రూ.2,680 కోట్లకు ఎసరు!
ఏపీ జెన్కోలో విచ్చలవిడి అవినీతి
* రెండు కొత్త థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో గోల్మాల్
* ప్రైవేటు కాంట్రాక్టర్లు టాటా, బీజీఆర్‌లకు
* రూ.2,680 కోట్ల అదనపు చెల్లింపులకు రంగం సిద్ధం
* వేల కోట్ల ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు
* యావత్ తతంగం వెనుక ప్రభుత్వాధినేత హస్తం!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్కో) చేపట్టిన రెండు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల అవినీతికి తెరలేచింది. కాంట్రాక్టర్లకు సుమారు రూ.2,680 కోట్ల అదనపు చెల్లింపులు చేసేందుకు రంగం సిద్ధమయ్యింది.
పొరుగున ఉన్న తెలంగాణ ఇదే తరహా ప్రాజెక్టుల్లో ఒక మెగావాట్ నిర్మాణానికి రూ.4.40 కోట్లు వెచ్చిస్తుంటే.. ఏపీ జెన్కో మాత్రం ఒక ప్రాజెక్టులో ఏకంగా రూ.6.30 కోట్లు వ్యయం చేయనుంది. టెండర్ల విషయంలో జాతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) అనుసరించే విధానాలను పక్కనబెట్టింది. కేవలం రెండు ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చేం దుకు వీలుగా టెండర్ నిబంధనలు పొందుపర్చింది.
బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ) పనులను.. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (ప్లాంట్‌కు సంబంధించిన మిగతా పనులు-బీవోపీ) పనుల్ని ఉద్దేశపూర్వకంగా విడగొట్టింది. బీవోపీ పనులు ప్రైవేటు సంస్థలు టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, బీజీఆర్ (బి.జి.రఘుపతి ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్) సంస్థలు దక్కించుకునేలా చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులు కూడా కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. బీవోపీ కాంట్రాక్టులకు సంబంధించి ఈ సంస్థ డమ్మీ టెండర్లు వేయడం, టాటా, బీజీఆర్‌లు ఆయా ప్రాజెక్టుల్లో ఎల్.1గా నిలవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
వేల కోట్ల ప్రజా ధనం చేతులు మారడమే ఇందుకు కారణమని, ఈ మొత్తం తతంగం వెనుక ప్రభుత్వాధినేత హస్తం ఉందని జెన్కో వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ జెన్కో కొత్తగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఒకటి, విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద మరొక థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. ఒక్కొక్కటి 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులను రెండు కాంట్రాక్టులుగా విభజించారు. టెండర్ల విషయంలో గతంలో ఎన్టీపీసీ నిబంధనలనే ఏపీ జెన్కో కూడా పాటించేది.
ఏపీ జెన్‌కోయే కాదు దాదాపు దేశంలోని అన్ని జెన్కోలూ ఈ నిబంధనలే అనుసరిస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో ఎన్టీపీసీ సైతం విధించని అర్హత నిబంధనలతో (క్యూఆర్) ఏపీ జెన్కో గత అక్టోబర్‌లో టెండర్లు పిలిచింది. ఈ నిబంధనల మేరకు బీవోపీ పనులకు టెండర్లు వేయగలిగే అర్హత టాటా, బీజీఆర్‌లకు మినహా దేశంలోని మరే ప్రైవేటు సంస్థకూ లేకపోవడం గమనార్హం. అంటే ఉద్దేశపూర్వకంగానే.. టాటా, బీజీఆర్‌లు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు వీలుగానే ఆ నిబంధనలు విధించినట్లు స్పష్టమవుతోంది.
ఈ విధమైన అర్హతలు పెట్టడంపై ఇతర సంస్థలు కొన్ని అభ్యంతరాలు చెప్పాయి. దీనివల్ల ఆరోగ్యకరమైన పోటీ కొరవడి, ప్రజాధనం దుర్వినియోగం అయ్యే వీలుందని ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి.
ముందెన్నడూ లేని అర్హత నిబంధనలు
టెండర్లో పాల్గొనే సంస్థ గడచిన పదేళ్ల కాలంలో 500 మెగావాట్ల సామర్థ్యం గల రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించి ఉండాలనేది ప్రధాన అర్హత. ఎన్టీపీసీ మార్గదర్శకాల ప్రకారం ఒక యూనిట్ నిర్మించి ఉంటే సరిపోతుంది. ఇక ఇంతకన్నా కఠినమైన నిబంధన ఏమిటంటే.. టెండర్లో పోటీ పడే సంస్థ ఇప్పటివరకు నిర్మించిన థర్మల్ ప్రాజెక్టుల్లో కనీసం ఒక ప్రాజెక్టులోనైనా రెండేళ్ల పాటు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించి ఉండాలి.
మిగతా ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు గ్రిడ్‌కు అనుసంధానించి ఉండాలి. అయితే ఒక ఏడాది వాణిజ్య కార్యకలాపాలు ఉంటే చాలనేది ఎన్టీపీసీ నిబంధన. ప్రైవేటు రంగంలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించినా చాలని ఎన్టీపీసీ చెబుతుంటే, జెన్కో మాత్రం కేంద్ర, రాష్ట ప్రభుత్వాల పరిధిలో, లేదా పబ్లిక్ రంగ సంస్థల్లో థర్మల్ ప్రాజెక్టులు నిర్మిస్తేనే టెండర్లో పాల్గొనాలని స్పష్టం చేసింది. ఈ అర్హతలు బీహెచ్ఈఎల్, టాటా, బీజీఆర్‌లకు తప్ప మరోసంస్థకు లేకపోవడం గమనార్హం.
అడ్డగోలుగా రింగ్
ఈ నేపథ్యంలో పోటీ లేకుండానే బీటీజీ కాం ట్రాక్టును రెండుచోట్లా బీహెచ్ఈఎల్ దక్కిం చుకుంది. బీవోపీ కాంట్రాక్టుల విషయంలో కృష్ణపట్నంలో టాటా, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ ఎల్.1గా నిలిచాయి. వీటిని కైవసం చేసుకునే విషయంలో ఈ మూడు కంపెనీలు రింగవ్వడం ఈ కథలో మరో ట్విస్ట్. బీటీజీ టెండర్‌ను నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్న బీహెచ్ఈఎల్, బీవోపీ కాంట్రాక్టులు చేసే అర్హత తనకున్నా అందుకోసం ప్రయత్నించలేదు.
బీహెచ్ఈఎల్లోని కొందరు ఉన్నతాధికారులు ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కు కావడమే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే బీవోపీ టెండర్లలో పాల్గొని ఉద్దేశపూర్వకంగా ఎక్కువ కోట్ చేయడం ద్వారా టాటా, బీజీఆర్‌లకు మార్గం సుగమం చేసిందని సమాచారం.
ఒక ప్రాజెక్టుకు కనీసం 3 టెండర్లు ఉండాలనే నిబంధన నేపథ్యంలో బీహెచ్ఈఎల్, టాటా, బీజీఆర్‌లు రింగ్ అయ్యాయి. ఇబ్రహీంపట్నంలో బీహెచ్ఈఎల్, టాటాలు ఎక్కువ ధర కోట్ చేసి బీజీఆర్ ఎల్.1గా నిలిచేలా చేశాయి. ఇందుకు ప్రతిగా కృష్ణపట్నంలో బీహెచ్ఈఎల్, బీజీఆర్‌లు ఎక్కువ కోట్ చేసి టాటా ఎల్.1గా నిలిచేలా చేశాయి.
మెగావాట్‌కు రూ.6.30 కోట్లా?!
టాటా, బీజీఆర్‌లు రెండు ప్రాజెక్టుల వ్యయం అనూహ్యంగా పెంచేయడం గమనార్హం. ఇబ్రహీంపట్నంలో చేపట్టే ప్రాజెక్టు వ్యయాన్ని బీజీఆర్ మెగావాట్‌కు ఏకంగా రూ.5.85 కోట్లుగా పేర్కొంది. (బీహెచ్ఈఎల్కు బీటీజీ కాంట్రాక్టు కింద మెగావాట్‌కు రూ. 2.88 కోట్లు, బీపీవో కింద బీజీఆర్‌కు మెగావాట్‌కు రూ.2.97 కోట్లు) ఇక కృష్ణపట్నంలో ఒక మెగావాట్కయ్యే ఖర్చును రూ.6.30 కోట్లుగా టాటా పేర్కొంది.
(బీహెచ్ఈఎల్కు రూ.2.88 కోట్లు, టాటాకు రూ.3.42 కోట్లు). అంటే 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9,720 కోట్ల వ్యయం అవుతుందన్నమాట. అయితే తెలంగాణ జెన్కో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఈ ఐదింటినీ ఒకే కాంట్రాక్టుగా (బీటీజీ, బీవోపీ విడగొట్టకుండా) ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కే అప్పగించారు. మొత్తం 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుల వ్యయం రూ. 17,600 కోట్లు. అంటే మెగావాట్‌కు రూ.4.40 కోట్లు మాత్రమే ఖర్చవుతోంది.
మరో రాష్ట్రం గుజరాత్లో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ ప్రాజెక్టును రూ.3,536 కోట్లతోనే చేపడుతున్నారు. అంటే మెగావాట్ రూ. 4.42 కోట్లు అవుతుంది. ఇక్కడ కూడా ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కే ఒకే కాంట్రాక్టుగా పనులు అప్పగించారు. కానీ ఏపీ జెన్కో మాత్రం మెగావాట్‌కు రూ. 5.85 కోట్లతో ఒక ప్రాజెక్టును, రూ.6.30 కోట్లతో మరొక ప్రాజెక్టును కట్టబెట్టేదుకు రంగం సిద్ధం చేసింది.
మంత్రి దేవినేని ఆరోపణలు ఏమయ్యాయి?
ప్రస్తుతం మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే బీజీఆర్ సంస్థపై నిప్పులు చెరిగారు. ఆ సంస్థ నాసిరకంగా పనులు చేస్తోందని ఆరోపించారు. అసలా సంస్థకు పనులు అప్పగించడమే సరికాదన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ అదే సంస్థకు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఎర్ర తివాచీ పరిచి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టడం గమనార్హం.
మరోవైపు ఢిల్లీకి చెందిన మౌలిక్ భారత్ అనే స్వచ్ఛంద సంస్థ బీజీఆర్ తప్పుడు అర్హతలు చూపుతోందని నేరుగా సీఎం చంద్రబాబునాయుడికే ఫిర్యాదు చేసింది. ఈ నెల 4వ తేదీన టెండర్లు ఓపెన్ చేయడానికి ముందే (నవంబర్ 17న) ముఖ్యమంత్రికి లేఖ రాసింది. జెన్కో ప్రాజెక్టు టెండర్ల ఖరారులో అవకతవకలు జరుగుతున్నాయనీ పేర్కొంది. ఈ విషయమై విచారణకు తగిన సమయం ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం విచారణ కూడా జరపకుండానే టెండర్లు కట్టబెట్టడం వెనుక వేల కోట్ల ముడుపుల మతలబు ఉందని జెన్కో వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
అదనపు పనుల వల్ల పెరిగిన వ్యయం: జెన్కో ఎండీ
కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావులేదని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ తెలిపారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతోనే పనులను బీటీజీ, బీవోపీగా విడగొట్టినట్టు చెప్పారు. తెలంగాణ జెన్కో చేపట్టే బీవోపీ పనులకన్నా, ఏపీ ప్రాజెక్టుల్లో అదనంగా అనేక పనులు చేర్చామని, అందువల్లే వ్యయం పెరుగుతోందన్నారు. కృష్ణపట్నంలో సముద్రం నీరు శుద్ధి చేసి అందించే పనికే దాదాపు రూ.500 కోట్లు అవుతుందన్నారు.
రెండు చోట్ల సిబ్బందికి అవసరమైన కాలనీని అన్ని వసతులతో కట్టించే ఒప్పందం కూడా బీవోపీలో ఉందన్నారు. ఏపీ జెన్కో విధానాలనే మరో నాలుగు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని వివరణ ఇచ్చారు. టెండర్లను ఖరారు చేయలేదని, వారితో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. జెన్కోకు నష్టం చేసే విధానాలను అనుసరించబోమన్నారు.
రూ. 2,680 కోట్ల గోల్మాల్
రెండు కంపెనీలనే ఎంచుకుని ఎక్కడా లేని విధంగా నిర్మాణ వ్యయాన్ని అనుమతించడం వెనుక భారీ కుంభకోణం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టుల్లో మెగావాట్‌కు రూ.4.40 కోట్లు చెల్లిస్తోంటే, ఏపీలో మెగావాట్‌కు అత్యధికంగా రూ.6.30 (కృష్ణపట్నం) కోట్లు చెల్లిస్తున్నారు. బీటీజీ కాంట్రాక్టు (బీహెచ్ఈఎల్) విషయం లో మెగావాట్ వ్యయం తెలంగాణతో దాదాపు సరిసమానంగా ఉన్నా బీవోపీ కాంట్రాక్టుల విషయంలో భారీ వ్యత్యాసం చోటు చేసుకోవడం గమనార్హం.
కృష్ణపట్నంలో టాటా సంస్థ మెగావాట్‌కు రూ.1.90 కోట్లు ఎక్కువ కోట్ చేయడం ద్వారా రూ.1,520 కోట్లు (రూ.1.90:800) అదనంగా దండుకుంటోంది. ఇక ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ సంస్థ మెగావాట్‌కు రూ.1.45 కోట్లు ఎక్కువ కోట్ చేసి రూ.1,160 కోట్లు (రూ.1.4:800) అదనంగా దక్కించుకోనుంది. అంటే మొత్తం రూ.2,680 కోట్లు ప్రైవేటు సంస్థలకు అదనంగా దోచిపెట్టేందుకు రంగం సిద్ధమయ్యిందన్నమాట.
విచిత్రం ఏమిటంటే బీజీఆర్ నాలుగు నెలల క్రితమే మధ్యప్రదేశ్‌లోని బరేటీ వద్ద థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టును పొందింది. అక్కడి ప్రభుత్వం ఒక్కో మెగావాట్‌కు 0.83 కోట్లు మాత్రమే ఇస్తుండటం గమనార్హం కాగా.. అదే సంస్థకు ఏపీ జెన్కో మెగావాట్‌కు రూ.2.97 కోట్ల చొప్పున ఒక్కో మెగావాట్‌కు రూ. 2.14 కోట్లు అధికంగా కట్టబెడుతోంది.