పంటలకు ప్రాణం
ఊపిరిపోస్తున్న వర్షం
ఇన్నాళ్లూ లోటు వర్షపాతం
ఏజెన్సీలో వరినాట్లు ప్రారంభం
అన్నదాతల్లో ఆనందం
విశాఖపట్నం: దాదాపు నెల రోజుల నుంచి వాన చినుకు కునుకేసింది. సమృద్ధిగా కురవాల్సిన తరుణంలో ముఖం చాటేసింది. ఆరంభంలో ఆనందాన్ని పంచి ఆ తర్వాత జాడ లేకుండా పోయింది. అంతేకాదు మండే ఎండలతో వరి నారుమళ్లు, చెరకు, ఇతర పంటలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ నెల లోని 23 రోజుల్లో ఏకంగా వారం రోజుల పాటు ఒక్క చినుకూ కురవలేదు. మిగిలిన రోజుల్లో అరకొర జల్లులే పడ్డాయి. అయితే ఇవేమీ పంటలకు మేలు చేయలేదు. మరోవైపు జలాశయాల్లోనూ నీరు ఆశాజనకంగా లేదు. ఈ పరిస్థితుల్లో రైతన్నల్లో ఆందోళన నెలకొంది. వర్షం ఎప్పుడు కురుస్తుందా? అని రోజూ కొండంత ఆశతో ఎదురు చూశారు.
ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 20న కొయ్యూరు, రాంబిల్లిల్లో 3 సెంటీమీటర్లు , డుంబ్రిగుడ, జి.మాడుగుల, కోటఉరట్ల, నక్కపల్లి, ఎస్.రాయవరంలలో 2 సెంటీమీటర్లు, 21న యలమంచిలిలో 9 సెంటీమీటర్లు, చింతపల్లిలో 5, విశాఖపట్నం, కొయ్యూరు, జీకే వీధిల్లో 3, నర్సీపట్నంలో 2 సెంటీమీటర్లు, 22న చింతపల్లిలో 12, గొలుగొండ, పాయకరావుపేట, నక్కపల్లిల్లో 4, నర్సీపట్నం, భీమిలిల్లో 3, అరకు, విశాఖపట్నం, పాడేరు, రోలుగుంట, చోడవరంలలో 2 సెంటీమీటర్లు, అనకాపల్లి, యలమంచిలిల్లో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదయింది. గురువారం కూడా జిల్లాలో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు ఇప్పుడు పంటలకు ప్రాణం పోస్తుండడంతో అన్నదాతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుదలలో ఉన్న వరినారు ఊపిరి పోసుకుంటోంది. ఇప్పటికే మన్యంలో వరినాట్లు ప్రారంభమయ్యాయి. అలాగే అపరాల సాగుకు, వేరుశనగ పంట తీయడానికి పనికొస్తుంది. మరింతగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే చాలాచోట్ల వరినాట్లు వేసుకోవడానికి వీలుపడుతుంది.
ఇంకా లోటు వర్షపాతమే..
ఇలావుండగా జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతోంది. దాదాపు మూడు వారాల పాటు ఎండల ధాటిగా కొనసాగడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ నెల23వ తేదీ వరకు జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 197 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 115 మిల్లీమీటర్లే కురిసింది. అంటే 41 శాతం లోటు వర్షపాతమన్న మాట. ఈ నెలలో హుకుంపేట (-87శాతం), పాడేరు -83శాతం), మాడుగుల (-76శాతం) పెదబయలు, చోడవరం, అరకు, అనంతగిరి, చీడికాడ, జి.మాడుగుల, ముంచంగిపుట్టు (10 మండలాలు)ల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయింది. గొలుగొండ, చింతపల్లి, గాజువాక, విశాఖపట్నం, పెదగంట్యాడ, పరవాడ, అనకాపల్లి, మునగపాక, కశింకోట, పాయకరావుపేట, నక్కపల్లి (11 మండలాలు)ల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. మిగిలిన డుంబ్రిగుడ, దేవరాపల్లి, జీకేవీధి, కొయ్యూరు, నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, బుచ్చయ్యపేట, కోట ఉరట్ల, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ అర్బన్, మాకవరపాలెం, ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం (22) మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదయింది. మూడు రోజులుగా కురుస్తున్న వానలతోనే ఈ మాత్రం వర్షపాతమైనా పెరగడానికి దోహదపడింది.