సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను అధిగమిస్తాం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలన్నింటిని అధిగమిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి చెప్పారు. మంగళవారం ఆమె మాట్లాడారు. ఒక్కో వసతి గృహంలో వంద మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నామని, అయితే ఎస్‌సీ విద్యార్థులు ఎంతమంది వచ్చినా, ఆయా వసతి గృహాల్లోని సంఖ్యను బట్టి వారికి ప్రవేశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా సొంత భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఆయా వసతి గృహాల్లో తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆమె వివరించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంత మంది కొత్త విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు?
డీడీ: ప్రతి హాస్టల్‌లో వంద మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. అయితే ఎస్‌సీ విద్యార్థులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చినా చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
విద్యార్థులకు బెడ్‌షీట్లు, పుస్తకాలు వగైరా వచ్చాయా?
డీడీ: జిల్లాలోని 102 హైస్కూల్ స్థాయి వసతి గృహాల్లోని విద్యార్థుల్లో ఒక్కొక్కరికి ఒక బెడ్‌షీట్, ఒక కార్పెట్ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేసింది. వీటన్నింటిని ఇప్పటికే అన్ని వసతి గృహాలకు పంపాం. ఇక నోటు పుస్తకాలు త్వరలోనే రానున్నాయి.
విద్యార్థులకు ఎన్ని జతల దుస్తులు ఇస్తున్నారు?
డీడీ: ప్రతి విద్యార్థికి నాలుగు జతల దుస్తులను ఇవ్వనున్నాం. ఇందుకు అవసరమైన క్లాత్ వచ్చింది. ముందస్తుగా జూలైలో ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులు ఇచ్చేందుకు ప్లాన్ చేశాం.
అనేక వసతి గృహాల్లో ఉన్న తాగునీటి కొరతను ఎలా నివారిస్తారు?
డీడీ: స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. అలాగే 150 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో మినీ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.
శిథిలావస్థలో ఉన్న వసతి గృహాల పరిస్థితి ఏమిటి?
డీడీ: సొంత భవనాల్లో కొనసాగుతున్న 38 హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే రూ.3.68 కోట్లు మంజూరయ్యాయి. ఆయా వసతి గృహాల్లో ఇప్పటికే పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయి.
అనేక వసతి గృహాల్లో బాత్‌రూములు, టాయ్‌లెట్ల సౌకర్యం వేధిస్తోంది కదా?
డీడీ: బాత్‌రూములు, టాయ్‌లెట్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని 25 వసతి గృహాల్లో రూ.1 కోటితో 130 టాయ్‌లెట్లు, 131 బాత్‌రూములు నిర్మిస్తున్నాం.
కళాశాల విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయి?
డీడీ: కళాశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల కోసం కర్నూలులో రెండు, నంద్యాలలో రెండు వసతి గృహాలను నిర్మిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నందికొట్కూరులో రెండు, ఎమ్మిగనూరులో రెండు వసతి గృహాలు అదనంగా మంజూరయ్యాయి. ఒక్కో వసతి గృహాన్ని రూ.2.50 కోట్లతో నిర్మించనున్నాం.
హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు?
డీడీ: అన్ని వసతి గృహాలకు చెందిన హెచ్‌డబ్ల్యుఓలు స్థానికంగా ఉండి విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇటీవలే ఏజేసీ ఆదేశాలు జారీ చేశారు. మెనూ ప్రకారం భోజన వసతులు కల్పించాలి. అలాగే ప్రతి నెలా విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై సమీపంలోని మెడికల్ ఆఫీసర్‌చే పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాం.