కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర!
సీఎం తుది నిర్ణయం కోసం నిరీక్షణ
- రేసులో ఎస్‌పీ సింగ్, ఎస్‌కే జోషీ,ఎంజీ గోపాల్, ఆర్‌ఆర్ ఆచార్య కూడా..
- నేడు పదవీ విరమణ చేయనున్న రాజీవ్‌శర్మ
- ఘనంగా వీడ్కోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఎవరిని నియమి స్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఇంత కీలకమైన బాధ్యతలను సీఎం ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. సీనియారిటీ ప్రకారం రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర రేసులో ముందున్నారు. అరుుతే మంగళవారం రాత్రి వరకు కూడా సీఎస్ నియామకానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలోనే ఉంది. దీంతో కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశముంది.
సీఎం నిర్ణయం మేరకే..
సాధారణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్‌లు సీఎస్ పోస్టింగ్‌కు అర్హులవుతారు. కానీ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంపై ఆధారపడి ఈ నియామ కాలు జరుగుతుంటారుు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది అధికారులు స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. వారిలో కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్రను నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సైతం ఇందుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కీలక శాఖలు నిర్వహించిన ప్రదీప్ చంద్ర
రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులలో రాజీవ్‌శర్మ తర్వాత సీనియర్ ప్రదీప్ చంద్ర. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో పరిశ్రమలు, వాణిజ్య, ఆర్థిక శాఖలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలక విభాగాల్లో.. విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ కావడంతోపాటు వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రదీప్ చంద్రనే సీఎస్‌గా నియమించే అవకాశాలున్నారుు. అరుుతే ఆయన పదవీకాలం డిసెంబర్ నెలాఖరునే ముగియనుంది. అంటే నెల రోజుల్లోనే పదవీ కాలం ముగియనుండటంతో ప్రదీప్ చంద్రకు అవకాశమిస్తారా..? తదుపరి జాబితాలో ఉన్న సీనియర్లను ఎంచుకుంటారా.. అన్నది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రదీప్‌చంద్ర తర్వాత సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్‌లు ఎస్‌పీ సింగ్, ఎస్‌కే జోషీ, ఎంజీ గోపాల్, ఆర్‌ఆర్ ఆచార్యల పేర్లు వినిపిస్తున్నారుు.
కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్‌శర్మ
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌శర్మ 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేయటంతో పాటు వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగానూ పనిచేశారు. ఏపీ పునర్విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీకి నోడల్ ఆఫీసర్‌గా కీలక భూమిక పోషించారు. పాలనలో మంచి అనుభవం ఉన్న నేపథ్యంలో పదవీ విరమణ అనంతరం కూడా రాజీవ్‌శర్మ సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణరుుంచారు. సీఎం సలహాదారుగా నియమించి, పరిపాలనా సంస్కరణల బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోం ది. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నారుు.
రాజీవ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు
సీఎస్‌గా పదవీ విరమణ చేస్తున్న రాజీవ్ శర్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అధికారులతో పాటు మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎస్‌కు వీడ్కోలు పలకాలని స్వయంగా సీఎం కేసీఆర్ రెండ్రోజుల కిందటి కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ సీఎస్‌గా ఉన్న రాజీవ్‌శర్మ పనితీరును ప్రశంసించారు. మంత్రులతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు కూడా ఈ సందర్భంగా సీఎస్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలాఖరుతోనే రాజీవ్‌శర్మ పదవీకాలం ముగిసింది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్రం.. రెండు సార్లు మూడు నెలల చొప్పున ఆయన పదవీకాలాన్ని పొడిగించింది.