కూల్చివేతలతో పాటు అభివృద్ధి పనులు
సమాంతరంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు కూల్చివేయడంతో పాటు రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల పనులను సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బ్యాంకుల నుంచి ఆర్థిక వనరులను సమీకరించి నగరంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు ప్రణాళికలు రూపొందించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆ శాఖ మంత్రులను ఆదేశించారు. నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలతో పాటు ఇతర అభివృద్ధి పనులపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలతో బ్యాంకర్లలో విశ్వాసం పెరిగిందని, రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారని సీఎం అన్నారు. బ్యాంకులిచ్చే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందన్నారు. నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
రైతుల భాగస్వామ్యంతో టౌన్‌షిప్‌లు: రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత ప్రాతిపదికన చేపట్టడంతో పాటు నగరం చుట్టూ రైతుల భాగస్వామ్యంతో టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరదలతో నగరంలోని రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే కేంద్రానికి నివేదిక పంపించాలన్నారు. బుధవారం సాయంత్రం వరకు 400 కట్టడాలను కూల్చివేశామని సీఎంకు అధికారులు నివేదించగా, అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో ఇదే వేగం కొనసాగించాలని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.