జలాశయాలకు మంచి రోజులు | Good days for reservoirs | Sakshi
Sakshi News home page

జలాశయాలకు మంచి రోజులు

Published Tue, Jun 16 2015 3:50 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Good days for reservoirs

శుభ్రతపై హెచ్‌ఎండీఏ దృష్టి కలుషితం కాకుండా చర్యలు
సాక్షి, సిటీబ్యూరో
: నగరంలోని కొన్ని జలాశయాలకు మంచి రోజులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ నిర్వహణ కొరవడి...చెట్లూపుట్టలతో అడవిని తలపిస్తున్న వీటిని శుభ్రం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. చెరువుల నిర్వహణ, పరిరక్షణ ఏ విభాగం పరిధిలోకి వస్తుందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఇవి తూటికాడ, ముళ్లచెట్లతో నిండిపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. ఇటీవల దుర్గంచెరువు, రంగథామిని చెరువు, హుస్సేన్ సాగర్ వద్ద గల ఎస్టీపీలు (సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల)ను సందర్శించిన హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా... ఆ జలాశయాల ను చూసి విస్తుపోయారు.

వాటి దుస్థితికి కారణాలను ఆరా తీశారు. అక్కడ కేవలం ఎస్టీపీలను మాత్రమే హెచ్‌ఎండీఏ నిర్వహిస్తోందని, శుభ్రత వ్యవహారాలను జీహెచ్‌ఎంసీ చూస్తోందని వారు ఆమె దృష్టికి తెచ్చారు. కూకట్‌పల్లిలోని రంగథామిని చెరువులో ఏపుగా పెరిగిన గుర్రపుడెక్క, ముళ్లకంపలను వెంటనే తొలగించి జలాశయాన్ని శుభ్రంగా తీర్చిదిద్దాలని ఆమె ఆదేశించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దుర్గం చెరువు, రంగథామిని చెరువు, హుస్సేన్ సాగర్‌లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. రంగథామిని చెరువులో తూటికాడ తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ జలాశయం షోర్ లేన్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టిందన్న సాకుతో నాలాల నుంచి వచ్చే ఫ్లోటింగ్ మెటీరియల్‌ను తొలగించే పనులను ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులు నిలిపివేశారు. దీంతో సాగర్ షోర్ లేన్ దుర్భరంగా తయారైంది. నెక్లెస్ రోడ్‌లో దుర్గంధం వెదజల్లుతుండటంతో పరిస్థితిని గమనించిన కమిషనర్ సాగర్‌లో ఫ్లోటింగ్ మెటీరియల్‌ను ఎప్పటికప్పుడు తొలగించేందుకు పాత విధానాన్నే అనుసరించాలని ఆదేశించారు. దీంతో మళ్లీ డీయూసీలతో పాటు ప్రత్యేకంగా కూలీలను పెట్టి శుభ్రత పనులను ఇంజినీరింగ్ అధికారులు ప్రారంభించారు.
 
దుర్గం చెరువు దుస్థితి....
దుర్గం చెరువును సందర్శించిన కమిషనర్ శాలిని మిశ్రా అక్కడి దృశ్యాలను చూసి కంగుతిన్నారు. ఎంతో శ్రమకోర్చి మురుగు నీటిని శుద్ధి చేశాక చెరువులో నింపే క్రమంలో మళ్లీ దారుణంగా కలుషితమవుతున్న తీరు కమిషనర్ కంటపడింది. ఎస్టీపీ ఔట్‌లెట్ నుంచి చెరువులోకి వచ్చే పరిశుభ్రమైన నీటిలో స్థానికులు బట్టలు ఉతుక్కుంటూ, స్నానాలు చేస్తూ కనిపించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మురుగునీటిని శుద్ధి చేస్తున్నా... మళ్లీ కలుషితమై చెరువులో కలుస్తున్న తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలా జరగడానికి వీల్లేదని... చెరువుల వద్ద నిఘా ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆమె సూచించారు. ఇదే సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్ద గల 30 ఎంఎల్‌డీ, 20 ఎంఎల్‌డీ ఎస్టీపీలను కమిషనర్ సందర్శించి పరిసరాలను పరికించారు. ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీరు వెలుపలకు వస్తున్నా... నాలాల్లోకి చేరేసరికి అవి మళ్లీ మురుగుమయంగా మారుతున్న తీరును గమనించారు. ఎస్టీపీల వద్ద నాలాలను సైతం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొసమెరుపు : నాలాల ఎగువ (అప్పర్ స్ట్రీం) ప్రాంతంలో శుభ్రం చేయకుండా... కేవలం జలాశయాల ఎస్టీపీల వద్ద (డౌన్ స్ట్రీంలో) పనులు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటన్నది అధికారులకే తెలియాలి మరి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement