
తాగునీటికి ప్రాధాన్యత
ఔరంగాబాద్, పుణే, నాసిక్ విభాగ కమిషనర్లతో సీఎం
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సూచించారు. తాగునీటికి తొలి ప్రాధాన్యతనిచ్చిన తర్వాతే మిగతా అవసరాలపై దృష్టి సారించాలన్నారు. వర్షా బంగ్లాలో శుక్రవారం ఔరంగాబాద్, పుణే, నాసిక్ విభాగ కమిషనర్లతోపాటు ఈ మూడు విభాగాల్లోని 20 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కరువు పరిస్థితి ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే విషయమై నివేదికలు రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. తాగునీటి కోసం ముఖ్యమంత్రి నిధి నుంచి రూ. కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
వీలైనంత త్వరగా ఈ నిధులను వినియోగించుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకునే విధానాలను అనుసరించాలని, తాగునీటికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు నీరు వృథాకాకుండా చూడాలన్నారు. కలెక్టర్ల అనుమతి లేకుండా జలాశయాల్లోని నీటిని విడుదల చేయవద్దన్నారు. నీటి సరఫరా పథకానికి, సిమెంట్ నాలా ఆనకట్టల నిర్మాణానికి కావల్సిన నిధులను ప్రతి జిల్లాకు అందచేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి ప్రధాన కార్యదర్శికి అందజేయాలన్నారు. ఇక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, అందుకు అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.ఎస్. సహారియా, వ్యవసాయశాఖ ఉన్నత ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధీర్‌కుమార్ గోయల్, ఆర్థికశాఖ ఉన్నత ప్రధాన కార్యదర్శి సుధీర్‌కుమార్ శ్రీవాస్తవ్‌లతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
వర్షాభావం కొనసాగితే తాగునీటికి కోతే...
ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో నగరంలోని జలాశయాల్లో నీటి స్థాయి తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే నగరవాసులకు నీటి సరఫరాలో 15 శాతం కోత విధించే అవకాశం ఉంటుందని పురపాలక సంఘ అధికారులు శుక్రవారం చెప్పారు. జూన్ నెలలో ఇప్పటివరకు మూడు శాతం వర్షపాతం మాత్రమే నమోదైందని గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీఎం)కు చెందిన సీనియర్ అధికారి అన్నారు. సాధారణంగా ఇప్పటికి 15 శాతం వర్షపాతం నమోదు కావాలని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో నగరంలో వర్షాలు కురవకపోతే నీటి సరఫరాలో 10 నుంచి 15 శాతం కోత విధించక తప్పదని అన్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో జరగనున్న సమీక్షా సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్ బంబాలే చెప్పారు.
నగరంలో వర్షాలు ముఖం చాటేసిన నేపథ్యంలో పౌరులు నీటిని పొదుపుగా వాడాలని, తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించరాదని బంబాలే సూచించారు. నీటి కొరత ఏర్పడినందున నీటిని వృథా చేయకూడదని పౌరులను హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ సమయంలో ఎంతగా వీలైతే అంతగా నీటిని సంరక్షించుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో వర్షాలు కురుస్తాయో లేదో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని బంబాలే ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీరు కూడా ఇంకిపోతే ఇక తాము చేసేదేమీ ఉండదని ఆయన నిరాశను వ్యక్తం చేశారు. ప్రస్తుతం, నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు ప్రధాన చెరువుల్లో 1.32 లక్షల మిలియన్ లీటర్ల నీరు ఉందని బంబాలే చెప్పారు.
ఈ నీరు ఒక నెలకు మాత్రమే సరిపోతుందని అన్నారు. గతేడాది ఇదే సమయంలో 3,33,906 లక్షల మిలియన్ లీటర్ల నీరు ఉందని పేర్కొన్నారు. నగరంలో నీటి సంక్షోభం ఇంతకుముందు 2009 జూలైలో ఏర్పడిందని, అప్పుడు 30 శాతం కోత విధించాల్సి వచ్చిందని బంబాలే గుర్తు చేశారు. ముంబై నీటిసరఫరా నెట్‌వర్క్ అనుమతించిన మేరకు గరిష్టంగా నీటి సరఫరాలో కోత విధించామని ఆయన చెప్పారు.