మాయం | Reservoirs, there poaching | Sakshi
Sakshi News home page

మాయం

Published Tue, May 27 2014 12:48 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM

మాయం - Sakshi

మాయం

  •      చెరువుల్నీ మింగేస్తున్నారు..
  •      ఆక్రమణల గుప్పిట్లో జలాశయాలు
  •      కుంటలు, కాలువలన్నీ కబ్జా
  •      ఆనవాళ్లు కూడా లేని చారిత్రక చెరువులు
  •      ఎక్కడ చూసినా నిర్మాణాలే..
  •      వర్షపు నీరు వెళ్లే దారేది?
  •      జలాశయాలపై కొత్త సర్కార్ ఆరా
  •  మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండనట్టే.. నగరంలో ‘చెరువు’ అనే చోట చెరువు ఆనవాలు కూడా ఉండదు. ఉదాహరణకు ‘మాసాబ్‌ట్యాంక్’ అనేది కేవలం పేరుగానే మిలిగింది. అది చెరువు రూపు కోల్పోయి పూర్తిగా నివాసిత ప్రాంతమైపోయింది. కూకట్‌పల్లి ప్రగతినగర్ చెరువుది మరో దుర్గతి.. దీని చుట్టూ నిర్మాణాలు, ఆక్రమణల్లో ఎనలేని ‘ప్రగతి’ కనిపిస్తోంది. ఇంకా ఉప్పల్ నల్లచెరువు, పటేల్  చెరువు, నల్లకుంట, కాజాకుంట, ఎల్లమ్మ చెరువు.. ఏ చెరువు స్థానంలో చూసినా కోకొల్లలుగా నిర్మాణాలే..
     
    సాక్షి, సిటీబ్యూరో: ‘ఇదిగో.. దూరంగా నిర్మాణాలు కనిపిస్తున్న ఆ ప్రాంతం ఒకప్పుడు చెరువు తెలుసా?’.. నగరంలో చెరువుల ఆనవాళ్ల గురించి ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పటి చెరువులన్నీ ఆక్రమణలు, కబ్జాల బారిన చిక్కి శల్యమైపోయాయి. ఫలితం.. నీళ్లు వెళ్లే దారిలేక నాలుగు చినుకులకే నగరం గోదారవుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. రాకపోకలు స్తంభించిపోతున్నాయి.

    లోతట్టు ప్రాంతవాసుల కంటిపై కునుకు కరువవుతోంది. అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న చెరువుల ఆక్రమణలే ఇందుకు కారణం. కొత్తగా కొలువుదీరనున్న తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నగరంలో నెలకొన్న ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దనుంది?, ఈ ప్రధాన సమస్యను ఎలా తీర్చనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికే చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టి.. పక్కా పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత చెరువుల లెక్క తేల్చి వాటి సంరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, హెచ్‌ఎండీఏ పరిధిలోని జలాశయాలపై తొలి సమీక్ష జరపాలని నిర్ణయించినట్టు సమాచారం.
     
    కరిగిపోతున్న ఘన చరిత..
     
    హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ఒకప్పుడు 501కు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు ఉండేవి. ఎంత పెద్ద వర్షం కురిసినా గొలుసుకట్టుగా ఒక చెరువు నిండగానే మరో చెరువులోకి నీళ్లు వచ్చేవి. నగరీకరణ నేపథ్యంలో అక్రమార్కుల కన్ను చెరువులపై పడింది. యథేచ్ఛగా ఆక్రమణలు జరిగా యి. దాదాపు వంద పెద్ద చెరువుల వరకు మాయమయ్యా యి. ప్రస్తుత ం వాటి పేర్లే తప్ప ఆనవాళ్లు కూడా మిగలలేదు.

    ఇక చిన్నా చితకా చెరువులు, కుంటలకు లెక్కేలేదు. 2000 సంవత్సరం నాటికి 10 హెక్టార్ల పైన విస్తీర్ణం కలిగిన చెరువులు 169 మాత్రమే మిగిలినట్టు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తాజా సర్వేలో తేలింది. ఈ లెక్కన ఆక్రమణల పర్వం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. నాడు సాగు, తాగునీరు అందించిన చెరువులు నేడు కాంక్రీట్ నిర్మాణాల మాటున కుంచించుకుపోయాయి.
     
    లెక్కలేస్తే గుండెచెరువే...

    నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని చెరువులున్నాయన్నది లెక్క తేలక హెచ్‌ఎండీఏ తలపట్టుకొంటోంది. రెవెన్యూ రికార్డుల్లోని లెక్కలకు, నిజంగా కనిపిస్తున్న చెరువులకు పొంతన కుదరట్లేదు. జీహెచ్‌ఎంసీ, పాత హుడా పరిధిలోని 501 చెరువుల్లో ఎన్ని ఉన్నాయో తేల్చేందుకు తొలిదశగా నిర్వహించిన సర్వేలో పక్కాగా లెక్క తేలలేదు. నగరంలోని వివిధ చెరువుల్లో ఇప్పటికే వాణిజ్య భవనాలు, ఇళ్లు, అపార్టుమెంట్లు వెలిశాయి.

    చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలంటూ లోకాయుక్త కన్నెర్ర చే యగా హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగి ఆర్వీ కన్సల్టెంట్ ద్వారా ఇటీవల సర్వే నిర్వహించింది. రికార్డుల్లో పేర్కొన్న ప్రకారం జీహెచ్‌ఎంసీలో 176, హుడా పరిధిలో 325 అంటే మొత్తం 501 చెరువులు ఉండాలి.

