈ కెనాల్ కింద 2.66 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ(హెచ్చెల్సీ), దిగువ కాలువలకు(ఎల్లెల్సీ) సోమవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హెచ్చెల్సీ కింద 2.2 లక్షల ఎకరాలు, ఎల్లెల్సీ కింద 1.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది గాలేరు–నగరి, హంద్రీ–నీవా తొలి దశ ఆయకట్టుకు నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టులోనూ...
భూపతిపాలెం, ముసురుమిల్లి వంటి మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. దాంతో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టులో పంటల సాగును రైతులు ప్రారంభించారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు సైతం అధికారులు నీటిని విడుదల చేశారు. చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు కొంతవరకు నిండాయి. నీటి లభ్యత ఆధారంగా వాటి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో గోదావరి డెల్టాతోపాటు నీటి లభ్యత ఆధారంగా మరిన్ని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది రబీ పంటకు కూడా సాగునీరందించే అవకాశాలు ఉండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు సాగుకు నీటి విడుదలిలా
- ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాలోని 10.13 లక్షల ఎకరాలకు
- కృష్ణా డెల్టాలోని 13.09 లక్షల ఎకరాలకు
- గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు
- తోటపల్లి జలాశయం కింద ఉన్న 1.18 లక్షల ఎకరాలకు
- సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణలోని 10.38 లక్షల ఎకరాలకు
Comments
Please login to add a commentAdd a comment