ఉల్లంఘనుల గుండెల్లో గుబులు
- నగర వ్యాప్తంగా విస్తరించిన అక్రమ కట్టడాలు
- ఏటా పెరుగుతోన్న నిర్మాణాలు
- అధికారులు గుర్తించినవి కొన్నే
- అంతకు మూడు రెట్లు అధికం..
- గురుకుల్ ట్రస్ట్‌తో మొదలైన కూల్చివేతలు
- గ్రేటర్ మొత్తంపై దృష్టిసారించనున్న అధికారులు
- ఆందోళనలో అక్రమార్కులు
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ కట్టడాల పేరిట చేపట్టిన కూల్చివేతలు గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అయ్యప్ప సొసైటీతోనే ఆగుతుందా లేక నగరంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందా అనేది ప్రస్తుతం గ్రేటర్‌లో చర్చనీయాంశమైంది. స్థానికుల నిరసనల మధ్యే గురుకుల్ ట్రస్ట్ పరిధిలో రెండు రోజులుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురుకుల్ సహా గ్రేటర్‌లోని అక్రమ నిర్మాణాలన్నింటిపై చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించిన దరిమిలా నగరంలోని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
గత ఆరునెలల్లో భారీగా..
ఓటరు నమోదు, సార్వత్రిక ఎన్నికల పనుల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు బిజీగా ఉండడంతో ఆరు నెలలుగా అక్రమ నిర్మాణాలపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలను జోరుగా కొనసాగించారు. గ్రేటర్ పరిధిలో 865 అక్రమ నిర్మాణాలున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. గడచిన నాలుగేళ్లలో అవి వెలసినట్లు పేర్కొంటున్నా ఇటీవలే ఎక్కువ నిర్మాణాలు జరిగాయి. అధికారుల దృష్టికి రాని కట్టడాలు అంతకు మూడు రెట్లు ఎక్కువే ఉంటాయని అంచనా. దృష్టికొచ్చిన అక్రమ నిర్మాణాల్లో 229 మందిపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే వీరికి తగిన శిక్షలు లేకపోవడంతో చట్టాలను ఎవరూ లెక్కచేయట్లేదు.
నాలుగేళ్లలో 50 వేల దరఖాస్తులు..
భవన నిర్మాణాల అనుమతుల కోసం నాలుగేళ్లలో జీహెచ్‌ఎంసీకి 50 వేల దరఖాస్తులు రాగా, వాటిలో 1,500 ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ సెల్లార్లలో ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవంతులకూ కొదవ లేదు. 799 భవనాలు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు వాటిల్లో 31 భవనాలను సీజ్ చేశారు. 384 కూల్చివేశారు. 45 మంది యజమానులు కోర్టులను ఆశ్రయించారు.
నిర్మాణ అనుమతి పొంది.. అందుకు విరుద్ధంగా నిర్మించిన వారి సంఖ్యా ఎక్కువే ఉంటుంది. అలాంటి వారి నుంచి కాంపౌండింగ్ ఫీజుగా రూ.60.02 కోట్లు వసూలు చేశారు. నాలుగేళ్లలో నిర్మాణానికి అనుమతి పొందినవారు దాదాపు 50 వేల మంది ఉండగా, అందులో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 6,042 మంది మాత్రమే కావడం గమనార్హం.
మిగతా వారంతా నిబంధనలు ఉల్లంఘించిన వారేనని భావించాల్సి వస్తోంది. ఆక్యుపెన్సీకి దరఖాస్తు చేసుకున్న వారిలో సైతం 536 భవనాల్లో ఉల్లంఘనలున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ లెక్కన సక్రమంగా నిర్మాణాలు జరిగిన భవనాలెన్ని ఉంటాయో తేలిగ్గానే అంచనా వేయవచ్చు. అక్రమ నిర్మాణాలపై కొత్త సర్కార్ సీరియస్‌గా ఉండడంతో అక్రమార్కులు ఆందోళనకు గురవుతున్నారు.