నిర్మల్, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడు వర్షాకాలం ఆరంభం నుంచే వర్షాలు అధికంగా కురియడం, జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు అమాంతం పెరిగిపోయాయి. 5.05 మీటర్లపైనే భూగర్భజలాలు ఉండగా, గతేడాదిలో పోల్చుకుంటే 4.12 మీటర్లు పెరిగాయి.
సాధారణం కంటే 90 శాతం అధికం...
జూలైలో సరాసరి 558.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 1056.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 90 శాతం అధిక వర్షపాతం నమోదుకావడంతో జిల్లాలో భూగర్భజలాలు అమాంతం 5.05 మీటర్ల పైకి వచ్చాయి. గతేడాది సరాసరి కురియాల్సిన వాటి కంటే 14 శాతం తక్కువ నమోదు కావడంతో గత జూలైలో 9.17 మీటర్ల లోతులో ఉన్నాయి. కాగా ఈ ఏడాది మేలో 10.06 మీటర్లు, జూన్‌లో 7.85 మీటర్ల లోతులో ఉన్నాయి.
మీటరు కంటే తక్కువ లోతులోనూ..
భూగర్భ జలాలను తెలుసుకునేందుకు భూగర్భ జలశాఖ వారు జిల్లా వ్యాప్తంగా 75 ఫిజియోమీటర్లను ఏర్పాటు చేశారు. కురుస్తున్న వానలకు జిల్లాలో మీటరు కంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అనేక చోట్ల నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కొమ్ముగూడ, భీమిని, రాంపూర్, గుడిహత్నూర్, జైనథ్, జైనూర్, కడెం, కాగజ్‌నగర్, మామడ, నార్నూర్, నిర్మల్, తిర్యాణి, ఉట్నూర్ ప్రాంతాల్లో మీటరు కంటే తక్కువ లోతులోనే భూగర్భజలాలు ఉన్నాయి.
డివిజన్ల వారీగా...
జిల్లాలోని నాలుగు డివిజన్ల వారీగా చూసుకుంటే భూగర్భ జలాలు గతంలో కంటే ఆశాజనకంగా ఉన్నాయి. ఆదిలాబాద్ డివిజన్‌లో గతేడాది జూలైలో 5.44 మీటర్ల లోతులో ఉండగా.. ఈ ఏడాది జూలైలో 2.32 మీటర్ల లోతులో ఉన్నాయి. నిర్మల్ డివిజన్‌లో గతేడాది 10.47 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి 7.30 మీటర్ల లోతులో, ఉట్నూర్ డివిజన్‌లో గతేడాది 6.89 మీటర్ల లోతులో ఉండగా.. ఈ ఏడాది 3.55 మీటర్ల లోతులోనే ఉన్నాయి. మంచిర్యాల డివిజన్‌లో గతేడాది 10.05 మీటర్ల లోతులో.. ఈసారి 4.57 మీటర్ల లోతులో, ఆసిఫాబాద్ డివిజన్‌లో 12.44 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది 4.23 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. ఇంతటి ఆశాజనకమైన భూగర్భజలాలు ప్రస్తుతం ఉన్నా వేసవివచ్చిందంటే చాలు భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కురుస్తున్న జలాలను ఒడిసిపట్టకపోవడమే.
జలాలను ఒడిసిపట్టలేక...
జిల్లాలో కురవాల్సిన వర్షపాతం కంటే అధికాంగా నమోదైనా ఆ జలాలను ఒడిసిపట్టలేకపోతున్నాం. అందుకే ఏటా విలువైన నీరంతా వృథాగా పోతోంది. ప్రధానంగా వేసవి వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతాలు, గుట్టప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంటోంది. ఏజెన్సీ, గుట్ట ప్రాంతాల్లో అవసరమైనంత చెరువులు, కుంటల నిర్మాణాలు చేపట్టకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. నీటి సంరక్షణకు చెరువులు, కుంటల నిర్మాణంతోపాటు గుట్టప్రాంతాల్లో చెక్‌డ్యాంలు నిర్మిస్తే భూగర్భజలాలను కూడా పెంచుకునే వీలుంటుంది.
గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు
Published Wed, Aug 7 2013 4:43 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement