Shortage of drinking water
-
నీటి ఆవిరిని ఒడిసిపట్టేస్తుంది!
కారణాలు ఏవైనా కావొచ్చు.. ప్రస్తుతం నీటి కొరత ప్రపంచాన్ని పీడిస్తోంది. తాగునీటి కొరతను తగ్గించేందుకు నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరానికి చెందిన సన్గ్లేషియర్స్ అనే సంస్థ.. 20 అంగుళాలున్న వాటర్ క్యూబ్‌ను తయారు చేసింది. పక్కన ఫొటోలో చూపిన క్యూబ్ మీ దగ్గరుంటే చాలు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొంతు తడుపుకునేందుకు కావాల్సినన్ని నీళ్లు దొరుకుతాయి. ఇది గాలిలోని తేమను నీరుగా మారుస్తుంది. క్యూబ్‌పై ఏర్పాటు చేసిన సౌర శక్తి ఘటకాలు 40 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తే, అందులో 25 వాట్లను వాడుకుని లోపలి వైపున కనిపించే స్టీల్ శంఖు చల్లబడుతుంది. చుట్టుపక్కల నీటి ఆవిరి.. సంక్షేపణం (కన్డెన్సేషన్) అనే ప్రక్రియకు గురై బిందువులుగా మారుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కిందపడే నీటిని మనం తాగొచ్చు. ఒక్కో పరికరంతో ఎంత మోతాదులో నీరు ఉత్పత్తి చేయవచ్చన్నది గాలిలో ఉండే తేమ శాతంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ విద్యుత్తుతో రిఫ్రిజిరేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం దీని ప్రత్యేకతని వాటర్ క్యూబ్‌ను రూపొందించిన ఆప్వెర్ హెగ్గెన్ అంటున్నారు. -
కరువు ప్రాంతాల్లో తాగునీటికి రూ.179 కోట్లు
గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య విభాగం ప్రతిపాదనలు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరువు పరి స్థితులు నెలకొన్న ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యల నిమిత్తం రూ.179 కోట్లు అవసరమని ప్రకృతి వైపరీత్యాల విభాగం సర్కారుకు నివేదించింది. పల్లెల్లో పరిస్థితులపై గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్), పట్టణ ప్రాంతాల్లో ఎద్దడి పరిస్థితులపై ప్రజారోగ్య విభాగం, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఇచ్చిన అంచనాల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తాజాగా నివేదికను సిద్ధం చేశారు. దాన్ని పరిశీలించి నిధులను విడుదల చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రకృతి వైపరీత్యాల విభాగం సిఫారసు చేసింది. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం అవసరమైన చోట్ల కొత్త బోర్లను వేయాలని, పనిచేయని స్థితిలో ఉన్న వాటిని మరమ్మతులు చేయించాలంది. గ్రామీణ ప్రాంతాల్లో బావులను కొత్తగా తవ్వించడం, పాతవాటిని లోతు చేయాలంది. ఆయా బావు లకు పవర్ పంపులను అమర్చాలంది. గ్రామాల్లోని చెరువులను కాల్వల ద్వారా వచ్చే నీటితో నింపాలంది.గత్యంతరం లేని స్థితిలోనే అద్దె పద్ధతిన ప్రైవేటు వ్యక్తులకు చెందిన వ్యవసాయ బావుల నుంచి నీటి సరఫరా చేయాలంది. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయాలు లేని పక్షంలోనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని పేర్కొంది. కరువు మండలాలపై కేంద్రం శీతకన్ను రాష్ట్రంలోని 231 మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సాయం కోరినా ఆశించిన మేరకు సాయం అందలేదు. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.486.16 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, కేంద్రం రూ.88.5 కోట్లు ఇచ్చింది. రూ.310.61 కోట్లు కావాలని ప్రతిపాదనలిచ్చిన గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ.72.86 కోట్లు, రూ.86.25 కోట్లు అడిగిన ప్రజారోగ్యశాఖకు రూ.9.21 కోట్లు, రూ.83.30 కోట్లను కోరిన హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్‌కు రూ.6.43 కోట్లు ఇచ్చేందుకే కేంద్రం ఆమోదం తెలిపింది. కరువు మండలాల్లో ప్రస్తుతం నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు తక్షణం రూ.179.04 కోట్లు విడుదల చేయాలని ఆయా విభాగాలు కోరాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేయగా, మిగిలిన మొత్తం విడుదలకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. -
విడిపోవడం వల్లే అభివృద్ధి సాధించాం
* మంత్రి కేటీఆర్ వెల్లడి * హైదరాబాద్‌లో రూ.760 కోట్లతో జలాశయాలు హైదరాబాద్: ఎంతో మంది హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నా, ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదన్న విషయాన్ని గుర్తించాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరానికి రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఉండకూడదనే లక్ష్యంతో రూ.760 కోట్లతో రెండు జలాశయాల నిర్మిస్తామని, రెండువేల కోట్లతో నగర శివార్లలో విద్యుత్ ఐల్యాండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు రాష్ట్రాలుగా వేరుపడటం వల్లే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆదివారమిక్కడి జలవిహార్‌లో ఆల్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ ముఖాముఖి కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 18 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసిన వారు రానున్న ఎన్నికల్లో తాము మద్దతిస్తామని ముందుకొస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే నగరంలో రక్షణ ఉండదని, వివక్ష తప్పదని వచ్చిన