‘ఇందిరమ్మ కాలనీలో కొండచరియలు విరిగిపడి ఇబ్బంది పడుతుంటే ఇంతవరకూ సహాయక చర్యల్లేవు. గతేడాది నీలం తుపాను నష్టపరిహారం నేటికీ ఇవ్వలేదు.
సాక్షి, విశాఖపట్నం : ‘ఇందిరమ్మ కాలనీలో కొండచరియలు విరిగిపడి ఇబ్బంది పడుతుంటే ఇంతవరకూ సహాయక చర్యల్లేవు. గతేడాది నీలం తుపాను నష్టపరిహారం నేటికీ ఇవ్వలేదు. అరకొర సాయం వద్దు.’ అంటూ ఆగకుండా వెళ్లిపోతున్న కాన్వాయ్‌ను అడ్డగించి హరిపాలెం గ్రామస్తులు కేంద్రమంత్రి చిరంజీవి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంట పొలాలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. ‘శారదా నదికి ప్రతిసారీ గండ్లు పడి వరదనీరు పంట పొలాల్లోకి వచ్చేస్తోంది. నాలుగేళ్లుగా ఇదే సమస్య. వరద ముంచెత్తినప్పుడల్లా సమస్య పరిష్కారమిస్తామని మాటలే చెబుతున్నారు కానీ పరిష్కారం చేయడం లేదు. చేతికొచ్చే పంట పోతోంది.’ అంటూ రాంబిల్లి మండలం రాజకొడూరు రైతులు చిరంజీవికి గోడు వెళ్లబోసుకున్నారు.
విశాఖ జిల్లా వరద ప్రాంతాల పర్యటనలో కేంద్ర పర్యాటక శాఖామంత్రి చిరంజీవికి ఒకచోట అడ్డగింత, మరోచోట నిలదీత ఎదురైంది. బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్న చిరంజీవి న్యాయం చేస్తానని హామీ ఇస్తూ ముందుకు వెళ్లారు. సోమవారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అనకాపల్లిలో ఉన్న మంత్రి గంటా క్యాంప్ కార్యాలయంకు చేరుకున్నారు. అక్కడి విలేకర్ల సమావేశంలో మాట్లాడి మునగపాక మండలం మీదుగా అచ్యుతాపురంలోకి ప్రవేశించారు. హరిపాలెం పెద్ద మదుము వద్ద రైతులు వేచి ఉన్నా ఆపకుండా వెళ్లిపోతుండటంతో సర్పంచ్ కాండ్రేగుల సూర్యనారాయణ ఆధ్వర్యంలో రైతులు ఆయన వాహనాన్ని అడ్డుకుని తమ సమస్యలను మొరపెట్టుకున్నారు.
అనంతరం హరిపాలెం శివారులో ఏర్పాటు చేసిన పది కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అక్కడ రైతులనుద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి రాంబిల్లి మండలం రాజకోడూరులో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పలువురు రైతులు ముంపు కారణాలను వివరించారు. ఏటా నష్టపోతున్నా పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కారం చేయడం లేదని, మాటలు తప్ప చేతలు ఉండటం లేదని పలువురు వాపోయారు.
అక్కడ నుంచి నక్కపల్లి మండలం గొడిచర్ల సమీపంలో కుళ్లిన వరి మడులను పరిశీలించారు. అక్కడే సినీ బంగిమలో పొలం గట్టుపై నుంచి జంప్ చేశారు. తన పర్యటనలో వరద బాధితుల గోడు విన్న చిరంజీవి సహాయక చర్యలపై మంత్రి గంటా శ్రీనివాసరావుకు, ఇటు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్య రాజ్‌లకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ద్రోణంరాజు శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.