నిర్లక్ష్యం మేట | Dune ignored | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం మేట

Published Sat, Sep 6 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

నిర్లక్ష్యం మేట

నిర్లక్ష్యం మేట

  • గట్లు, కరకట్టల నిర్మాణాలకునిధులివ్వని ప్రభుత్వం
  •  రూ.100 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు
  •  వణుకుతున్న నది పరివాహక ప్రాంతీయులు
  • నిధుల మంజూరులో సర్కారు నిర్లక్ష్యం వల్ల ఏటిగట్లు మరమ్మతులకు నోచుకోవడంలేదు. వరదల కారణంగా గండ్లు పడిన  కాలువ గట్లను పట్టించుకోకపోవడంతో నది పరివాహక ప్రాంత జనం భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఆలస్యంగానైనా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నా.. అతివృష్టి పంటలను ముంచుతుందన్న భయం అన్నదాతలను పట్టి పీడిస్తోంది.
     
    విశాఖ రూరల్ : గత ఏడాది తుపాన్లు, అల్పపీడనం కారణంగా వచ్చిన వరదలకు జిల్లాలో రిజర్వాయర్లు దెబ్బతిన్నాయి. చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. భవిష్యత్తులో వరదలు వచ్చినా ముంపు భయం లేకుండా ఉండేందుకు కాలువలు, గట్లు, కరకట్టల నిర్మాణాలకు అధికారులు  రూ.114 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శారదనది గట్లు పలుచోట్ల బలహీనపడ్డాయి. జలాశయాలన్నీ నీటితో నిండి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నది పరివాహక ప్రాంతాల వారు వణికిపోతున్నారు.
     
    భూ సేకరణకు నిధులు లేవు : గట్ల నిర్మాణం కోసం అధికారులు భూములను సేకరించాలని నిర్ణయించారు. శారదా, వరాహ, తాండవ నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రైవేటు భూములు ఉన్నాయి. ఈ స్థలాల్లో కొంతమంది సరుగుడు, ఇతర తోటలు వేశారు. వర్షాల సమయంలో నదుల నుంచి వరద నీరు పొంగిన సందర్భంలో ఈ తోటల కారణంగా నీరు పాయలుగా విడిపోయి గ్రామాల్లోకి చేరుతోంది. వరద నీరు పోటెత్తుతుండడంతో మట్టి గట్లకు గండ్లు పడుతున్నాయి.

    ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో గట్లు పటిష్టంగా నిర్మించాలని నిర్ణయించారు. అలాగే కొట్టుకుపోతున్న ప్రాంతాల్లో పెద్ద గట్లు నిర్మించేందుకు సమీపంలో ఉన్న ప్రైవేటు స్థలాలు మొత్తం 645 ఎకరాల్లో భూ సేకరణ చేపట్టాలని గుర్తించారు. ఇందుకు రూ.14 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. అయితే భూ సేకరణకు నిధులు లేవని కేవలం మరమ్మతుల కోసం ప్రణాళిక రూపొందించి పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
     
    ప్రతిపాదనలు బుట్టదాఖలు
     
    గట్లు, కరకట్టల నిర్మాణాలకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి గతేడాది ప్రభుత్వానికి పంపించారు. వీటి నిర్మాణాలకు సుమారు రూ.114 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే అంచనాలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించడంతో భూసేకరణకు ప్రతిపాదించిన రూ.14 కోట్లు మినహా రూ.100 కోట్లతో కొత్త ప్రతిపాదనలను గతేడాదే పంపించారు.

    శారదా, తాండవ, వరాహ రిజర్వాయర్లకు సంబంధించి రూ.26 కోట్లు మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ఈ ప్రతిపాదనలకు కదలిక వస్తుందని అధికారులు భావించినప్పటికీ అసలు ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. గత వరదల సమయంలో పొలాల్లో వేసిన ఇసుక మేటలు ఇప్పటికీ తీయలేదు.

    ప్రస్తుతం జిల్లాలో నదీ, జలాశయాల కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో రెండువైపులా ఎత్తుగా గట్లు నిర్మించాల్సిన అవసరముంది. శాశ్వత ప్రాతిపదికన కాంక్రీట్‌తో కాలువలను నిర్మించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరద నష్టాన్ని తగ్గించి గ్రామాలు, పొలాల్లోకి వరద నీరు చేరకుండా ఉండాలంటే తప్పకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement