విడిపోవడం వల్లే అభివృద్ధి సాధించాం | The development has been caused by the separation | Sakshi

విడిపోవడం వల్లే అభివృద్ధి సాధించాం

Jan 11 2016 3:50 AM | Updated on Aug 30 2019 8:24 PM

విడిపోవడం వల్లే అభివృద్ధి సాధించాం - Sakshi

విడిపోవడం వల్లే అభివృద్ధి సాధించాం

ఎంతో మంది హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నా, ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదన్న విషయాన్ని గుర్తించాలని మంత్రి కేటీఆర్ చెప్పారు.

* మంత్రి కేటీఆర్ వెల్లడి
* హైదరాబాద్‌లో రూ.760 కోట్లతో జలాశయాలు

హైదరాబాద్: ఎంతో మంది హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నా, ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదన్న విషయాన్ని గుర్తించాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరానికి రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఉండకూడదనే లక్ష్యంతో రూ.760 కోట్లతో రెండు జలాశయాల నిర్మిస్తామని, రెండువేల కోట్లతో నగర శివార్లలో విద్యుత్ ఐల్యాండ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు రాష్ట్రాలుగా వేరుపడటం వల్లే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.

ఆదివారమిక్కడి జలవిహార్‌లో ఆల్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ ముఖాముఖి కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 18 నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసిన వారు రానున్న ఎన్నికల్లో తాము మద్దతిస్తామని ముందుకొస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే నగరంలో రక్షణ ఉండదని, వివక్ష తప్పదని వచ్చిన వదంతులకు తమ పరిపాలనే నిదర్శనమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో గన్నవరంకు అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవులకు గుర్తింపు, వివిధ ఐటీ కంపెనీల రాక, అమరావతి లాంటి కొత్త నగరం రూపకల్పన వంటి అభివృద్ధి.. విడిపోవడం వల్లే జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. విడిపోకుండా ఉంటే మరో 25 సంవత్సరాలైనా అక్కడ అభివృద్ధి జరిగేదికాదు. సీఎం కేసీఆర్ పరిపాలనాపరమైన సంస్కరణలు చేపట్టినందున గూగుల్, ఆమెజాన్, ఉబెర్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులే అని, ఎవరి మాటా ఎవరు వినరని ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాల దారిద్య్రం 18 నెలల్లో పోతుందా అని ప్రశ్నించారు. సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ముందుకు సాగుతోందని అందులో భాగంగానే 25 వేల కోట్లతో 54 సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు, 11 స్కైవేల ఏర్పాటుకు త్వరలో టెండర్లను పిలుస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మంత్రి తలసాని మాట్లాడుతూ, పేదల ఆకలి తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం గొప్ప వరమన్నారు.

గంగాధర శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డిలతోపాటు అఖిల భారత క్షత్రియ సమాఖ్య అధ్యక్షుడు రాఘవరాజు, జలవిహార్ ఎండీ ఎన్.వి.రామరాజు, పూర్వ అధ్యక్షులు చినస్వామి, రాఘవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్‌ఎన్ రాజ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement