ఫ్యాషన్ సామ్రాజ్యం ‘మ్యాంగో’ వ్యవస్థాపకుడు, అధినేత ఇసాక్ ఆండిక్ కన్నుమూశారు. శనివారం ఆయన పర్వత ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆండిక్ వయసు 71 ఏళ్లు. బార్సిలోనా సమీపంలోని మోంట్‌సెరాట్ గుహలలో బంధువులతో హైకింగ్ చేస్తుండగా కొండపై నుండి 100 మీటర్లకు పైగా జారి పడిపోయాడని పోలీసు ప్రతినిధి తెలిపారు.
"మాంగో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఇసాక్ ఆండిక్ ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని కంపెనీ సీఈవో టోని రూయిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నిష్క్రమణ భారీ శూన్యతను మిగిల్చిందని, ఆయన కంపెనీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, వ్యూహాత్మక దృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
ఇస్తాంబుల్‌లో జన్మించిన ఆండిక్ 1960లలో ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కాటలోనియాకు వలస వెళ్లి 1984లో ఫ్యాషన్ బ్రాండ్ మ్యాంగోను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 4.5 బిలియన్ డాలర్లు. ఆయన ప్రస్తుతం కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయిన ఇండిటెక్స్ అధినేత అమాన్సియో ఒర్టెగాను ఢీకొట్టిన వ్యాపారవేత్త ఆండిక్.
తిరుగులేని బ్రాండ్
దాదాపు 2,800 స్టోర్‌లతో యూరప్‌లోని అతిపెద్ద ఫ్యాషన్ గ్రూపులలో మ్యాంగో ఒకటిగా ఉంది. దాని వెబ్‌సైట్ ప్రకారం మ్యాంగో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 15,500 మంది ఉద్యోగులతో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూపులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో కంపెనీ టర్నోవర్ 3.1 బిలియన్ యూరోలు.
Comments
Please login to add a commentAdd a comment