వదంతులకు తమ పరిపాలనే నిదర్శనమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో గన్నవరంకు అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవులకు గుర్తింపు, వివిధ ఐటీ కంపెనీల రాక, అమరావతి లాంటి కొత్త నగరం రూపకల్పన వంటి అభివృద్ధి.. విడిపోవడం వల్లే జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. విడిపోకుండా ఉంటే మరో 25 సంవత్సరాలైనా అక్కడ అభివృద్ధి జరిగేదికాదు. సీఎం కేసీఆర్ పరిపాలనాపరమైన సంస్కరణలు చేపట్టినందున గూగుల్, ఆమెజాన్, ఉబెర్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులే అని, ఎవరి మాటా ఎవరు వినరని ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాల దారిద్య్రం 18 నెలల్లో పోతుందా అని ప్రశ్నించారు. సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ముందుకు సాగుతోందని అందులో భాగంగానే 25 వేల కోట్లతో 54 సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు, 11 స్కైవేల ఏర్పాటుకు త్వరలో టెండర్లను పిలుస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మంత్రి తలసాని మాట్లాడుతూ, పేదల ఆకలి తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం గొప్ప వరమన్నారు. గంగాధర శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డిలతోపాటు అఖిల భారత క్షత్రియ సమాఖ్య అధ్యక్షుడు రాఘవరాజు, జలవిహార్ ఎండీ ఎన్.వి.రామరాజు, పూర్వ అధ్యక్షులు చినస్వామి, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్ఎన్ రాజ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. -
ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
అట్లూరు (విశాఖపట్నం) : అధికారులు మంచి నీటి సౌకర్యం కల్పించకపోవడంతో 100 మంది మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన గురువారం విశాఖ జిల్లా అట్లూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో తాగునీటి నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో మహిళలు అధికారులకు విన్నవించుకున్నారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీవోను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. అక్కడ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకొని ఖాళీ బిందెలతో బైఠాయించారు. వెంటనే తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. -
ప్రతి ఇంటికీ పంపు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో తాగునీటి కొరతను తీర్చడానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం భారీ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్ గ్రిడ్ పథకాన్ని జిల్లాలోని అన్ని మండలాలకు అనుసంధానం చేస్తూ నిరంతరం నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల పనితీరు, వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనుల రూపకల్పన తీరు గురించి జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) జగన్మోహన్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. వచ్చే నాలుగేళ్లలో జిల్లాలోని ప్రతి ఇంటికి పంపు కనెక్షన్ ఇవ్వడంతోపాటు స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్‌లు నిర్మించాలని సంకల్పించామన్నారు. 38 మండలాల ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్ నిర్మిస్తున్నామని, దీనికి రూ.2,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రజల తాగు అవసరాలకు సరిపడా నీరందించే అవకాశం ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి అనువైనదిగా ఎంచుకున్నామని, అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిరంతరం నీరు అందుబాటులో ఉంటున్నందున అక్కడ వాటర్‌గ్రిడ్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే అశ్వాపురం వద్ద గల రధం గుట్ట నుంచి గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. ఇక్కడ నిర్మించే వాటర్‌గ్రిడ్ ద్వారా 20 మండలాల్లోని 400 గ్రామాలు, మరికొన్ని శివారు గ్రామాలకు నిరంతరం నీరు సరఫరా అవుతుందని తెలిపారు. గోదావరి నది నుంచి సంవత్సరానికి 3.2 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించేలా డిజైన్ చేసినట్లు వివరించారు. నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్‌గ్రిడ్ నిర్మించే ప్రాంతం నుంచి వినియోగదారుడి ఇంటి వరకు ప్రత్యేక పైపులైన్లను నిర్మిస్తామని చెప్పారు. జిల్లాలో తాగునీటి అవసరాలకు రూ.2,600 కోట్లు అవసరమని, వీటిని ప్రభుత్వం దశలవారీగా మంజూరు చేసే అవకాశం ఉందని అన్నారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనుల సర్వేకు ప్రభుత్వం త్వరలో టెండర్లు ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు. మెయిన్ గ్రిడ్, సెకండరీ గ్రిడ్, అలాగే మూడు మండలాలకు కలిపి ఒక హెడ్ వర్క్‌ను నిర్మించాలని, ఈ సర్వే ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు. జిల్లాలోని 3,167 గ్రామాలలో ఇప్పటి వరకు 1885 గ్రామాలకు నిరంతరం, 1282 గ్రామాలకు పాక్షికంగా నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. వచ్చే జనవరి నాటికి ముదిగొండ మండలం ముత్తారం చెరువు వద్ద ఉన్న గుట్ట వద్ద హెడ్‌వర్క్స్‌ను నిర్మించి, అక్కడినుంచి వాటర్‌గ్రిడ్ నియమావళి ప్రకారం ప్రతి మనిషికి 100 లీటర్లు మంచినీటిని సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. దీని ద్వారా 11 గ్రామాలకు నిరంతరం తాగునీటి సౌకర్యం కలుగుతుందని, ప్రస్తుతం ఉన్న సీపీడబ్ల్యూ స్కీమ్‌ను వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశామని చెప్పారు. అశ్వాపురం- దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరిపై సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన ఆనకట్ట వద్ద నుంచి నీటిని మోటార్ల ద్వారా తోడి అక్కడే శుద్ధిచేసి జిల్లాలోని 26 మండలాలకు తాగునీటిని అందించనున్నామన్నారు. జిల్లాలో 580 కిలోమీటర్ల పొడవున ప్రధాన పైపులైన్, అక్కడి నుంచి గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు 4,431 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ నిర్మించాల్సి ఉంటుందని వివరించారు. జిల్లాలో పలు జలాశయాలు, చెరువుల్లో నీటిని నింపి అక్కడ నుంచి నిరంతరం తాగునీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, దీని కోసం 11 ఉపగ్రిడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా ప్రజలకు ప్రతి ఏడాది తాగునీటి కోసం 8 టీఎంసీల నీరు అవసరమన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ప్రజలకు కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి ఇప్పుడున్న పథకాల ద్వారానే తాగునీరు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు పాలేరు రిజర్వాయర్ నుంచి తాగునీరు అందిస్తామని, ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేందుకు ఈ వాటర్‌గ్రిడ్ ఉపయోగపవడుతుందని అన్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను అధిగమిస్తాం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలన్నింటిని అధిగమిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి చెప్పారు. మంగళవారం ఆమె మాట్లాడారు. ఒక్కో వసతి గృహంలో వంద మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నామని, అయితే ఎస్సీ విద్యార్థులు ఎంతమంది వచ్చినా, ఆయా వసతి గృహాల్లోని సంఖ్యను బట్టి వారికి ప్రవేశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా సొంత భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఆయా వసతి గృహాల్లో తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆమె వివరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంత మంది కొత్త విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు? డీడీ: ప్రతి హాస్టల్లో వంద మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. అయితే ఎస్సీ విద్యార్థులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చినా చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు బెడ్షీట్లు, పుస్తకాలు వగైరా వచ్చాయా? డీడీ: జిల్లాలోని 102 హైస్కూల్ స్థాయి వసతి గృహాల్లోని విద్యార్థుల్లో ఒక్కొక్కరికి ఒక బెడ్‌షీట్, ఒక కార్పెట్ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేసింది. వీటన్నింటిని ఇప్పటికే అన్ని వసతి గృహాలకు పంపాం. ఇక నోటు పుస్తకాలు త్వరలోనే రానున్నాయి. విద్యార్థులకు ఎన్ని జతల దుస్తులు ఇస్తున్నారు? డీడీ: ప్రతి విద్యార్థికి నాలుగు జతల దుస్తులను ఇవ్వనున్నాం. ఇందుకు అవసరమైన క్లాత్ వచ్చింది. ముందస్తుగా జూలైలో ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులు ఇచ్చేందుకు ప్లాన్ చేశాం. అనేక వసతి గృహాల్లో ఉన్న తాగునీటి కొరతను ఎలా నివారిస్తారు? డీడీ: స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. అలాగే 150 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో మినీ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాల పరిస్థితి ఏమిటి? డీడీ: సొంత భవనాల్లో కొనసాగుతున్న 38 హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే రూ.3.68 కోట్లు మంజూరయ్యాయి. ఆయా వసతి గృహాల్లో ఇప్పటికే పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. అనేక వసతి గృహాల్లో బాత్రూములు, టాయ్లెట్ల సౌకర్యం వేధిస్తోంది కదా? డీడీ: బాత్రూములు, టాయ్లెట్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని 25 వసతి గృహాల్లో రూ.1 కోటితో 130 టాయ్లెట్లు, 131 బాత్రూములు నిర్మిస్తున్నాం. కళాశాల విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయి? డీడీ: కళాశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల కోసం కర్నూలులో రెండు, నంద్యాలలో రెండు వసతి గృహాలను నిర్మిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నందికొట్కూరులో రెండు, ఎమ్మిగనూరులో రెండు వసతి గృహాలు అదనంగా మంజూరయ్యాయి. ఒక్కో వసతి గృహాన్ని రూ.2.50 కోట్లతో నిర్మించనున్నాం. హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు? డీడీ: అన్ని వసతి గృహాలకు చెందిన హెచ్‌డబ్ల్యుఓలు స్థానికంగా ఉండి విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇటీవలే ఏజేసీ ఆదేశాలు జారీ చేశారు. మెనూ ప్రకారం భోజన వసతులు కల్పించాలి. అలాగే ప్రతి నెలా విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై సమీపంలోని మెడికల్ ఆఫీసర్‌చే పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాం.