విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తాం
ట్రాన్స్‌కో సీఎండీ హామీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు హామీ ఇచ్చారు. సాంకేతిక రంగ అభివృద్ధితో శరవేగంగా మారుతున్న పరిస్థితులను తట్టుకుని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు నిలదొక్కుకోవడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు. శనివారం రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ స్టేట్ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ తొలి సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సీఎం కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర విద్యుత్ శాఖ అనతికాలంలోనే అన్ని సమస్యలను అధిగమించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల అభివృద్ధి కోసం రూ.2,450 కోట్లను ఖర్చు చేశామని, దీని వల్లే విద్యుత్ లైన్ల సమస్య తీరిందన్నారు. ఓపెన్ యాక్సెస్, సోలార్ విద్యుత్, ఆధునిక బ్యాటరీల నుంచి ప్రభుత్వ విద్యుత్ సంస్థలు పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దక్షిణ డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస్ పేర్కొన్నారు.
గత నెలలో హెచ్‌టీ వినియోగదారులు 275 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఓపెన్ యాక్సెస్ విధానంలో ప్రైవేటు నుంచి కొనుగోలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉత్తర డిస్కం సీఎండీ ఎ.గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.