కోయిల్‌కొండ, గండేడ్,
కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద నిర్మాణం
{పభుత్వానికి సర్వే ప్రాథమిక నివేదిక
41 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం.. ఎత్తిపోతలకయ్యే విద్యుత్‌కోసం ఏడాదికి 1,250 కోట్ల ఖర్చు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సమగ్ర స్వరూపంపై క్రమేపీ స్పష్టత వస్తోంది. ఈ పథకం సర్వే పనులను చేపట్టిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ, వివిధ కీలక అంశాలపై ఇప్పటికే సర్వే పూర్తి చేసి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని తరలించేందుకు మహబూబ్‌నగర్ నుంచి రంగారెడ్డి మీదుగా నల్లగొండ వరకు మధ్యలో మూడు భారీ రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక సర్వేలో తేల్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ వద్ద 70 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లా గండేడు వద్ద 45 టీఎంసీలు, ఇదే జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద మరో 10 టీఎంసీలతో రిజర్వాయర్లు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు.
ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సుమారు 44వేల ఎకరాలు అవసరం ఉంటుందని, 41 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చారు. అరుుతే వీటి నిర్మాణానికి అవసరమయ్యే నిధుల వివరాలపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతకు రాలేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మూడు జిల్లాల పరిధిలోని సుమారు 10లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గత జూలై నెలలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీకి రూ.5.73కోట్లను విడుదల చేసింది. ఆగస్టు తొలివారం నుంచి సర్వే పనులను చేపట్టిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఇప్పటికి రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు, ముంపు ప్రాంతాలకు సంబంధించిన సర్వే పూర్తి చేసింది. వీటిల్లో పైప్‌లైన్, ఓపెన్ చానల్, టన్నెల్ అలైన్‌మెంట్, రిజర్వాయర్ల గుర్తింపు, పంపింగ్ స్టేషన్లు, ముంపు గ్రామాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. మిగతా డిస్ట్రిబ్యూటర్ల సర్వే పనులను డిసెంబర్‌లోగా పూర్తిచేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని సంస్థ నిర్ణయించింది.
మొదటి రిజర్వాయర్ ..కోయిల్‌కొండ
సర్వే వివరాల ప్రకారం మొదటి రిజర్వాయర్‌ను కోయిల్‌కొండ వద్ద 70 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో నిర్మిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి ఒక ప్రధాన కాల్వ ఉంటుంది. కాల్వల అలైన్‌మెంట్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక్కడి పంపింగ్ స్టేషన్ వద్ద 160 మెగావాట్ల సావుర్థ్యం గలిగిన 14 పంపులను వాడాల్సి ఉంటుంది. ఈ రిజర్వాయర్ కింద మొత్తంగా 31 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండగా 27వేల ఎకరాలు ముంపునకు గురవుతారుు. ఈ రిజర్వాయర్ ప్రధాన కాల్వ ద్వారా 75వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందిస్తారు.
రెండో రిజర్వాయర్..గండేడు
రెండో రిజర్వాయర్‌ను రంగారెడ్డి జిల్లా గండేడు వద్ద 45 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు. రిజర్వాయర్ నుంచి రెండు ప్రధాన కాల్వ కింద మొత్తంగా 5.2లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇక్కడి పంపింగ్ స్టేషన్ వద్ద 160 మెగావాట్ల సావుర్థ్యం కలిగిన 5 పంపులను ప్రతిపాదించారు. రిజర్వాయర్ కింద 8 గ్రామాలు, 12,283 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చారు.
మూడో రిజర్వాయర్..కేపీ లక్షీదేవునిపల్లి
రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవునిపల్లి వద్ద 10 టీఎంసీల కెపాసిటీతో మూడో రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. దీని నుంచి మూడు ప్రధాన కాల్వలను ప్రతిపాదించిన సర్వే సంస్థ, సుమారు 4.05లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని పేర్కొంది. ఇక్కడ 70 మెగావాట్ల సావుర్థ్యం కలిగిన4 పంపులను ప్రతిపాదించారు. దీని కింద 2 గ్రామాలు, 4,100 ఎకరాల భూమి ముంపునకు గురౌతోంది.
విద్యుత్ అవసరం 2,255 మిలియన్ యూనిట్లు..
రిజర్వాయర్‌ల నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు ఏటా 2,255 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కకట్టారు. యూనిట్‌కు రూ.5.40పైసల చొప్పున రూ.1,250 కోట్ల ఖర్చవుతుందని నివేదికలో స్పష్టం చేశారు.
‘పాలమూరు’పై 3 రిజర్వాయర్లు
Published Tue, Oct 7 2014 1:30 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM
Advertisement
Advertisement