    అనేక చెరువులు కన్పించకపోగా, 5-8 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన జలాశయాలు 2-3 ఎకరాలకు తరిగిపోయినట్లు తేలింది. 16 చెరువులు జాడే లేవు. సమస్త యంత్రాంగం ఉండే రాజధానిలోని చెరువులకే ఈ గతిపడితే, ఇక హెచ్‌ఎండీఏ విస్తరిత ప్రాంతంలోకి వచ్చే జిల్లాల్లోని జలాశయాల సంగతమేమిటనే లోకాయుక్త ప్రశ్నకు హెచ్‌ఎండీఏ వద్ద సమాధానం లేదు.
     
    ‘సాగర్’ ఘోష

    హుస్సేన్‌సాగర్ ఎగువ ప్రాంతంలో 750 వరకు పలు చిన్న చిన్న చెరువులను గొలుసుకట్టు విధానంలో నిర్మించారు. భారీ వర్షాలతో వరదలొచ్చినా ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరి చివరకు సాగర్‌కు చేరేలా వీటిని రూపొందించారు. అనంతరం నగరం అనూహ్యంగా విస్తరించడంతో చాలా చెరువులు కాలగర్భంలో కలిసిపోయాయి. సుమారు 450 ఏళ్ల క్రితం హుస్సేన్‌సాగర్ చెరువు నిర్మాణానికి రూ.2.54 లక్షలు వెచ్చించారు.

    అప్పట్లో ఇది తాగునీటినే కాక, పంటలకు సాగునీటినీ అందించేది. ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ, వీఎస్‌టీ, బిర్లామందిర్, పబ్లిక్‌గార్డెన్, ఫతేమైదాన్ ప్రాంతాలకు గొట్టపు మార్గాల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. 1948 తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో సాగర్‌లో కలిసే వివిధ కాలువలు, నాలాలు మాయమయ్యాయి.

    నగరం చుట్టుపక్కల విచ్చలవిడిగా పరిశ్రమలు పుట్టుకురావడంతో వాటి వ్యర్థాలు నాలాల ద్వారా సాగర్‌కు చేరడం మొదలైంది. ఇందుకు కూకట్‌పల్లి నాలా ప్రధాన వాహకంగా పనిచేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీటిని నాలాల్లోకి వదులుతున్నారు. ఈ నాలాలన్నీ సాగర్‌లో కలుస్తూ జలాశయాన్ని కాలుష్యకాసారంగా మార్చేశాయి.
     
    కబ్జాల పర్వం ఇలా...

    నగర శివారులోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకూ కబ్జాల చెర తప్పలేదు. 111 జీవో పరిధిలోకి వచ్చే వీటి చుట్టూ ఎలాంటి నిర్మాణాలకూ అవకాశం లేదు. కానీ రిసార్ట్స్, ఫాంహౌస్‌లు, విద్యాసంస్థలు యథేచ్ఛగా ఏర్పాటయ్యాయి
         
    సుమారు 240 చ.కి.మీ పరిధిలోని హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో మొత్తం 80 చెరువులున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో కూకట్‌పల్లి, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ ప్రాంతాల్లోని చెరువులు నిండి ఆ నీరు నాలాల ద్వారా సాగర్‌లో కలుస్తాయి. కానీ, ఆయా చెరువుల్లో ఇప్పుడు కాలనీలు, వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు వెలిశాయి
         
     కూకట్‌పల్లి ప్రగతినగర్ చెరువు, ఎల్లమ్మ చెరువు, కుత్బుల్లాపూర్ కుంట, పంతులు చెరువు, రంగథాముని చెరువులు కబ్జాల పాలయ్యాయి
         
     శేరిలింగపల్లి మండల పరిధిలోని గంగా రం, మదీనాగూడ, బచ్చుకుంట, మల్ల య్యకుంట, పటేల్‌చెరువు, నల్లకుంట చెరువులు ఆక్రమణల్లో చిక్కుకున్నాయి. దీంతో చిన్నపాటి వర్షానికే చుట్టుపక్కల కాలనీలు నీట మునుగుతున్నాయి
         
     బాలానగర్ మండలంలో 16 చెరువులున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. వీటిలో సున్నం చెరువు, కాజాకుంట, ఈదులకుంట, భీముని కుంట, అలీ తలాబ్‌చెరువు, నల్లచెరువులు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి
         
     అంబరు చెరువులోనైతే ఆక్రమణలకు అడ్డూ అడుపూ లేదు
         
     సరూర్‌నగర్ చెరువులో ఇప్పటికీ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కర్మన్‌ఘాట్‌లోని చేపల చెరువు, రామంతపూర్ చెరువు, ఉప్పల్ నల్లచెరువు చాలావరకు ఆనవాళ్లు కోల్పోయాయి
         
     600 హెక్టార్లకుపైగా విస్తీర్ణం కలిగిన ఈ చెరువుల స్థలాల విలువ ఇప్పటి మార్కెట్ ధర ప్రకారం రూ.6వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. గత ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఇక్కడ రూ.3 వేల కోట్ల విలువైన స్థలాలు ఇప్పటికే కబ్జా అయ్యాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement