నాణ్యత విషయంలో రాజీ వద్దు | Do not compromise on quality | Sakshi
Sakshi News home page

నాణ్యత విషయంలో రాజీ వద్దు

Published Tue, Jul 17 2018 2:30 AM | Last Updated on Tue, Jul 17 2018 2:30 AM

Do not compromise on quality - Sakshi

సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రిజర్వాయర్ల పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని ఇంజనీర్లను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కనీసం 200 ఏళ్ల పాటు ప్రజా అవసరాలు తీర్చేవిగా రిజర్వాయర్లు ఉండాలన్నారు. క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. నాణ్యత విషయంలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సోమవారం జలసౌధలో డిండి ఎత్తిపోతల పథకం పనులు, ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పురోగతిపై సమీక్షించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన సింగరాజు పల్లి, గొట్టి ముక్కల రిజర్వాయర్‌ పనుల వేగం పెంచి ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.

సింగరాజు పల్లి రిజర్వాయర్‌ ద్వారా చెరువులు నింపేందుకు డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌ వర్క్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు. గొట్టి ముక్కల రిజర్వాయర్‌ పనులు 70 శాతం పూర్తయ్యాయని మిగతా  పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రిజర్వాయర్‌ పరిధిలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులకు రూ.32 కోట్లు అవసరమవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలపగా ఆ నిధులు విడుదల చేస్తామన్నారు. సింగరాజు పల్లి రిజర్వాయర్, గొట్టిముక్కల రిజర్వాయర్‌ పనులకు మరో రూ.పది కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. కిష్టరాంపల్లి రిజర్వాయర్‌ పనులకు రూ.పది కోట్లు  విడుదల చేసేందుకు అంగీకరించారు. ప్యాకేజీ–6లోని శివన్న గూడెం రిజర్వాయర్‌ను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు.  

పనుల్లో జాప్యాన్ని సహించం 
పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టు లకు నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని  హరీశ్‌రావు తెలిపారు. పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పరిధిలో సర్వీస్‌ బే కంట్రోల్‌ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 31లోగా ఒక పంపును రన్‌ చేసేలా పనులు చేయాలని  ఇంజనీర్లను ఆదేశించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 300 ఎకరాల వరకు, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల వరకు భూ సేకరణ జరపాలని మంత్రికి ఇంజనీర్లు తెలపగా,జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌తో హరీశ్‌ ఫోన్‌లో మాట్లాడారు.

మంగళవారం సమావేశం నిర్వహించి భూ సేకరణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీల్డ్‌ చానల్స్‌ తవ్వే విషయంలో గ్రామస్తులు సహకరించడం లేదని ఇంజనీర్లు మంత్రి దృష్టికి తేవడంతో, వెంటనే జిల్లా కలెక్టర్లు, రైతు సమితి సభ్యులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆల్మట్టి, తుంగభద్రల నుంచి నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరిన వెంటనే కల్వకుర్తి మోటార్‌ ఆన్‌ చేయాలన్నారు.

భూ సేకరణపై దృష్టి పెట్టండి 
డిండి ప్రాజెక్టుకు సంబంధించి అటవీ శాఖ పరిధిలో ఉన్న భూముల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని హరీశ్‌ సూచించారు. జిల్లా కలెక్టర్లు, అటవీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన సలహాదారు సుధాకర్‌తో చర్చించి వెంటనే పరిష్కరించాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు ప్రత్యేకంగా చీఫ్‌ ఇంజనీర్‌ను ఏర్పాటు చేయాలని ఈఎన్‌సీలు మురళీధర్, నాగేందర్‌రావులకు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement