నిండిన జలాశయాలు:లోతట్టు ప్రాంతాలు నీట మునక
విజయవాడ: ఏపిలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలకు వరద నీటి తాకిడి ఎక్కువైంది. చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
తుంగభద్ర డ్యామ్లో వరద నీటి ఉధృతి
కర్నూలు: తుంగభద్ర డ్యామ్కు వరద నీటి ఉధృతి పెరిగింది. ప్రస్తుత నీటి మట్టం 1632 అడుగులు ఉంది. ఇన్ఫ్లో 11వేల 33 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6 వేల 484 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసుల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 16 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 13వేల క్యూసెక్కులు ఉంది. 18 గేట్లు ఎత్తివేశారు. 80వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైల జలాశయానికి విడుదల చేశారు.
నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
నెల్లూరు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులకు గండ్లుపడి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాలలో భారీగా వర్షం కురిసింది. ఉదయగిరిలో రికార్డు స్థాయిలో 214.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సీతారామపురం మండలం చిన్ననాగంపల్లి, అప్పసముద్రం చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
పులిచింతల రిజర్వాయర్కు వరద నీరు
గుంటూరు: పులిచింతల రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో అధికారులు తొమ్మిది గేట్లను 2 మీటర్ల మేర ఎత్తివేశారు. 90,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 11.67 టీఎంసీలు ఉంది. మరోవైపు ప్రాజెక్ట్ పరిధిలోని ముంపు గ్రామాలకు నీటి ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది.
జక్కల్ చెరువుకు గండి
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. శెట్టూరులో 16 సెంటీమీటర్లు, బొమ్మనహళ్, బ్రహ్మసముద్రంలో 11, కంబదూరు, హీరేహెరాళ్లలో 9, గుత్తి, గుమ్మగట్టలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వరి, వేరుశనగ పంట పొలాలు దెబ్బతిన్నాయి. గుత్తి మండలంలో జక్కల్ చెరువుకు గండిపడింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించింది.
**