ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సరిహద్దుల్లోని ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉరకలేస్తుండటంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. ఆసిఫాబాద్ మండలం కుమురంభీమ్ ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. గరిష్ట స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా, గురువారం 240.750 మీటర్లకు చేరింది. ఇదే మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 239.50 మీటర్లు కాగా, 233.750 మీటర్లకు చేరింది.
దహెగాం మండలం పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టులో నీటి మట్టం 147.550 మీటర్లుకు చేరింది. సాత్నాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 285.50 మీటర్లు ఉంది. మత్తడివాగు ప్రాజెక్టు నీటిమట్టం 277.50 మీటర్లు కాగా.. 276.400 మీటర్లకు చేరింది. కడెం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 697.050 అడుగులు ఉంది.
ఆల్మట్టికి పెరిగిన వరద
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాలు పుంజుకున్నాయి. గురువారానికి 6 టీఎం సీల చొప్పున 63,465 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరు తోంది. ప్రస్తుతం నీటి నిల్వ 129 టీఎంసీలకు గానూ 69.80 టీఎంసీలకు చేరింది. తుంగభద్రలోకి 49,790 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ 10 టీఎంసీల నిల్వలకు గానూ 54.34 టీఎంసీల నిల్వలున్నాయి. నాగార్జునసాగర్‌లోకి 1,558 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
దీంతో ఇక్కడ 312 టీఎంసీల నిల్వకు గానూ 133.37 టీఎంసీల నిల్వ ఉంది. ఎస్సారెస్పీకి 1,200 క్యూసెక్కులు వస్తుండగా అక్కడ 90 టీఎంసీలకు గానూ 12.33 టీఎంసీలు, కడెంలోకి 7,886 క్యూసెక్కులు వస్తుండగా 7.60 టీఎంసీలకు గానూ 7.12 క్యూసెక్కుల నిల్వ ఉంది. ఎల్లంపల్లికి 3,932 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అక్కడ 20 టీఎంసీలకు 8.88 టీఎంసీల నిల్వలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment