సీలేరు, న్యూస్‌లైన్: రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడంలో కీలకమైన రిజర్వాయర్లు ఉగ్రరూపం దాల్చాయి. ఆరు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర- ఒడిస్సా సరిహద్దుల్లోని నాలుగు రిజర్వాయర్లు ఆదివారం పూర్తిగా నిండిపోయాయి. అవి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఎక్కడికక్కడ రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి బలిమెల రిజర్వాయర్ నీటిని విడుదల చేస్తున్నారు.
జోలాపుట్టు రిజర్వాయర్ నుంచి 5 గేట్ల ద్వారా 14,500 క్యూసెక్కుల నీటిని దిగువుకు పంపుతున్నారు. డుడుమలో మూడు గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి విడుదల చేస్తూ అక్కడ విద్యుత్ అనంతరం ఇరు రాష్ట్రాలకు నీరందించే బలిమెల జలాశయానికి నీటిని పంపిస్తున్నారు. ఒక పక్క ఉప నదులు, మరో పక్క విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుద లైన నీరు శనివారం అర్ధరాత్రి భారీగా చేరడంతో దిగువున ఉన్న సీలేరు జలాశయానికి రెండు గేట్ల ద్వారా 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ప్రమాద స్థాయిలో
సీలేరు జలాశయం : పైన ఉన్న జలాశయాలు ప్రమాదస్థాయికి చేరడంతో సీలేరు (గుంటవాడ) జలాశయం ఇన్‌ఫ్లో ఒక్కసారిగాపెరిగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై నాలుగు యూనిట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటితో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఆదివారం సాయంత్రానికి నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో 10, 11 గేట్లను రెండు అడుగుల మేరకు ఎత్తి 4వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశామని జెన్‌కో ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ.ఎల్.రమేష్‌బాబు తెలిపారు.
డొంకరాయి జలాశయం నీటి మట్టం 1337 అడుగులు కాగా, ఆదివారం మధ్యాహ్నంకు అది నిండిపోవడంతో రెండు గేట్ల ద్వారా శబరిలోకి 14500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక్కడి నుంచి విడుదలైన నీరు 30 కిలోమీటర్ల కెనాల్ ద్వారా డొంకరాయి జలాశయంలోకి చేరుతోంది. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు, ఉపనదులైన వలసగెడ్డ, పాలగెడ్డ ద్వారా ఈ నీరు విడుదల అవుతుండడంతో అక్కడ 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విడుదలైన నీటిని మోతుగూడెం జలాశయానికి పంపుతున్నారు. ప్రస్తుతం సీలేరు బేస్‌లో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రాల్లో 542 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
గిరిజన గ్రామాల్లో భయాందోళన
సీలేరు రిజర్వాయర్‌ను ఆనుకుని వున్న గిరిజన గ్రామాలన్నింటినీ అప్రమత్తం చేసినప్పటికీ అక్కడి గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు వరదనీటితో మరింత ప్రమాదం ముంచుకొస్తుందని వారు చెబుతున్నారు. మరింత నీరు విడుదల చేయడంతో తమ గ్రామాలు ముని గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
నాలుగు జలాశయాల గేట్లు ఎత్తివేత
Published Mon, Oct 28 2013 2:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement