పొంచి ఉన్న ముప్పు
- రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం
- ఎండిపోతున్న 11 జలాశయాలు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో గత ఐదేళ్లలో లేనంత కరువు ఛాయలు నెలకొన్నాయి. వాన నీటితో తొణికిసలాడాల్సిన జలాశయాలన్నీ నీటి బొట్టు కోసం ఆకాశం వైపు చూస్తున్నాయి. గత ఏడాది కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా అంతకు ముందు ఏడాది కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయాల్లో కొంత వరకు నీరు ఉండేది.
దీంతో వ్యవసాయం, జల విద్యుత్, తాగునీటి అవసరాలకు చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏర్పడలేదు. అయితే ఈసారి రాష్ట్రంలోని 13 ప్రముఖ జలాశయాల్లో వరాహి, కబిని డ్యాంల్లో మాత్రం గత ఏడాది ఇదే సమయానికి పోలిస్తే దాదాపు 5 శాతం నీటి నిల్వ ఎక్కువగా ఉంది. మిగిలిన 11 జలాశయాల్లో గత ఏడాది కంటే తక్కువ నీటి పరిమాణం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
లింగనమక్కి, సూపా, వరాహి, హారంగి, హేమావతి, కేఆర్‌ఎస్, భద్రా, తుంగభద్రా, ఘటప్రభా, మలప్రభా, ఆల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామార్థ్యం 860.29 టీఎంసీలు కాగా ఇప్పటి వరకూ కేవలం 447 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గత ఏడాది ఇదే సమాయానికి వీటన్నింటిలో కలిపి 596.82 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అంటే గత ఏడాది కంటే దాదాపు 150 టీఎంసీల నీరు తక్కువగా ఉంది.
రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షం పడక పోవడంతో జలాశయాల్లోకి నీరు చేరడం లేదు. ప రిస్థితి ఇలాగే కొనసాగితే సా గుకు కాదుకదా కనీసం తా గునీటి కూడా కటాకటా అనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర నీటిపారుదాల శాఖ గణాంకాల ప్రకారం సాధారణం కంటే లింగనమక్కి జలాశయంలో 92 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. అదేవిధంగా సూపా-85 టీఎంసీలు, వరాహి-16 టీఎంసీ, హారంగి-1 టీఎంసీ, హేమావతి-8 టీఎంసీలు, కబిని-1 టీఎంసీ, తుంగభద్రా-37 టీఎంసీ, ఘటప్రభా-34, మలప్రభా-27, ఆల్మట్టి-61 టీఎంసీ, నారాయణపుర-7 టీఎంసీల నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.