సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో తాగునీటి కొరతను తీర్చడానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం భారీ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్ గ్రిడ్ పథకాన్ని జిల్లాలోని అన్ని మండలాలకు అనుసంధానం చేస్తూ నిరంతరం నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల పనితీరు, వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనుల రూపకల్పన తీరు గురించి జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) జగన్‌మోహన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు.
వచ్చే నాలుగేళ్లలో జిల్లాలోని ప్రతి ఇంటికి పంపు కనెక్షన్ ఇవ్వడంతోపాటు స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్‌లు నిర్మించాలని సంకల్పించామన్నారు. 38 మండలాల ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్ నిర్మిస్తున్నామని, దీనికి రూ.2,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
ప్రజల తాగు అవసరాలకు సరిపడా నీరందించే అవకాశం ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి అనువైనదిగా ఎంచుకున్నామని, అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిరంతరం నీరు అందుబాటులో ఉంటున్నందున అక్కడ వాటర్‌గ్రిడ్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే అశ్వాపురం వద్ద గల రధం గుట్ట నుంచి గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. ఇక్కడ నిర్మించే వాటర్‌గ్రిడ్ ద్వారా 20 మండలాల్లోని 400 గ్రామాలు, మరికొన్ని శివారు గ్రామాలకు నిరంతరం నీరు సరఫరా అవుతుందని తెలిపారు. గోదావరి నది నుంచి సంవత్సరానికి 3.2 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించేలా డిజైన్ చేసినట్లు వివరించారు.
నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్‌గ్రిడ్ నిర్మించే ప్రాంతం నుంచి వినియోగదారుడి ఇంటి వరకు ప్రత్యేక పైపులైన్లను నిర్మిస్తామని చెప్పారు. జిల్లాలో తాగునీటి అవసరాలకు రూ.2,600 కోట్లు అవసరమని, వీటిని ప్రభుత్వం దశలవారీగా మంజూరు చేసే అవకాశం ఉందని అన్నారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనుల సర్వేకు ప్రభుత్వం త్వరలో టెండర్లు ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు. మెయిన్ గ్రిడ్, సెకండరీ గ్రిడ్, అలాగే మూడు మండలాలకు కలిపి ఒక హెడ్ వర్క్‌ను నిర్మించాలని, ఈ సర్వే ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు.
జిల్లాలోని 3,167 గ్రామాలలో ఇప్పటి వరకు 1885 గ్రామాలకు నిరంతరం, 1282 గ్రామాలకు పాక్షికంగా నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. వచ్చే జనవరి నాటికి ముదిగొండ మండలం ముత్తారం చెరువు వద్ద ఉన్న గుట్ట వద్ద హెడ్‌వర్క్స్‌ను నిర్మించి, అక్కడినుంచి వాటర్‌గ్రిడ్ నియమావళి ప్రకారం ప్రతి మనిషికి 100 లీటర్లు మంచినీటిని సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. దీని ద్వారా 11 గ్రామాలకు నిరంతరం తాగునీటి సౌకర్యం కలుగుతుందని, ప్రస్తుతం ఉన్న సీపీడబ్ల్యూ స్కీమ్‌ను వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశామని చెప్పారు.
అశ్వాపురం- దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరిపై సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన ఆనకట్ట వద్ద నుంచి నీటిని మోటార్ల ద్వారా తోడి అక్కడే శుద్ధిచేసి జిల్లాలోని 26 మండలాలకు తాగునీటిని అందించనున్నామన్నారు. జిల్లాలో 580 కిలోమీటర్ల పొడవున ప్రధాన పైపులైన్, అక్కడి నుంచి గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు 4,431 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ నిర్మించాల్సి ఉంటుందని వివరించారు. జిల్లాలో పలు జలాశయాలు, చెరువుల్లో నీటిని నింపి అక్కడ నుంచి నిరంతరం తాగునీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, దీని కోసం 11 ఉపగ్రిడ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
జిల్లా ప్రజలకు ప్రతి ఏడాది తాగునీటి కోసం 8 టీఎంసీల నీరు అవసరమన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ప్రజలకు కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి ఇప్పుడున్న పథకాల ద్వారానే తాగునీరు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు పాలేరు రిజర్వాయర్ నుంచి తాగునీరు అందిస్తామని, ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేందుకు ఈ వాటర్‌గ్రిడ్ ఉపయోగపవడుతుందని అన్నారు.
ప్రతి ఇంటికీ పంపు
Published Sat, Nov 15 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement