సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న పలువురు వ్యక్తులను ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు, ఆయా జిల్లా యంత్రాంగాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద సింగరేణి ఇన్‌టేక్‌వెల్‌లో బుధవారం ఉదయం విధులకు వెళ్లి చిక్కుకున్న ఏడుగురు కార్మికులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అలాగే గంగానగర్ సమీపంలోని రెడ్డి కాలనీలో వరదలో చిక్కుకున్న 25 మందిని, రఘుపతినగర్‌లో 25 మందిని, సప్తగిరికాలనీలో చిక్కుకున్న 13 మందిని కాపాడారు. పడవల ద్వారా వారి ఇళ్లవద్దకు వెళ్లిన రెస్క్యూ బృందాలు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అలాగే బుధవారం సాయంత్రం వరదనీటిలో చిక్కుకున్న రెండు గురుకులాలకు చెందిన 400 మంది విద్యార్థులను కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు.
రాత్రంతా వాటర్‌ట్యాంకుపైనే..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామంలో పశువులను తీసుకువచ్చేందుకు వెళ్లిన సొదారి గట్టయ్య, సొదారి సారయ్య మధ్యలో గోదావరి ఉధృతి పెరగడంతో వరద నీటిలో చిక్కుకుని బుధవారం రాత్రంతా వాటర్‌ట్యాంకుపై బిక్కుబిక్కుమంటూ గడిపారు. గురువారం ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన హెలికాప్టర్ పంపించడంతో వారిని రక్షించారు.
వరదలో చిక్కుకున్న 9 మంది భద్రం
కరీంనగర్ శివారు వల్లంపహాడ్ సమీపంలోని దుర్శేడు వాగులో చిక్కుకుపోయిన ఒడిశాకు చెందిన తొమ్మిదిమందిని ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు కాపాడాయి. గంగాధర మండలం నారాయణపూర్ పెద్ద చెరువుకు గండి పడడంతో.. బుధవారం రాత్రి దుర్శేడు వాగు పొంగి పక్కన ఉన్న ఇటుక బట్టీల చుట్టూ నీళ్లు చేరాయి. అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు వరదలో చిక్కుకున్నారు. గురువారం ఉదయం మంత్రి గంగుల కమలాకర్ చొరవతో ఆరుగురు పెద్దలు, ముగ్గురు చిన్నారులను కాపాడి సురక్షితంగా బయటకు తెచ్చారు.
వరదలో కొట్టుకుపోయిన వృద్ధుడు
నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన చిన్న అబ్బు అలియాస్ బాపన్న(65) అనే వృద్ధుడు వరద నీటిలో గల్లంతయ్యాడు. నగరంలోని ఓ రైస్‌మిల్లు లో నైట్ వాచ్‌మన్‌గా పని చేస్తున్న బాపన్న రెండురోజుల క్రితం మిల్లుకు వెళ్లాడు. అయి తే భారీ వర్షాలకు ఇంటికి రాలేక అక్కడే ఉండిపోయాడు. గురువారం ఉదయం కాస్త వర్షం తగ్గటంతో సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. ఖానాపూర్ గ్రామ చౌరస్తా సమీపంలోని వంతెన మీదుగా వెళ్తున్న బాపన్న చేతిలోని గొడుగు ఒక్కసారిగా గాలికి ఎగిరి పోయింది. గొడుగును పట్టుకునే క్రమంలో ఆయన సైకిల్‌తో సహా వరద నీటిలోపడి కొట్టుకుపోయాడు. రాత్రివరకు గాలించినా ఆచూకీ తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment