‘మెట్రో వాటర్’పై చిన్నచూపు | 'Metro vatarpai underestimate | Sakshi
Sakshi News home page

‘మెట్రో వాటర్’పై చిన్నచూపు

Published Thu, Jul 24 2014 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

‘మెట్రో వాటర్’పై చిన్నచూపు

‘మెట్రో వాటర్’పై చిన్నచూపు

  •       సొంత బ్రాండ్‌పై జలమండలి శీతకన్ను
  •      రోజుకు 50 క్యాన్ల ఫిల్టర్‌కే పరిమితం
  •      ఐదేళ్లుగా ప్రేక్షకపాత్రలో వాటర్‌బోర్డు
  •      నెలకు రూ.25 కోట్లు ఆర్జించే అవకాశం
  •      అయినా పట్టించుకోని అధికారులు
  • సాక్షి, సిటీబ్యూరో: జలమండలి సొంత బ్రాండ్‌పై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ‘మెట్రో వాటర్’ పేరిట శుద్ధి నీటిని నగరంలోని అన్ని సర్కార్ కార్యాలయాలకు సరఫరా చేయడంలో విఫలమైంది. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్ వద్ద ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫిల్టర్ ప్లాంటు(నీటి శుద్ధి కేంద్రం)లో రోజుకు 50 క్యాన్ల (20 లీటర్లవి) శుద్ధికే పరిమితం కావడం బోర్డు డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది.
     
    పేరుకే మెట్రో వాటర్..

     
    నల్లాల ద్వారా వచ్చే నీటి నాణ్యతపై నమ్మకం లేక లక్షలాదిమంది వినియోగదారులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల యజమానులు ఫిల్టర్ నీటి వినియోగానికే మొగ్గు చూపుతున్నారు.  నీటిలో మలినాలను, కాఠిన్యతను తగ్గించే ఫిల్టర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇలాంటి నగరంలో వెయ్యికి పైనే ఉన్నాయి. వీటి వ్యాపారం నెలకు రూ.100 కోట్లకు పైమాటే . ఈ నేపథ్యంలో సొంతంగా ‘మెట్రోవాటర్’ అన్న పేరుతో ఫిల్టర్ నీటిని తయారు చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని జలమండలి భావించింది.

    ఈ క్రమంలో ఐదేళ్లక్రితం మెట్రోవాటర్ పేరుతో గండిపేట్, హిమాయత్‌సాగర్ జలాశయాల నీటిని శుద్ధి చేసే ఆసిఫ్‌నగర్ ఫిల్టర్‌బెడ్స్ వద్ద ఓ ఫిల్టర్ ప్లాంటును ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటుకు రోజువారీగా సుమారు పదివేల లీటర్ల నీటిని శుద్ధిచేసే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుతం రోజువారీగా వెయ్యి లీటర్లను మాత్రమే ఇక్కడ శుద్ధిచేస్తున్నారు. ఈ నీటిని 20 లీటర్ల సామర్థ్యంగల 50 ప్లాస్టిక్ క్యాన్లలో నింపి కేవలం ఖైరతాబాద్, గోషామహల్, ఎస్‌ఆర్ నగర్‌లోని జలమండలి కార్యాలయాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు.

    ఈ ప్లాంటును సైతం సొంతంగా నిర్వహించలేకపోయింది. ఆ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడం బోర్డు నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. సుమారు ఐదు వేల కార్మికులు పనిచేస్తున్న బోర్డుకు ఫిల్టర్‌ప్లాంటును సొంతంగా నిర్వహించే సత్తా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
     
    మెట్రోవాటర్ బ్రాండ్ ఇమేజ్ పెంచొచ్చు ఇలా..
     
    గ్రేటర్ పరిధిలో జలమండలి సరఫరా చేస్తోన్న 300 మిలియన్ గ్యాలన్ల నీటిలో 40 శాతం మేర సరఫరా నష్టాలుంటున్నాయి. అంటే రోజుకు 120 మిలియన్ గ్యాలన్ల నీరు వృథాగా పోతోంది.
     
    నీటి వృథాను అరికట్టడంతోపాటు సొంతంగా ఫిల్టర్‌ప్లాంట్లను నిర్వహించి విక్రయిస్తే జలమండలి లాభా లు తథ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
     
    ఇప్పటికిప్పుడు ఫిల్టర్‌నీటి వ్యాపారంలో దూసుకెళ్లకపోయినా నెలకు రూ.25 కోట్ల వరకు ఫిల్టర్ నీటిని విక్రయించి సొమ్ముచేసుకునే అవకాశం వాటర్ బోర్డుకు ఉంది.
     
    నగరంలో 56 స్టోరేజీ రిజర్వాయర్లు, పొరుగు జిల్లాల్లోని పలు జలాశయాల నీటిని నగరానికి తరలిస్తున్న మార్గాల్లో 22 ఫిల్టర్‌బెడ్స్ ఉన్నాయి. వీటి వద్దే ఫిల్టర్ నీటి ప్లాంట్లను ఏర్పాటు చేస్తే నీటి కొరత తలెత్తదు.
     
    గ్రేటర్ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు సుమారు 200కు పైగానే ఉన్నాయి. కనీసం వీటికైనా మెట్రోవాటర్‌ను సరఫరా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement