సీలేరు, న్యూస్‌లైన్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్‌లు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న వలసగెడ్డ, పాలగెడ్డ, మంగంపాడు వంటి ఉపనదుల ద్వారా రెండు రోజులుగా వరద నీరు చేరతుండడంతో డొంకరాయి జలాశయం బుధవారం మధ్యాహ్నం 1037 అడుగులకు చేరింది. జెన్‌కో అధికారులు ఎనిమిది వేల క్యూసెక్‌ల నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం 1036.1 అడుగుల నీటి మట్టం నమోదైనట్టు ఎపీజెన్‌కో ఇన్‌చార్జి సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్‌బాబు తెలిపారు.
మరోవైపు సీలేరు రిజర్వాయర్‌లోకీ భారీగా నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1036 అడుగులు కాగా ప్రస్తుతం 1325.1 అడుగులకు చేరుకుంది. అయితే వర్షాలు కొనసాగితే మరో రెండ్రోజుల్లో ఇక్కడ కూడా గేట్లు ఎత్తేసే అవకాశాలున్నాయని జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. డొంకరాయి జలాశయం ప్రమాద స్థాయిలో ఉండడంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తికి గాను ప్రస్తుతం 0.3 మిలియన్ యూనిట్లే రోజుకు ఉత్పత్తవుతోంది. బలిమెలలో రిజర్వాయరు పూర్తిస్థాయి నీటిమట్టం 1514 అడుగులకు ప్రస్తుతం 1506.8 అడుగులకు చేరుకుంది.
జోలాపుట్టులో 2750 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి 2740.1 అడుగులుంది. ప్రస్తుతం ఈ రెండు రిజర్వాయర్లతో పాటు బలిమెలలోకి వరద నీరు చేరితే ఆంధ్రాకు నీరు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి నీరు విడుదల చేస్తే ఆగమేఘాల మీద గేట్లు ఎత్తే పరిస్థితి తలెత్తుతుంది. ప్రస్తుతం సీలేరు, డొంకరాయి ప్రమాదస్థాయిలో ఉండడంతో మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ప్రమాదస్థాయికి రిజర్వాయర్లు
Published Thu, Aug 22 2013 2:50 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement