
హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర వాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు పది కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో 111ను సవాల్ చేసిన వ్యాజ్యాలు, సమర్థిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసుల్లో ప్రతివాదులందరూ తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులందరూ మార్చి మొదటి వారంలోగా కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాతి వారంలో తుది విచారణ జరుపుతామని ప్రకటించింది.
విచారణ మార్చి రెండో వారానికి వాయిదా
నిపుణుల సూచనలు, శాస్త్రీయ ప్రతిపాదనలు లేకుండా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు పది కిలోమీటర్ల పరిధి వరకూ నిర్మాణాలు నిషేధిస్తూ 1996లో ప్రభుత్వం జీవో 111ను జారీ చేయడం చెల్లదని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. ఆ ప్రాంతంలో పలు ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణాలు జీవో 111ను ఉల్లంఘించే జరిగాయని జీవోను సమర్థిస్తూ దాఖలైన వ్యాజ్యాల తరఫు న్యాయవాది ప్రతివాదన చేశారు. జీవో అమలు, వాస్తవ పరిస్థితులపై శాస్త్రీయ సర్వే కోసం నియమించిన అధికారిక కమిటీ నివేదిక అందాల్సివుందని హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్ జనరల్ హాజరవుతారని, అందుకు సమయం కావాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనల అనంతరం విచారణ మార్చి రెండో వారానికి వాయిదా పడింది.