భూసేకరణ కొలిక్కి రావడంతో 14 ప్యాకేజీల్లో మొదలైన పనులు
- కొత్త మార్గదర్శకాల ప్రకారం మిగతా భూసేకరణ చేయండి: హరీశ్
- ప్రాజెక్టు ప్రారంభానికి నేటితో రెండేళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు అనేక ఆటుపోట్లను దాటుకొని గాడిలోపడ్డాయి. ప్రధాన పనుల వద్ద మెజార్టీ భూసేకరణ పూర్తవడంతో పంప్‌హౌస్‌లు, టన్నెళ్లు, రిజ ర్వాయర్లు, కాల్వల పనులు వేగం పుంజుకు న్నాయి. మొత్తంగా 18 ప్యాకేజీలకుగానూ 14 ప్యాకేజీల్లో నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మిగతా చోట్ల కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం భూసేకరణ చేపట్టనుంది.
12.32 లక్షల ఎకరాలకు నీరందేలా..
పూర్వ మహబూబ్‌నగర్,రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.32లక్షల ఎకరాలకు సాగు నీరం దించేందుకు ఈ ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టారు. మొదటి విడతలోని 5 రిజర్వాయర్ల పరిధిలో పంపుహౌస్‌లు, కాల్వ లు, టన్నెళ్లు నిర్మించడానికి రూ.30వేల కోట్లతో పనులు చేపట్టగా, మొత్తంగా 27,286 ఎకరాల మేర భూమి అవసరం ఉంటుందని గుర్తించారు. ఇందులో 14,457 ఎకరాల మేర సేకరణ పూర్తి చేశారు. మిగతా సేకరణకు కోర్టు కేసులు అడ్డంకిగా మారడంతో ఆరు నెలలుగా ఈ ప్రక్రియకు విఘాతం కలిగింది.
వడివడిగా ప్రధాన పనులు..
ప్రస్తుతం అవాంతరాలన్నీ తొలగడంతో 14 ప్యాకేజీల్లో పనులు ప్రారంభం కాగా, మరో 4 ప్యాకేజీల్లో మొదలు పెట్టాల్సి ఉంది. కల్వకుర్తి పంప్‌హౌస్‌కు 350 మీటర్ల దూరంలో, రోజు కు 2 టీఎంసీలు తీసుకునేలా 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9పంపుల ఏర్పాటుకు అనుగు ణంగా నార్లాపూర్ పంప్‌హౌస్ పనులు ప్రారం భమయ్యాయి. ప్రస్తుతం మట్టి పనులు కొనసాగుతున్నాయి. 8.6టీఎంసీల సామర్థ్యం ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌లో 25 లక్షల క్యూబిక్ మీటర్ల నల్లమట్టి పని పూర్తయింది. ఈ రిజర్వాయర్ నుంచి ఏదులకు 16 కి.మీ. టన్నెల్ అవసరం ఉండగా జంట టన్నెళ్ల నిర్మాణం మొదలైంది. రోజుకు 30 మీటర్ల మేర తవ్వేలా పనులు కొనసాగుతున్నాయి. ఏదుల పంప్‌హౌస్ పనులను రూ.4,500 కోట్లతో చేపట్టగా.. 16 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వకం ఆరంభమైంది.
పంప్‌హౌజ్ వెళ్లేందుకు సమాంతరంగా రెండు టన్నెళ్లు, ఎమర్జెన్సీ టన్నెల్ నిర్మాణాలు పట్టాలెక్కాయి. ఇక్కడ 42 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని ఉండగా, 10 లక్షల మేర పూర్తయింది. 6.55 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఏదులలో కోటి క్యూబిక్ మీటర్ల మట్టి పనిలో 25 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తి చేశారు. ఈ రిజర్వా యర్‌ను పూర్తి చేస్తే పక్కనే కల్వకుర్తిలో ఐదో డిస్ట్రిబ్యూటరీ నుంచి నీటిని తీసుకొనే అవస రం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పనులు వేగంగా చేస్తున్నారు.
ప్రారంభం కాని ‘వట్టెం’ పనులు
వట్టెం రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులు భూసేకరణ కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. గరిష్ట భూ పరిహారం కోరుతున్న ఉద్ధండాపూర్ దిగువన ఉన్న మూడు ప్యాకేజీ ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇటీవ ల భూసేకరణ ప్రక్రియపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు తేవడంతో ఆ ప్రకారం సేకర ణ వేగిరం చేయాలని మంత్రి హరీశ్‌రావు అధి కారులకు సూచించారు. 2018 చివరి నాటికి ఒక్క పంపు అయినా ప్రారంభించి, రోజుకు 4 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని తీసుకునేలా పనులు జరగాలని ఆదేశాలి వ్వడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
చెన్నైలోనే తేల్చుకోండి: ఎన్జీటీ
పాలమూరుృరంగారెడ్డి పనులపై స్వతంత్ర కమిషన్‌తో విచారణ జరిపించాలంటూ ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ స్వతంత్రకుమార్.. ఈ అంశాన్ని చెన్నై గ్రీన్‌ట్రిబ్యునల్ వద్దే తేల్చుకోవాలని సూచించారు. వాస్తవానికి పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు విషయంలో పనులు సాగుతున్న తీరుతెన్నులు, అటవీ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు తదితర విషయాల్లో నిజానిజాలను తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ను నియమిస్తూ మే నెలలో చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా, స్వతంత్ర కమిషన్ ఏర్పాటు అమలు ప్రక్రియను నిలిపివేసింది. దీంతో పిటిషన్‌దారులు మళ్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్, చెన్నై ట్రిబ్యునల్‌లో పీఎస్‌రావు సాంకేతిక సభ్యుడుగా ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించినట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.