సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు సాగు నీరందించేందుకు చేపట్టిన బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.2611.25 కోట్లు విడుదయ్యాయి. గత నెలలోనే ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేయగా.. తాజాగా నిధులు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మల్లన్నసాగర్ పరిధిలో బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లను చేపట్టారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన ఐదు రిజర్వాయర్లలో రెండు యాదాద్రిభువనగిరి జిల్లాలో ఉన్నాయి.
పూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు లేని ఈజిల్లాకు రెండు రిజర్వాయర్లను నిర్మించి సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్‌ను 11.39, తుర్కపల్లి మండలం గంధమల్ల రిజర్వాయర్‌ను 9.86 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ రెండు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 2,43,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతోపాటు హైదరాబాద్‌లోని కొంత ప్రాంతానికి తాగు నీరివ్వాలని నిర్ణయించారు.
ఇదీ సామర్థ్యం..
ముందుగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌లో భాగంగా బస్వాపురం రిజర్వాయర్‌ను .08 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 14.69 టీఎంసీలుగా నిర్ణయించారు. దీంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఆరు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ముందుగా పెంచిన రిజర్వాయర్ సామర్థ్యాన్ని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో 11.39 టీఎంసీలుగా తగ్గించారు.
అలాగే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు 15,16 ప్యాకేజీల్లో కాల్వల పనులు పురోగతిలో ఉన్నాయి. బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల ద్వారా హైదరాబాద్ నగర ప్రజల దాహా ర్తిని తీర్చడంతోపాటు పాటు జి ల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు సాగు నీరందనుంది. గంధమల్ల రిజర్వాయర్ వల్ల ఆలేరు నియోజకవర్గంలోని రాజాపే ట, యాదగిరిగుట్ట మండలాల్లో కొంతభాగం, ఆలేరు, గుండాల మండలాల రైతులకు సాగు నీరందనుంది.
నిధుల కేటాయింపు ఇలా..
జిల్లాలో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణ నిధులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గంధమల్ల రిజర్వాయర్ కోసం రూ.860.25కోట్లు, బస్వాపురం రిజర్వాయర్ కోసం రూ.1751 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తారు. కేబినెట్‌లో అనుమతి రావడంతో ఇక టెండర్ల ప్రక్రియ ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
రిజర్వాయర్లకు రూ.2,611 కోట్లు
Published Thu, Mar 9 2017 3:18 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
Advertisement
Advertisement